Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంస్కృతి ధ్వంసమౌతున్న కాలంలో ఉన్నాం. సంస్కృతి అంటే ఏంటి అని అడిగే కాలంలో ఉన్నాం. ఒక జాతి సంస్కృతిని కొల్పోతే, ఆ జాతి అస్తిత్వాన్ని కోల్పోయినట్లే. ఒక సమూహం జీవచ్ఛవంలా మారకకూడదంటే వాళ్ళ సంస్కృతి సజీవంగా ఉండడం కూడా అంతే అవసరం. ఇటీవల అలాంటి ఆలోచనలతో జరిగిన పరిశోధనే ''తెలంగాణ సాంస్కృతిక పదకోశం'' అనే నిఘంటు నిర్మాణకషి. కషీ వలుడు ఎస్.చంద్రయ్య. ఈతరం తెలంగాణ సాంస్కృతిక ప్రతినిధి.
తెలుగులో సాంస్కృతిక అధ్యయన ఆలోచనలు చాలా కాలంగా సాగుతున్నా, సరవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకం ఒక మైలురాయి. దాని తర్వాత అంత విస్తృతస్థాయిలో తెలుగు సంస్కృతి నేపథ్యంలో ఒక్క గ్రంథమూ వెలువడలేదు. విశ్వవిద్యాలయాల్లోనూ, బయటా సంస్కృతి పేరుతో అధ్యయనం, పరిశోధనలు సాగారు. తెలుగు శాసనాల్లోని సంస్కృతిపై గంగిశెట్టి లక్ష్మీనారాయణ, తెలుగు జానపద విజ్ఞానపదకోశం (అముద్రితం) కోసం పరిశ్రమించిన జి.ఎస్. మోహన్ చేసిన పరిశోధనలు, వేరు వేరు కావ్యాల్లోని సాంస్కృతిక అంశాల ప్రస్తావన, కొన్ని ప్రజాసమూహాల ప్రత్యేక సాంస్కృతిక అధ్యయనం, కొన్ని వ్యాసాల్లో సాంస్కృతిక జీవితాల్ని తడమడం వంటి కషి కన్పిస్తోంది. కానీ, అవి 'ఆ సాంస్కృతిక అంశాల్ని ఫలానా పదంతో పిలుస్తారు అనే దష్టితో చూసి, దాన్ని రికార్డు చేయాలనే విషయం మీద దష్టిపెట్టలేదని' ఈ సంపాదకుడు సరిగ్గానే గుర్తించాడు. వరంగల్ జానపద, గిరిజన విజ్ఞానపీఠం వాళ్ళు గ్రామ, సమూహాల కేంద్రంగా కొంత సాంస్కృతిక అంశాల సేకరణ మాత్రమే చేశారు. తెలుగు సంస్కృతిపై వేరువేరుగా అధ్యయనాలు జరిగాయే గానీ, తెలుగు సాంస్కృతిక పదకోశం అనదగ్గ స్థాయిలో పరిశోధనలుగానీ, పుస్తకాలుగానీ రూపొందలేదు.
సంస్కతి వ్యక్తి స్థాయి నుండి కుటుంబ, సమూహ, ప్రాంతీయ వంటి అనేక భేదాలతో సమాజం విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉంటుంది. ఒక ప్రజా సమూహం ఏకం కావడంలోనూ, విడిపోవడంలోనూ సంస్కతిది ప్రధాన పాత్ర. ప్రపంచీకరణ ప్రభావం, నగరీకరణ, కళలతో పొట్ట నింపుకునే పరిస్థితులు లేకపోవడం వంటి ఎన్నో కారణాలున్నా, ఇతర తెలుగు ప్రాంతాలతో పోలిస్తే సాంస్కృతిక జీవితం పుష్కలంగా ఉన్న ప్రాంతం తెలంగాణ. తెలంగాణ ప్రజల సాంస్కృతిక చరిత్రని పరిరక్షించుకునే లక్ష్యంతో ఈ పదకోశ నిర్మాణం మొదలైంది. తెలంగాణ సమాజంలో తనదైన ప్రత్యేక సంస్కతి ఉందనడానికి ఈ పదకోశం జవాబిస్తుంది. కొన్ని సందర్భాల్లో సాంస్కతికంగా ఒకే పద్ధతులున్నా భాషాసంస్కృతి మారడాన్ని గమనించగలం.
చంద్రయ్య కవి. సజనపై అభిరుచి ఎక్కువ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అతనిపై తీరని ముద్రవేసింది. ఆ నేపథ్యం నుండి చంద్రయ్య తెలుగు సమాజానికి ఇచ్చిన కానుక తెలంగాణ సాంస్కృతిక పదకోశం. ఇది తెలంగాణకే కాదు, తెలుగు వారందరికీ కానుకే. తెలుగులో ఇప్పటివరకు సాంస్కృతిక పదకోశం లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ, ఇది నిజం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడింది. ఇది చేసిన మంచి పనుల్లో ఈ సాంస్కృతిక పదకోశాన్ని రూపొందించే బాధ్యత చంద్రయ్యకు అప్పగించడం ఒకటి.
ఈ పదకోశం నిండా దేశీయ సంస్కృతి పరచుకుంది. ఈ కోశం ప్రధానంగా తెలంగాణప్రాంతంలోని స్థానిక పండుగలు, జాతర్లని దష్టిలో పెట్టుకుని రూపొందింది. ప్రధాన స్రవంతి పండుగలుగా చెప్పుకునే ఉగాది, శ్రీరామ నవమి, చవితి, దీపావళి, విజయదశమి, సంక్రాంతి, శివరాత్రి లాంటి పండుగల సమాచారానికి పరిమితం కాలేదు. ఆ పండుగలు, నోములు, వ్రతాల గురించి ఇప్పటికే అనేక పుస్తకాలు వచ్చారు. జాతర్ల ప్రాంతీయ పరిధి పండుగల కంటే తక్కువైనా సంఖ్యాపరంగా ప్రాంతీయంగా జరుపుకునే జాతర్ల సంఖ్య ఎక్కువ. జాతర్లు చాలా పరిమిత ప్రాంతానికో, వర్గానికో పరిమితమై ఉంటారు. కానీ, ఆయా ప్రాంతాల వాళ్ళకి ప్రధాన స్రవంతిలోని పండుగలకంటే వీటిపైనే మక్కువ ఎక్కువ. వీటినే బాగా జరుపుకుంటారు. ఇవే వాళ్ళకు నిజమైన సొంత పండుగల్లా భావిస్తారు. వాటికే ఈ కోశం అగ్రాసనం వేసింది. అచ్చమైన తెలంగాణ సాంఘిక జీవితాన్ని నింపుకున్నది. ఈ పండుగలు, జాతర్లు మన స్థానికతకు అద్దంపడతారు. అందుకే ఈ కోశం తెలంగాణ దేశీయతని పట్టిస్తోంది. దేశ్య పదజాలంతో భాషని సంపద్వంతం చేస్తోంది.
ఈ పదకోశం ఏదో ఒక మూలన కూర్చుని, పుస్తకాల్లోని విషయాల్ని చూసి రాసుకోవడంలాంటిది కాదు. కార్యక్షేత్రం పల్లెలు. మారుమూల ప్రాంతాలు. నేరుగా వెళ్ళి సేకరణ చేయాలి. ఇలాంటి సందర్భాల్లో సమాచార సేకరణ ఎంత కష్టంతో కూడుకున్నదో అలాంటి అనుభవం ఉన్నవాళ్ళకే తెలుస్తుంది. ఈ సంపాదకుడూ అలాంటి పూల, ముళ్ళ బాటల అనుభవాల్ని ఎదుర్కొన్నాడు. పదసేకరణ సమయంలో విస్మయపరిచే అనుభవాలు మనగుండెల్ని బరువెక్కిస్తారు. 'క్షేత్రపర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి వ్యవహర్తలు ముఖ్యంగా వద్ధులు, కులపూజారులు వారిని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళుగా మమ్మల్ని భావించారు' అని సంపాదకుడు చెప్పిన అనుభవం వెనుక చాలా సాంస్కృతిక చారిత్రక మూలాలు దాగున్నారు. తెలంగాణ (ఇతర ప్రాంతాల్లోనూ) సాంస్కృతిక అంశాల్లో అధికభాగం వృత్తి కళాకారుల మూలంగా ఈనాటికీ కాస్తోకూస్తో జీవించి ఉన్నారు. కళను నమ్ముకునే కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగించారు. ఆ కళలు, సంస్కృతి కనుమరుగైతే వాళ్ళ జీవనం దుర్భరమన్న సంగతి వేరే చెప్పాలా? సాంస్కృతిక జీవధారలైన అలాంటి కళాకారుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంది.
తెలంగాణ సమాజం విభిన్న సంస్కృతుల కూడలి. గోండు, చెంచు, బంజారా, ముస్లిం మొదలైన ప్రత్యేక ప్రజా సమూహాల సంస్కృతుల్లోని పదజాలమూ ఈ కోశంలోకి ఎక్కింది. తెలంగాణేతరులకు, ఆ మాటకొస్తే తెలంగాణలోని వాళ్ళకి కూడా తెలీని ఎన్నో కొత్త సాంస్కృతిక అంశాల్ని ఈ పదకోశం పరిచయం చేస్తుంది. ఈ పదకోశం చూశాక మనతోటి సమాజంలో భాగస్వాములై, సహచరులైనవాళ్ళ సంస్కతి మనకు ఏ మేరకు తెలుసో ఎవరికివాళ్ళు బేరీజు వేసుకోవచ్చు.
ఉగాది, వినాయకచవితి, దీపావళిలాంటి పండుగలకి ప్రత్యేక వంటకాలు చేసుకుంటారని తెలుసుగానీ, ఆ వంటలు ఎలా చేస్తారో కూడా ఎక్కువమందికి తెలీదు. వాటిని కూడా అంగళ్ళలో కొనుక్కుని తినే వ్యాపారసంస్కృతిలో మనం భాగమైపోయాం. నిజమే, సంస్కృతి అంటే పండుగలు, జాతర్లు మాత్రమే కాదు. కానీ, పండుగలు జాతర్లప్పుడే సామూహిక సాంస్కృతిక వైభవం ఉట్టిపడేట్లు ఊర్లు కళాత్మక శోభతో మొరుస్తారు, ఉత్సాహంతో ఉప్పొంగుతారు. పండుగలు, జాతర్లు మన సాంస్కృతిక వారసత్వాన్ని వాటితో పరిచయంలేని బయటివాళ్ళకైనా వెంటనే ఎత్తిచూపుతారు. మన సమాజం అనేక సామాజిక వర్గాలుగా విడివిడిగా ఉన్నా పండుగలు, జాతర్లలో అందరూ కలిపి చేసుకునే సాంస్కృతిక అంశాలూ ఉంటారు. విభిన్న కులాలు, జాతులు, తెగల మధ్య ఆచరణలో వైవిధ్యం ఉన్నా ఒకే రకమైన సాంస్కృతిక మూలాల్ని గుర్తించడానికి ఈ కోశం ఉపయోగపడుతుంది. తెలంగాణకే పరిమితమైన ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వ నేపథ్యాన్ని ఎక్కువ భాగం ఈ పదకోశంలో చోటు చేసుకుంది. పేర్లు వేరయినా ఇతర తెలుగు ప్రాంతాల్లోనూ ఆచరణలో ఉన్న సాంస్కృతిక అంశాల్ని తులనాత్మక పద్ధతిలో అధ్యయనం చేయడానికి ఈ కోశం మంచి సమాచారాన్ని అందిస్తోంది.
నిఘంటువులకెక్కని స్థానిక పదాలెన్నో ఈ కోశంలో కన్పిస్తారు. పదాలు తెలిసినా విభిన్న అర్థచ్ఛాయలు మనల్ని అబ్బురపరుస్తారు. కేవలం లిఖిత సాహిత్యం లేదా సంప్రదాయ సాహిత్యంతో పరిచయం ఉన్నవాళ్ళకు రతి లాంటి పదాల సాంస్కృతిక అర్థాలతో కొత్త జ్ఞానాన్ని అందుకున్నట్లే. ఆధునిక సందర్భంలో తుడుంలాంటి పదాలకు ఇచ్చిన వివరణ వర్తమాన సమాజాన్ని అర్థం చేసుకునేలా ఉంది. ఈ పదకోశంలో ఇతర తెలుగు ప్రాంతాల్లో వాడే పదాలూ కొన్ని కన్పిస్తారు. కొన్ని పదాలు ఇతర ప్రాంత పదాలకు రూపాంతరాలుగా కన్పిస్తారు. కానీ అలాంటి పదాలకు శిష్టసాహిత్య నేపథ్యంలో వచ్చిన నిఘంటువుల్లో స్థానం లేదు. అలాంటి ఆరోపాలన్నీ సమగ్ర తెలుగు నిఘంటువులో భాగాలవ్వాల్సిందే.
సమూహాల మధ్య ఏకత్వానికీ భిన్నత్వానికీ కారణాలు అన్వేషించవచ్చు. భాషావేత్తలు భాషా సమాజిక విశ్లేషణలకి పదునుపెట్టవచ్చు. ఒక్కో జాతరకు సంబంధించిన ప్రత్యేక పరిశోధనాత్మక గ్రంథాలు రాయవచ్చు. దేశీయ సంగీతం, వాయిద్య పరికరాలు, నత్యాలపై దష్టి సారించవచ్చు. మనదైన స్థానీయ సంస్కృతిని గుండెలకు హత్తుకోవచ్చు. జానపద గిరిజన సంగీత వాయిద్య పరికరాల ఛాయాచిత్రాల్ని సేకరించి, వాటిపై వివరణలతో సహా జయధీర్ తిరుమలరావు ఒక మంచి గ్రంథాన్ని ఆంధ్రాంగ్లాల్లో ప్రచురించారు. ఇలాంటి ఎన్నో విలువైన పరిశోధనలకు ఈ కోశం తొలిమెట్టు. ఛాయాచిత్రాలతో సరిపెట్టకుండా భౌతికంగా ఒక సాంస్కృతిక వస్తుప్రదర్శనశాల నిర్మాణ అవసరాన్ని ఈ కోశం గుర్తుచేస్తోంది. విస్తస్థాయిలో మన సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక వస్తు ప్రదర్శనశాల లేని కొరత తెలుగువాళ్ళని ఎందుకు పీడించదో?
ఈ పదకోశం తెలంగాణ సంస్కతి, స్థానిక చరిత్ర అధ్యయన ఔత్సాహికులకంటే, తెలంగాణ ప్రాంతీయ అస్థిత్వ ఉద్యమకారులు, తెలంగాణ పునర్నిర్మాణవాదులు, తెలంగాణ సాంస్కృతిక రక్షకులమనేవాళ్ళపై మరింత బాధ్యతను పెడుతోంది. వాళ్ళు తక్షణం చేయాల్సిన సాంస్కృతిక పునరుజ్జీవన కోణాల్ని తట్టిలేపుతోంది. ఈ పదకోశం రూపొందడానికి ఆర్థిక సహాయం చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీని అభినందించాల్సిందే. కానీ, ఈ కోశాన్ని అచ్చేసి, తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ సాంస్కృతిక సంపదని పరిచయం చేయాల్సిన బాధ్యతకూడా దానిపైనే ఉంది. ఈ కోశం బయటి కొస్తే, తెలంగాణ సంస్కృతిపై మరిన్ని పరిశోధనలు చేయడానికి ఆధారం అవుతుంది. ఈ కోశం పరిధి పరిమితమన్న ప్రశ్నే అనవసరం. సమగ్ర తెలంగాణ సాంస్కృతిక పదకోశ నిర్మాణానికే కాక, సమగ్ర తెలుగు సాంస్కృతిక పదకోశం రూపొందడానికి ఇది గొప్ప ముందడుగు. చేయాల్సిన కృషి ఇంకా ఉంది. మరింత విస్తృతితో తెలుగు సాంస్కృతిక పదకోశం రూపొందడానికి ఈ తెలంగాణ సాంస్కృతిక పదకోశం ఖచ్చితంగా దారి చూపుతుంది.
పర్యాయ పదాలకు వేరువేరు ఆరోపాల్ని ఇచ్చారు. రూపాంతరాలకూ అలాగే ఇవ్వాల్సింది. గ్రంథవిస్తతి అని వెనుకాడకూడదు. అంతర్జాలంలో డిజిటల్ రూపంలో ఉన్నప్పుడు రూపాంతరాల్ని వెతుక్కునేటప్పుడు సమస్య ఉండదు. కానీ అచ్చు పుస్తకంలో భిన్న ఆరోపాలుగా ఇవ్వడం అవసరం. ఈ పదకోశంలో ఆకరాలుగా చూపిన అనేక అంశాలు ఇప్పుడు చాలా కననుమరుగయ్యే స్థితికి వచ్చారు. వాటి పేర్లు, వివరణలు వివరంగా ఇచ్చినా భవిష్యత్ తరాలు అందుకోలేనిస్థితి వస్తోంది. కాబట్టి ఈ కోశంలోని ఒక్కో ఆరోపానికి సంబంధించిన సమాచారాన్ని దశ్య, శ్రవణ మాధ్యమాల్లో భద్రపరిచి రాబోయే తరాలకు అందించాల్సిన బహత్తర కార్యాన్ని చేయాల్సే ఉంటుంది.
నిజానికి సాంస్కృతిక పదకోశాన్ని సంస్థాగతంగా పకడ్బందీగా రూపొందించాల్సింది. ఈ సంపాదకుడు అలాంటి ప్రణాళిక వేసుకున్నాడు కూడా. అయితే కాలం, ఆర్థిక వనరుల దష్ట్యా ఆ పరిధిలో ఈ పదకోశం రూపొందిన పద్ధతి లక్ష్యాన్ని అందుకుంది. ఈ పదకోశాన్ని చూసిన తర్వాత చంద్రయ్య సారథ్యంలోనే తెలుగుకు విస్తతస్థాయిలో ఒక సాంస్కృతిక పదకోశం రూపొందితే, అది భవిష్యత్ తెలుగు తరాలకు ఒక గొప్ప ఆకరమౌతుంది. తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారణమైనా కాకపోయినా, తెలుగు సంస్కతిని తెలుసుకోవాలనుకునే ఆసక్తి ఉన్నవాళ్ళకి అది పరమ ప్రామాణఇకం అవుతుంది. భవిష్యత్తులో సంస్కతులు చాలామటుకు కనుమరుగయ్యాక, ఈ సాంకేతిక యుంగంలో ఈతరం సంస్కతులకు దూరమయ్యాక ఇలాంటి సాంస్కృతిక పదకోశాల్లోనే మన జాతి సంస్కృతి నిలిచి ఉంటుంది.
- టి. సతీశ్
సెల్: 9391614443
సీనియర్ ఫెలో, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు.