Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు కవులు, రచయితలు ఏది చెప్పినా, రాసిన జీవితంలో గందరగోళంగా ముడిపడి ఉన్న అనేక సమస్యలను ఎత్తిచూపుతూనే, వాటికి చక్కని పరిష్కార మార్గాన్ని తమదైన తాత్విక, ఆధ్యాత్మిక, దష్టి కోణంలో చూపుతారు. వారు సూచించిన మార్గాలను అన్వేషించి, అర్థం చేసుకున్నప్పుడు, అప్పటివరకు ఒడిదొడుకులు ఎదుర్కొన్న వారు చక్కని పరిష్కారం దొరికినట్టు భావించి, ప్రశాంత మందిరంలోకి ప్రవేశించి, వారిని వారు పరిపూర్ణ మనుషులుగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి రచనలు చేస్తున్న రచయితలలో అనిశెట్టి శ్రీధర్ ఒకరు. వీరి కథలు చదివిన తర్వాత కథలు, కథలుగా చెప్పుకోవచ్చు. ఒక అంశాన్ని ప్రధాన కేంద్రంగా చెబుతూనే, అనేక అంశాలను తన కథల్లో లేవనెత్తుతాడు. ప్రశ్నలు సంధించి, పాఠకులను బంధించి, చివరిగా రచయితే సమాధానపరుస్తాడు. నేటి మేటి కథా రచయితల్లో ఒకరిగా చెప్పుకునే రచయిత అనిశెట్టి శ్రీధర్. శ్రీధర్ రచించిన ''కొత్త బంగారు లోకం'' కథా సంపుటిలో అనేకమైన వైవిధ్యభరితమైన కథలున్నాయి. ''కొత్త బంగారు లోకం'' నిజంగా ఎవరికి అవసరం అనే ప్రశ్న ఉదయింపజేస్తాడు. ప్రతి ఒక్కరూ ప్రశ్నకు సమాధానాన్ని ఆలోచించకుండా, పరిష్కారాన్ని వెతుక్కోకుండా కొట్టుమిట్టాడే సమాజంలోని వ్యక్తులకు అనిశెట్టి శ్రీధర్ కథలు చదివాక, రచయిత చూపెట్టిన దారులు తెలిశాక కొత్త బంగారు లోకంలో విహరిస్తారు. ప్రతి కథలో ఒక పాత్రని నాయకుడిగా చూపెట్టడం కంటే, నాయకుడు కావడానికి కావలసిన లక్షణాలను, సమస్యలు వచ్చినప్పుడు అధిగమించాల్సిన వనరులను వెతకమని సూచిస్తాడు. వాటన్నింటిన్ని ఛేదించిన తర్వాత నాయకుడిగా ప్రపంచానికి పరిచయమయ్యే నాయకుడిని తన కథల్లో తయారు చేస్తాడు. జీవితాలలో స్వేచ్ఛ అనే మాటకే స్థానం ఉండని స్థానంలో ఉంటారు. పుట్టింటి వారి పేరు, ప్రతిష్టలు నిలబెట్టాలని వేడుకునే తల్లిదండ్రులు, మెట్టినింటిలో కుక్కిన పేనులా పడుండాలని, అత్తమామల సేవనే పరమావధిగా భావించాలని ఆశిస్తారు. భర్తను, ఇంటినే పరమావధిగా భావిస్తూ, బంధనాల మధ్య అణగిమణగి ఉండి, ఆర్థిక స్వతంత్రానికి ఏమాత్రం నోచుకోని స్త్రీల జీవితాలున్నాయి. జీవితాంతం మెట్టినింట్లో కనీసం తీరికగా కొన్ని గంటలు గడిపే వెసులుబాటులేని కుటుంబాలున్నాయనడంలో సందేహం లేదు. అలాంటి స్త్రీలు నిత్యం ఎదుర్కొనే సమస్యలను కళ్లకు కట్టే లీల పాత్ర ద్వారా ''స్పహ'' కథలో తెలిపాడు రచయిత. లీల లాంటి స్త్రీలు ఎదుర్కొనే ఎన్నో విషయాలను సున్నితంగా విమర్శించాడు రచయిత. శ్రీశైలం నుంచి విజయవాడ వెళ్తున్న విశాలికి తన మిత్రురాలు లీలను చూడాలనుకుంటుంది. ఆ కుతూహలంతో బస్సు దిగి లీల ఇంటికి చేరుకుంటుంది. ఒక రోజంతా లీల ఇంట్లో విశాలి ఉంటుంది. లీల ఉదయం లేచినప్పటి నుంచి చేసే పనులను, పరిస్థితులను, అత్తమామలు, భర్త స్వభావాలను గమనిస్తుంది. సూర్యుని కంటే ముందే లేచి, చంద్రుడు నడినెత్తికి చేరుకున్నాక నిద్రలోకి జారుకునే లీలను చూసి విశాలి బాధపడుతుంది. లీల పొద్దస్తమానం కోళ్ల ఫారంలో పని వాళ్ళ కన్నా ఎక్కువ పని చేస్తుంది. భర్తకు ఏమాత్రం ఎదురు తిరగని, పనికి వెన్ను చూపని మనిషి లీల. విశాలి లీల ప్రత్యక్ష సంఘటనలను గమనించి చలించిపోతుంది. చాలా మంది స్త్రీలు ఇలా సర్దుకుపోయే మనస్తత్వాలను ఈ కథలో రచయిత అద్దం పట్టేట్టు తెలిపాడు. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులకు ఎలాంటి వివక్ష ఉండదు. సాధ్యమైనంత వరకు మట్టిలో మాణిక్యాలను, మంచి మనసు గల మల్లెపువ్వులాంటి పరిమళ గంధాలను అందించే ప్రేమనే తల్లిదండ్రులు కురిపిస్తారు. పిల్లలు ఎంత ప్రేమగా పెంచిన, పంచిన తల్లిదండ్రుల మీద అదే ప్రేమను చూపించడంలో విఫలమయ్యే పిల్లల గురించి రాసిన ''పాత సామాను'' కథలో కొందరూ తల్లిదండ్రులను సాకే ఆర్థిక వనరులు లేక, అన్నం పెట్టలేక వదిలించు కోవడానికి ప్రయత్నం చేస్తారు. అనాథాశ్రమాలలో వదిలివేసేవారు కొందరు. అనాథాశ్రమంలో వదిలేయకున్నా అన్నం దగ్గర, అవసరాల దగ్గర, చీదరించుకుని, అసహ్యించుకునే వారున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లైనా, ఎన్నో పనులలో సహాయపడిన కనీసం తల్లిదండ్రుల వయస్సుకు గౌరవాన్ని, మర్యాదను ఇవ్వకుండా, హీనమైన, నీచమైన మాటలు బాకుల్లా గుచ్చే పిల్లలు నేడు ఎందరో ఉన్నారు. అలాంటి బాధను, వేదనను భరించే తల్లుల తరపున వారి కష్టాలను, బాధలు ఎవరితో, ఎలా పంచుకోవాలో తెలియక తమలో తామే కశించే తల్లుల దీనగాథను ''పాత సామాను'' కథలో రచయిత వ్యక్తీకరించాడు. ఉద్యోగస్తుడైన ఆర్థికస్థోమత లేక టీవీ కొత్తదే కొన్న, టీవీ స్టాండ్‌ను మాత్రం పాత సామాను కొట్టులో కొనడానికి వెళ్లిన ఉద్యోగస్తుడు. ఆ కొట్టులో రతన్ బాబా తల్లి ఎప్పుడూ పని చేసుకుంటూనే ఉంటుంది. ఎంత పని చేసిన కొడుకు ఏమాత్రం తల్లికి విలువ ఇవ్వడు. పైగా మనవడు కూడా నానమ్మను దుర్భాష లాడుతాడు. తల్లికి ఇష్టమైన టీవీని చూడనివ్వరు. భర్త ఉన్నప్పుడు అలవాటైన పాన్‌ను నమలడానికి డబ్బులు ఇవ్వరు. తన బాధలు ఎవరికి చెప్పుకునే, అర్థం చేసుకునేవారు చుట్టూ ఉండరు.
ఇవన్నీ పాత సామాను కొనడానికి వచ్చిన ఉద్యోగస్తుడైన వ్యక్తితో రతన్ బాబా తల్లి చెప్పుకుంటుంది. రచయిత వద్ధుల పక్షాన ఆలోచించి, వారు చనిపోయే వరకు ఆస్తిపాస్తులు వారి పేరునే ఉండాలని, అప్పుడైనా తల్లిదండ్రులను ఆస్తి మీద ప్రేమతోయినా, కనీస సౌకర్యాలు సమకూర్చే వెసులుబాటు ఉందనే ఆశావహ దక్పథాన్ని వెల్లడించడంలో రచయితకున్న దక్పథం వెల్లడవుతుంది. కొందరు భయం గుప్పెట్లో జీవితాన్ని సాగిస్తుంటారు. ఏదో అయిపోతుందని ఊపిరి బిగబట్టి, నలుగురు చేసిందే మనం చేయాలని, కొత్త ఆలోచనలు లేకుండా, దేనిని ఆస్వాదించకుండా, కొన్నింటిలో కొన్నింటికే పరిమితమై అదే జీవితంగా భ్రమించేవారు కొందరూ. జీవితంలో ఏదీ ఆస్వాదించనివారున్నారు. చేసే పనులలో, ఉన్న ఉద్యోగంలో, ఉన్నతమైన ఆలోచనలు చేయని వారున్నారు. ఈ ''కొలంబస్'' కథలోని కొలంబస్ ఇలాంటి వ్యక్తులకు, ఆలోచనలకు వ్యతిరేకంగా, తనదైన కోణంలో, కొత్త భావాలను, అనుభూతులను పొందుతుంటాడు. ప్రతి దాన్ని మనసారా ఆహ్వానించే, ఆస్వాదించే గుణం కలవాడు. తన మిత్రులంతా కొత్తగా ఏది చేయడానికి ఇష్టపడక, చేసే పనిలోనే, ఉన్న దానిలోనే సర్దుకుపోయి బ్రతికే వెసులుబాటు గలవారు. కానీ కొలంబస్ కొత్త ప్రదేశాలను, విదేశాలను తిరగాలని, తనదైన పంథాలో ఆలోచిస్తుంటాడు. వివిధ దేశాలలో, వివిధ ఉద్యోగ విధులు నిర్వహిస్తుంటాడు. విహార యాత్రలు చేస్తాడు. సెలవు రోజుల్లో సొంత ఊరు వచ్చి తన చిన్ననాటి ముత్యాల్లాంటి మిత్రులను కలిసి, పోగేసే తీగలాంటి వాడు కొలంబస్. తాము జీవితంలో కోల్పోయింది. కొలంబస్ సాధించింది గుర్తు చేసుకుంటారు మిత్రులు. అన్ని సాధించే అర్హతలున్నా, ఏమి సాధించక కోల్పోయే వారి గురించి, సాధించే, అందుకునే అవకాశాలు సామర్థ్యం గురించి తెలిపే కథ. మనిషిలో ఉత్సాహం, ఉత్తేజం నింపే కథ. కొన్ని సాంప్రదాయాల పేరిట జరిగే వ్యవస్థలలో, కొందరి జీవితాలు వారికి తెలియకుండానే చీకటి కోపంలోకి నెట్టి వేయ బడతాయి. దుర్భరస్థితిలోకి జీవితాలు లాగ బడతాయి. అలా కోమలి లాంటి జీవితాలు వేశ్యలుగా ఎలా మారుతున్నాయో ''బందావనం'' కథలో రచయిత వివరించాడు. పిల్లలను కని, పెద్ద చేసినందుకు తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలకు, సజనాత్మకతకు, స్వేఛ్చనివ్వాలి. కానీ తల్లిదండ్రులు కోరుకున్న, నచ్చిన జీవితానికి అనుగుణంగా పిల్లలు జీవించాల్సిన అవసరం లేదు. ఆర్థిక స్వేచ్ఛ లేని స్త్రీలు, చదువుకున్నా, ప్రశ్నించలేని స్త్రీలున్నంత వరకు అన్యాయాలు, హింస ఆగదని ''స్త్రీ వేదం'' కథలో రాణి పాత్ర ద్వారా రచయిత సమాజ స్థితిగతులను, వాస్తవ సంఘటనలను చూపెట్టాడు రచయిత. స్త్రీలు సమాజంలో ఎదుర్కొనే, అనుభవించే బాధలను తేటతెల్లం చేసి, చివరికి స్త్రీలకు చక్కని పరిష్కార మార్గాన్ని చూపించాడు రచయిత. రాణి అనే అందమైన అమ్మాయిని తల్లి సుగుణ సినిమా ఇండిస్టీలోకి రావాలని, ప్రాధేయపడి, బలవంత పెడుతుంది. అయినా రాణి మొక్కవోని దీక్షతో కలెక్టర్ కోసం చదివి, ఉద్యోగం సంపాదిస్తుంది. స్త్రీలు ఎంత గౌరవ ప్రదమైన హౌదాల్లో, వత్తిలో ఉన్నా, హింస సహజమని భావించే మగాళ్లు చేసే ఆలోచనలకు చెంపపెట్టులాంటి కథ. నిత్యం వెకిలి చేష్టలు చేసే పై ఆఫీసర్ మన్మధరావును కోర్టు మెట్లు ఎక్కించి నిలదీస్తుంది రాణి. తన సాటి ఆఫీసరయిన ధర్మరాజు పేరుకు రాణి భర్తేయినా, చదువుకున్న విద్యావంతుడైన స్త్రీలను గౌరవించడు. స్త్రీలకు ఏవి అవసరం లేదన్నట్లు ప్రవర్తిస్తాడు ధర్మరాజు. ధర్మబద్ధంగా జీవిస్తున్న అనుకున్న ధర్మారాజుకి విడాకులిచ్చి స్వతంత్రంగా బ్రతుకుతుంది రాణి. స్త్రీలు అడుగడుడుగున ఎదుర్కొనే సమస్యలను చూపిస్తాడు రచయిత. ఈ కథా సంపుటిలో ఈ కథలేకాక, మరెన్నో కథలున్నాయి. మద్దతు, సహాయం, నెత్తురు కూడు, తుఫాను, తీరం చేరని నావ, బాధ్యత, జనజీవన స్రవంతి మొదలగు కథలు మనుషుల మనస్తత్వం, మారుతున్న, కాలానుగుణ పరిస్థితులను ఆకళింపు చేసుకొని రాసిన రచయిత అనిశెట్టి శ్రీధర్. నేటికి వీరి కలం నుండి అనేక పత్రికల్లో వీరి కథలు వెలువడుతూనే ఉన్నాయి. వత్తిరీత్యా బ్యాంక్ ఉద్యోగయ్యి, పదవి విరమణ పొందారు. తన కలానికి, అనుభ వానికి పదును పెడుతూ విలువైన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తు న్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే, ఆలోచనలు రేకెత్తించే, మానవత్వపు పరిమళాలను వికసించే, నిత్య చైతన్యవంతం చేసే, ప్రశ్నను సంధించే, సమాజంలో మార్పులు తీసుకువచ్చే రచనలు అనిశెట్టి శ్రీధర్ కలం నుండి మరిన్ని జాలువారాలి.
- బి.మహేష్
సెల్: 8985202723