Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదునాలుగు భాషలలో పదును తేలిన కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీత డా.నలిమెల భాస్కర్ రాసిన మరో భాషా పుస్తకం 'తెలంగాణ భాష-క్రియాపదాలు'. ఇంతకు ముందు భాస్కర్ కలం నుంచి వచ్చిన భాషా సంబంధ పుస్తకాలు : బాణము (వివిధ వ్యాసాలు), తెలంగాణ భాష-దేశ్యపదాలు, తెలంగాణ భాష-తమిళ పదాలు, తెలంగాణ భాష-సంస్కత పదాలు. మరెన్నో భాషాసంబంధ వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనయి. ఇప్పుడు ఈ క్రియా పదాలు. ఎనిమిది రోజుల్లోనే రాయడం విశేషం. మనసుకు వచ్చిందంటే అది పూర్తయేదాక మనసున పట్టని పట్టు వదలని మరో విక్రమార్కుడు నలిమెల భాస్కర్.
బాల్యం నుంచి దగ్గరగా చూసిన మిత్రునిగా చెప్తున్న ఈ మాటల్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దాదాపు ఇరువై ఏండ్ల క్రితమే భాస్కర్ ఒంటి రెక్కతో వేసిన 'తెలంగాణ పదకోశం' అందరికీ విదితమే. అది మంచి రెఫరెన్స్‌గా ఏండ్లుగా ఉంటూ వస్తున్నది. బహుజనపల్లివారి 'శబ్దరత్నాకరం' తన క్రియాపదాలుకు ఆధారం అని భాస్కర్ తన ముందు మాటలో చెప్పుకున్నడు.ఈ నిఘంటువులో ఉన్న అకర్మక, సకర్మక, ప్రేరర్థక క్రియలనన్నిటినీ గుర్తించి, అవి తెలంగాణ పల్లె ప్రజల భాషా వ్యవహారంలో ఎట్లున్నయో గమనించిన్నని అన్నడు. పద్యాల ఉదాహరణలను కూడా శబ్దరత్నాకరం నుంచే తీసుకున్నడు. నూటపదకొండు పేజీల ఈ వ్యాసాన్ని తొమ్మిది భాగాలుగా విభజించిండు. ఒక్కొక్క భాగానికి క్రియాపదాలే టైటిల్స్‌గా పెట్టిండు. 1.కాల్లల్ల కట్టెలు పెట్టుడు 2.వన్కడు జెన్కడు 3.ఒడిసిపోవుడు... ఇట్లా. తన ముందుమాట సైతం 'లేనత్తకన్న గుడ్డత్త నయం' అనే శీర్షికతో రాసిండు. మనం రోజూ ఎన్నో పదాలు వ్యవహరిస్తనే ఉంటం. కానీ ఆ పదస్వరూపం గురించి సాధారణంగా ఆలోచించం. ఏదైనా కొత్త వ్యవహారపదం భాస్కర్ దష్టికి వస్తే చాలు విడువడు.దాని మూలం దొరికేదాక వదలడు.వివిధ వ్యాకరణ కార్యాలతో రూపాంతరక్రమాన్ని విశ్లేషించేదాక కదలడు.
సాధారణంగా తెలంగాణలో కోడిపుంజు గూసింది అంటరు. తొలికోడి కూసింది అనరు.అయితే ఇంకొక అర్థంలో కూడా వాడుతరు. 'గూసు' అంటే చనిపోవు అని కూడా. ఇది ఎట్ల వచ్చిందో నలిమెల వివరించిండు. క్రుంకుుుకుంకు... కూకు... కూచు... కూసు... గూసు తాలవ్యీకరణం, సరళాదేశం మొదలైన వ్యాకరణ కార్యాలతో రాబట్టిండు. అది సరే, క్రుంకు అంటే అస్తమించు కదా, పొద్దు కుంకింది అంటరు కదా, మరి ఆ అర్థం ఎట్ల వచ్చింది అని అనుమాన పడకుండా ఉత్తర హరివంశంలోని ఒక పద్యపాదాన్ని పేర్కొన్నడు. 'శంకాకీర్ణమనస్క దానవరిపుల్ చక్రాయుధుడింతలో క్రుంకెన్ పోయని భీతులైరి' దేశ్య పదాలను వ్యవహరించడానికి మనం వెనుకటి నుండి వెనుకాముందులాడుతనే ఉన్నం.
రాయడానికి, వేదికలెక్కి మాట్లాడడానికి సంకోచిస్తం. ఏవి పలికితె ఎగతాళి చేస్తరనుకుంటమో అవే అసలైన అచ్చ తెలుగు పదాలు, నిఘంటువులకు ఎక్కిన పదాలు, కావ్య గౌరవానికి సైతం నోచుకున్న పదాలు అని ఇటువంటి భాషావ్యాసాల ద్వారా అవగతమైతది. ఎంత ఆలోచించినా తట్టని పదమూలాలు భాస్కర్‌కు తోచడానికి ప్రధాన కారణం బహుభాషా పరిజ్ఞానం. ఒక పదం చూడంగనే పద్నాలుగు భాషల్లో దాని రూపాలు నలిమెల మెదడులో మెదలుతయి. 'అను' అంటే ఏదైనా మాట్లాడడం అనే కాకుండా 'జరుపు, కదుపు' అనే అర్థాలలో కూడా ఉపయోగిస్తరు. 'అది అటు అను, ఇటను' అంటుంటరు. ఆ 'అను'కు ఈ 'అను' ఎట్ల వచ్చిందో, దీన్నుంచి వచ్చిందో చెప్పిండు. తమిళంలో 'అనక్కుదల్' అంటే కదుపు. 'ఒర్రు, ఒర్లు' అంటే వదురుడు. ఇవి 'ఉళరల్' (తమిళం) నుంచి వచ్చినయి. అయిపోయినయి అనే అర్థంలో వాడే 'ఒడిసిపోవుడు' కు మూలం మలయాళ పదం 'ఒడువిల్'. దీనికి అర్థం 'చివరికి' అన్నట్టు. 'కొండవో'(తీసుక పో) తమిళ 'కొండుపో' నుంచి వచ్చింది. విడిచిన బట్టలన్నీ కుప్పవడితె 'మలెవడ్డయి' అంటరు.'మలె' కొండగా స్ఫురింపజేయడం బాగుంది. 'పుచ్చువట్టుడు'లోని పుచ్చు తమిళ 'పూచ్చి' నుంచి వచ్చింది.
తెలుగులో 'బరుకు' అంటే ఏదో ఒకటి రాయడం, గీకి పెట్టడం.కన్నడంలో 'బరయు' అంటే రాయుట.,కన్ను మలిగింది'అంటే నిద్ర పట్టింది అని.దీనికి కన్నడమూలం 'మలగలుపోగు' (నిద్రించు). 'తల్లడమల్లడం' వర్ణసమీకరణం ద్వారా 'తరలడం మరలడం' నుంచి వచ్చిందనీ, 'కుక్కు' తాలవ్యీకరణం జరిగి 'కుచ్చు' అయిందని ఇట్ల చాలా క్రియాపదాల రూపాంతరాలను వివరించిండు. 'పింజం పింజం'కు భయంతో వణికిపోవడం అనే అర్థం చెప్పి అది సంస్కతపదం 'పింజ' (కలతచెందు) నుంచి వచ్చిందన్నడు. 'జిచ్చు' కు జడియు,చలించు అనే అనే అర్థాలున్నయి.ఇది అర్థసంకోచంతో 'యాట జడి' కి వాడుతరు.బలిచ్చే ముందు మేక తన మేనును జలదరింపచేస్తే అది అంగీకార సూచకమట. సాధారణంగా 'పోగుపోసు' నకారాత్మకంగా వ్యవహరిస్తరు. 'వాడు పోగుపోస్తడా! నువ్వు గిట్ల చేస్తే పోగువొయ్యవురా!' అని శాపెనలు పెడరు. భాస్కర్ దీనికి 'వద్ధికి రావడం' అనే అర్థం చెప్పిండు. మగ్గం నేసెటప్పుడు సట్టర ఆడిచ్చినప్పుడల్లా నాడెపోగు పడుగుకు పేకగా పడితెనే బట్ట తయారయితది.అట్ల పోగు పోసినా కొద్ది అది పెరుగుతా ఉంటది.ఇట్ల వచ్చిందని నా అభిప్రాయం.
భాస్కర్ భాషాసంబంధమైన రచనల్లో ఒక విశేషముంటది. ఏకపక్షంగా చెప్పుకుంటపోడు. ఆలోచింప చేస్తడు. వాచ్యాలతో పాటు సూచ్యాలూ ఉంటయి.తనకు అనుమానమున్నచోట ప్రశ్న గుర్తులు పెడడు. 'దరిచ్చుడు' ధైర్యంచడం నుంచి వచ్చిందా చూడాలి అన్నడు. 'కొలుసు కునుడు' పోట్లాడుటకు ఎట్ల పర్యాయమైందో ఆలోచించాలి అన్నడు.
'నువ్వింత, నేనింత' అని ఆడవాళ్లు ఒకరిదొకరు ఎత్తేసుకుంటూ, వారి దుర్గుణాలను కొలుసుకుంటూ వాదులాడుకునుడు అని నా ఆలోచన. 'కొట్టుకుని తినుడు' అంటే 'మనసు కొట్టుకుని తినుడు కావచ్చును' అని రాసిండు. అయితే వ్యవహారంలో 'అన్నీ కొట్టుకుని తినాలె బిడ్డా!' అంటే రుచీపచీ అని వంకలు పెట్టకుండా అన్నీ తినాలె అనే భావముంది. 'శిదగొట్టు' చితక్కాట్టుడు నుంచి వచ్చిందని భాస్కర్ చక్కగా చెప్పిండు.పాత నగలను చితగొట్టి కరిగిస్తేనే కదా కొత్త నగ చేసేది! నగలను శీదులు అనికూడా అంటరు దీని నుంచి కూడా రాబట్టవచ్చా అన్నది నా ఆలోచన. 'వంగదోలు'కు వంగబెట్టడం, పనిచేయించడం అని రాసిండు.అయితే 'వంగదోలు మాటలు' అని అశ్లీల నిందార్థకంలో కూడా వాడంగ విన్న. 'దాని సోపతి పట్టకు బిడ్డా దానియి అన్నీ వంగదోలు మాటలు' అని హెచ్చరిస్తరు. చెడగొట్టు మాటలు అని భావం. ఇటువంటి విభిన్న వ్యవహారాలు సహజం. ఒకటే భాష అయినా జిల్లా జిల్లాకు, ఊరూరికీ, ఒక ఇంటికీ మరో ఇంటికి సైతం పదవ్యవహారంలో,భావాలలో తేడాలుంటయి. అందుకే ఇటువంటి భాషా కషి కనీసం ఓ నలుగురు కలిసి, చర్చిస్తూ చేయవలసిన అవసరం ఉంది. ఈ పుస్తకంలో రచయిత చెప్పుకున్నట్టు క్రియలతో పాటు, నామవాచకాలకు పడు, పోవు, పెట్టు మొదలైనయి చేరిన క్రియారూపాలు కూడా తీసుకున్నడు. కాయిపాయి...ఖాద్యం పేయం, శిడెం... క్షణం, రడం... వ్రణం, శాగ...చేవ, అముడాల...యమళం ఇట్లా చాలా పదాల మూలాలు చెప్పడం ఆసక్తికరం. సందర్భానుగుణసద్యోస్ఫురణ నలిమెలలో విశేషంగా కనబడ్డది.
ఇది సమగ్రం కాదు అని సవినయంగా చెప్పుకున్నడు భాస్కర్ Something is better than nothing అని అంటుంటడు. కవిత్వం,కథలు వంటి వాటితో పోలిస్తే నడుస్తున్న భాషాసంబంధ కషి తక్కువే. ప్రభుత్వాలు, అకాడమీలు, సాహితీ సంస్థలు,ఎందరో భాషావేత్తలు కలిసి శ్రమకోర్చి చేసినా ఇప్పటివరకు సమగ్రమైనవంటూ ఏవీలేవు. అలాంటిది తను వ్యక్తిగతంగా దశాబ్దాలుగా భాషాపరంగా అవిశ్రాంత కషితో వ్యాసాలను రాస్తూ,పుస్తకాలు వేస్తున్న నలిమెల భాస్కర్ అభినందనీయుడు. తెలుగులో నాలుగువేల ధాతువులున్నయనీ, అందులో మూడువేలు దేశ్యాల కొమర్రాజు వేంకటలక్ష్మణరావుగారు అన్నరని తన ముందుమాటలో భాస్కర్ పేర్కొన్నడు. ఈ దేశ్యక్రియలు ఇప్పటికైనా పల్లెల్లో, నిరక్షరాస్యుల్లో కొన్నన్న మిగిలి ఉన్నయి.వాటిని
మీడియా కలుషితం చేసి పూర్తిగా ఇంక ముంచివేయక ముందే, విలుప్తం కాకముందే ఇంక రికార్డు కాని వాటిని సేకరించాలె.దీనిని అత్యవసరపరిస్థితిగా భావించి, చేయ వలసిన బాధ్యత ప్రతి భాషావేత్తపై, భాషాభిమానిపై ఉంది.
- వేముల సత్యనారాయణ
సెల్: 9849365990