Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనను తాను తవ్వుకుంటున్న
నిద్రరాని నిశ్శబ్దపు నిశిరాత్రి
గతం గూట్లోంచి నక్షత్రపుకళ్ళతో
తొంగిచూస్తున్నమానవేతిహాస
మానని గాయాలు...
ఆకులన్నిరాలిన చెట్టుకొమ్మ
తన దుఃఖాన్నిఆపకుండా
ఒక్కో ఆకురాలుతున్నప్పటి
కన్నీటికథల్ని ఒంపుతుంది
కీచురాయిలా...
సమాధానాలు లేని ప్రశ్నలు
మనసు నిండా ముసురు తుంటే!
గడ్డకట్టిన విశాదమేదో గొంతులో...
తడారని మాటలు
మౌనాన్ని ఆలింగనం చేసుకుంటూ...
అప్పుడెప్పుడో మిత్రుడు చెప్పిన
తేమనిండిన నీతి వాక్యాలు
చెవుల్లో ధ్వనిస్తుంటే !
మెతమేసిన ఆవుదూడలా
ఆ వాక్యాలసారాన్ని నెమరేసుకుంటూ
సముద్రతీరానికి తలబాదుకుంటున్న
ఒంటరి అలలా...
రాలిపడుతున్న నీటిమబ్బుల్ని
గోళికాయల్లా ఏరుకుంటున్న చిన్నపిల్లోడు
అరచేతిలో మెరుస్తున్న ఇంద్రధనుస్సుల్ని
కళ్ళల్లోకి ఒంపుకుంటున్నాడు ఆశ్చర్యంగా...
ఎంత ప్రశాంతంగా ఉందామన్న
ఏదో వినిపించని ఆలోచన
కళ్ళల్లో గుచ్చుకొని కనిపించని కన్నీటి ప్రవాహం..
చుట్టూనెత్తురోడుతున్న
గాయాలతడి తగిలి మేల్కొన్న దిగంతాలు
ఆకాశం కొలనులో ఆడుకుంటున్న
నక్షత్రాల చేప పిల్లలు
తలక్రిందులుగా వేలాడుతున్న
దశ్యాన్ని మబ్బుల సందుల్లోంచి
చూస్తున్నసందమామ...
- డాక్టర్ బాణాల శ్రీనివాసరావు
9440471423