Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తాళం చెవి పోయిందిరా'
అంటూ ఇంటి అరుగు మీద
కూల బడ్డాడు బాల్య మిత్రుడు.
'ఇప్పుడు తాళం చెవి మీద
కవిత్వం చెప్పు చూద్దాం' అన్నాడు.
'పోగొట్టు కుంటే తెలిసిందా విలువ'
అంటూ గొంతు సవరించుకొని రాసుకొమ్మన్నాను.
'తాళం చెవి
ఒక లోహం ముక్క.
దాన్నితాళంలో జొనిపి తిప్పితే
ముడి వడ్డ లంకెను విడగొడ్తుంది
అప్పుడు తెరుచు కుంటాయి తలుపులు.
చూశావా
ఇది ఎంత అందంగా వుందో!
తల మీద గంప నెత్తు కున్న
శ్రామిక యువతిలా లేదూ!!'
'నీ బుద్ధి
పోనిచ్చు కున్నావు కాదు'
అన్నట్టు ఓ నవ్వు విసిరాడు.
'అయితే విను
ఆమె బొడ్లో దోపుకున్న
తాళం చెవుల గుత్తి
నడుస్తుంటే
శ్రావ్యమైన సంగీతాన్ని వెదజల్లుతుంది.
మెడలోని ఆభరణాల కంటే
నడుం పైన తిష్ట వేసిన
ఆస్తి పాస్తుల ఖరీదే ఎక్కువ.'
అసంతప్తిగా
మొహం పెట్టాడు మిత్రుడు
'ఇదంతా నీ పైత్యం
దీని నుండి ఏం గ్రహించాలో చెప్పు'
'అబ్బో! ఫిలాసఫీలో పడ్డావా
అయితే విను'
'తాళం చెవి
జ్ఞాన తష్ణకు ఒక ప్రతీక
రహః పేటికను తెరిచి
లోపలి వస్తువులకు
వ్యాఖ్యానం రచించే టీక,
తాళం లోపలంతా చీకటి
దానిలో వెలుగు కిరణాలకు
పాదులు తీసే మత్తిక'
'మిత్రమా!
తాళం చెవి అంటే
తలుపునకూ తాళానికీ
కుదిరిన స్నేహం,
రెండు ప్రపంచాల మధ్య
తెరలు తొలగిన వైనం.
'కీ' దొరికితే
ఏ సమస్య కీళ్లయినా విరవొచ్చు.
చిరకాలంగా బాధించే
అనారోగ్య రుగ్మతకు
పరిశోధనే ఒక పరిష్కారం.
చింత మనస్సును
ఎన్నాళ్లుగా కాల్చేస్తుందో!
శివ జటాఝూటంలోని ఒక పాయను విప్పి
గంగను విడవటమే తరుణోపాయం.
లోకం నిండా అశాంతి
స్వార్థం, కల్లోలం, అలజడి
విశ్వ మానవ ప్రేమను
ఆవాహన చెయ్యడానికి
పక్కవాడిని ప్రేమించుటమే మౌలిక'
'అర్థమైందిరా ఇక చాలు'
అన్నాడు మిత్రుడు
'ఇప్పుడు నాకు
అసలైన తాళం చెవి దొరికింది' అన్నాడు.
- డా|| ఎన్. గోపి