Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈడ్చాకోని వెళుతున్నారు
నిర్జీవ మనిషి దేహం
క్షణం ముందు ఎన్ని పరాచికాలాడారు
బూటు కాళ్ళ తోటేనా
తుపాకి మడమల తోనేనా
దూదిలా దేహాన్ని చిదుగులు చేశారు
ఉమ్ముల తొట్టిని చేశారు
నీళ్ళలా తాగించి
ఉచ్చల స్నానం చేయించారు
వీళ్ళకూ కాళ్ళు, చేతులు, కళ్ళు
అన్నీ ఉన్నాయి
బూట్ల కాళ్ళకింద నలుగుతున్న మనిషికి మల్లే
పోలికలన్నీ సరిపోతాయి
అవయవాలతో ఎవరూ పోల్చుకోరు
వేషం చూడగానే టక్కున ఎదో స్ఫురిస్తుంది
ట్రైగిస్ నదులనే కాదు
సప్త సముద్రాల్ని గుప్పెట బంధించాలని
ప్రేతపు ఆలోచన తెల్ల తోడేళ్ళది
ఇరాక్ ఆయిల్ బావుల చుట్టూ
ఆఫ్ఘాన్ కొండల మధ్య
పాలస్తీనా గల్లీలన్నీ ఆక్రమిస్తున్న
ఈగల్ డేగల సమూహం
శవాలతో నుమాఇష్ ఏర్పాటు చేస్తున్నారు.
కాశ్మీర్ మంచులో
కిరాయి దేహాల్లో చొర్రి
తామో, తమ మద్దతుదారులో
సైతానులై సంచరిస్తుంటారు
పిడికెడు డబ్బులకు కిరయకిచ్చిన దేహాలకు
తన, పర విసక్షణ వుండదు.
గంగవరం జాలర్లెతేనేం,
'హాఫ్ మదర్, హాఫ్ వైఫ్'
కాశ్మీరీలైతేనేం, ఎవరైతేనేం
ప్రపంచం నలుమూలల హక్కుల కోసం
ఉద్యమిస్తున్న మనిషైతే చాలు
ఊర కుక్కల్లా కాల్చేస్తుంటారు
జంతు కళేబరాల్లా ఊడ్చేస్తుంటారు
అంగట్లో నిలిపిన స్త్రీ దేహానికి మల్లే
ముక్కలు, ముక్కలుగా విడగొట్టి
ఇది నాది, నీదీ అని భూమిని విడగొట్టి
ఆక్రమించుకొని
సామ్రాజ్యాలకు రాజులయ్యారు
మనిషే
కఠిన శిలాజం
జన్మ భూముల పేరు పెట్టి-
ఆర్గనైజ్డ్ గుండాల పైసాచిక ఆనందం
భూమంతా మనిషి జన్మ వత్తాంతం లేదా?
భూగోళ్ళన్ని రక్షణ కవచాలౌదాం రండి.
దేహాం కిరాయికి ఇచ్చిన ఇల్లు లాంటిది
మల మూత్రాల విసర్జన కోసమే కాదు
మరేదైనా-
ఒక సారి డబ్బులకు
మరోసారి దేనికోసమైనా
తాకట్టు పెడుతుంటాడు.
- హనీఫ్,
సెల్: 9247580946