Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోమర్సెట్ మామ్... ఈ పేరు ఆంగ్ల కథా ప్రేమికులకి చిరపరిచితమే. 20వ శతాబ్దంలో ఎన్నదగిన కథా రచయితల్లో ఒకడైన ఈయన నిజానికి నాటకాలు, నవలలు రాసినప్పటికీ కథకుని గానే ఎక్కువ ప్రాచుర్యం పొందడం జరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కథా రచయితగా మామ్ ది ఒక విశిష్టమైన, ప్రత్యేకమైన బాణీ. ఆయన కథలు చాలా వరకు అనేక దేశాల్లో జరుగుతుంటాయి. అంటే ఇతివత్తాలు అలా సాగిపోతాయి. అసలీయనకి సొంత దేశం ఏది అనే అనుమానమూ రాకపోదు. అంత సాధికారకంగా ఆ ప్రదేశాల్ని మన కళ్ళముందు ఉంచుతాడు.
ఆ నైపుణ్యం ఊరకనే రాలేదు. అనేక దేశాలు, ద్వీపాలు, ద్వీపకల్పాలు ఇలా ఎన్నో రకాలైన ప్రదేశాల్లో సంచరించాడు. నివసించాడు. నిరంతరం ప్రయాణాల్లోనే ఉన్నాడా ఈ మనిషి అనిపిస్తుంది. మనం ఇప్పుడు మ్యాప్‌లో ఎక్కడుందా అని వెదుక్కునే చిన్న చిన్న ద్వీపాల్లో కూడా ఉన్నాడు. ఇక సముద్ర ప్రయాణాలు లెక్కలేదు. ఆ అనుభవాలు అన్నిటిని కథల రూపం లో మన ముందు పరిచి వెళ్ళిపోయాడు. మపాసా, చెకోవ్ తరువాత కథా రచయితగా అంత పేరు సంపాదించుకున్నాడు. చెకోవ్ మాదిరిగా వైద్య విద్య అభ్యసించినప్పటికీ ప్రాక్టీస్ మాత్రం చేయలేదు. బహుశా ప్రయాణాల మీద ఆసక్తి ఇంకా ఇతరత్రా కారణాల వల్ల అనుకుంటా బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేసి అనేక దేశాల్ని చుట్టివచ్చాడు.
సోమర్సెట్ మామ్ కథాశైలి గొప్ప అలంకార భూషితమై ఉండదు. సామాన్యమైన రీతిలో, సాధ్యమైనంత ఎక్కువ మంది అర్థం చేసుకునేలా ఉంటుంది. అయితే మానవ మనోసీమని విశ్లేషించడంలోనూ, చిన్న సంఘటన నుంచి కథని సష్టించడం లోనూ, ఇతివత్తాల్ని ఎంచుకోవడంలోనూ ఆయనకి తనదైన పద్ధతి ఉంది. కొన్ని కథల్లో విశ్లేషణ ఎక్కువ కనిపిస్తుంది. బ్రహ్మాండమైన, మతిపోయేంత ట్విస్ట్‌లు చాలా కథల్లో మనకి కనిపించవు. అయితే కథ ముగిసిన తర్వాత కొద్దిసేపు పఠిత అలా ఆలోచనలో పడిపోతాడు. అటువంటి మైమరపుకి గురి చేస్తాడు. కథ అంటే ఇదిగో ఇన్ని పేజీల్లో ఉండాలి అనే పట్టింపు కూడా మామ్ కి లేదు. కొన్ని కథలు అయిదు పేజీలు ఉంటాయి.కొన్ని పది పేజీల లోపు, ఇంకొన్ని ఇరవై పేజీలు లోపు ఉంటే కొన్ని నలభై పేజీలకి దగ్గరగా,ఇంకొన్ని అరవై పేజీలు దగ్గరగా ఉండేవి కూడా ఉన్నాయి.ఒక్క పేజీ నిడివి లో కూడా రాశాడు. అతని పాత్రలు ఎంత డిమాండ్ చేస్తే అంత మేరకు రాసుకుంటూ పోతాడు.
సరే.. ఆయన రాసిన కొన్ని కథల్ని చర్చించుకుందాము. »»Vintage Maugham అనే పేరిట ప్రచురించబడిన కథా సంపుటి నుంచి వీటిని తీసుకోవడం జరిగింది. మొత్తం దీనిలో 22 కథలు ఉన్నప్పటికీ కొన్నిటి గురించి మాత్రం ప్రస్తుతం ఇక్కడ మాట్లాడుకుందాం.
''Mackintosh'' అనేది 38 పేజీల కథ. ఈ కథ నడిచే ప్రదేశం కొన్ని వందల మంది మాత్రమే ఉండే ఒక చిన్న ద్వీపం... ఈ ద్వీపం కూడా ఓ ద్వీపాల సమూహం లో ఉంటుంది. ఇంతకీ ఇది ఎక్కడ ఉందీ అని వెతికితే పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణంగా ఉన్నది. ఆ ద్వీపం పేరు సమోవ కాగా దానికి సంబందించిన ప్రధాన అధికార కేంద్రం అపియా అనే పక్కనే ఉన్న మరో ద్వీపంలో ఉంటుంది. మరి ఇంతకీ దీని పాలకులు ఎవరయ్యా అంటే ఇంకెవరూ బ్రిటీష్ వారే..!
అయితే ఇక్కడ పాలకునిగా చాలా ఏళ్ళ క్రితం ఓ గవర్నర్‌ని నియమించారు... ఆయన పేరు వాకర్. ఇక్కడ ఇతనే మకుటం లేని మహారాజు. ఈయనకి సహాయకునిగా Mackintosh అనే యువకుడిని పంపిస్తుంది ప్రభుత్వం. తన అనుభవంలో ఎన్నో పాలనాపరమైన సామర్ధ్యాలు గడించానని, ప్రత్యేకమైన పుస్తకాలు చదవాల్సిన అవసరం తనకి లేదని వాకర్ కొత్తగా వచ్చిన యువ అధికారికి గప్పాలు కొడుతుంటాడు. ఎందుకంటే కొత్తగా వచ్చిన యువ అధికారి ఇంగ్లండ్ నుంచి షిప్పుల్లో పుస్తకాలు తెప్పించుకుని చదువుతుంటాడు.
ఆ ద్వీపం మొత్తంలో వీళ్ళు ఉండేదే పెద్ద భవనం. మిగతా నేటివ్ ప్రజలు చిన్నపాటి గుడిసెల్లో నివసిస్తూంటారు. ఒక స్థానిక వ్యాపారి ఉంటాడు, అతని పేరు జెర్విన్. స్థానికుల్లో ఇతనికే కాస్త ఎక్కువ ఆస్తిపాస్తులు ఉంటాయి. కథలో ఇతడిని Half-Caste అని సంబోధించడం కనబడుతుంది. కారణం ఇతని తండ్రి యూరోపియన్ కాగా తల్లి స్థానిక జాతీయురాలు. ఈ జెర్విన్ పాలక వర్గమైన బ్రిటీష్ వారికే విశ్వాసపాత్రతని కలిగి ఉండడం కనిపిస్తుంది. స్థానికుల్ని అదుపు చేయడానికి నాటి వలస పాలకులు ఇలాంటివారిని ఎలా ఉపయోగించుకునేవారో ఈ పాత్ర ద్వారా తెలుస్తుంది.
సరే... యువ అధికారి కూడా సీనియర్ అధికారి అయిన వాకర్‌కి బాగానే సహకరిస్తుంటాడు. అయినప్పటికీ వాకర్ ఆ కుర్ర అధికారిని ఏదో పేరు మీద ప్రతిదానికీ చిన్నబుచ్చు తుంటాడు. తను ఇచ్చే ఏ సలహాని లక్ష్యపెట్టడు సరిగదా ఎవరిని ఏ విధంగా చూడాలనేది నాకు తెలుసు అని అంటూ స్థానికుల్ని ఇష్టం వచ్చినట్లు అదిలించి పనిచేయిస్తుంటాడు. తనకి ఎవరు ఎదురు తిరిగినా వాకర్‌కి నచ్చదు. ఆ ద్వీపంలో సువార్త చెప్పడానికి వచ్చిన క్రైస్తవ మిషనరీస్ ఏదో విషయంలో తను చెప్పినట్లు వినలేదని స్థానికులు వీరికి సహకరించకుండా చేస్తాడు. దెబ్బతో వాళ్ళు దిగి వస్తారు. అలా ఆ ద్వీపానికి తానే తండ్రిని అని మిగతావాళ్ళు అంతా పిల్లల్లా ఉండాలని వాకర్ చెబుతాడు.
ఇదిలా ఉండగా ఆ ద్వీపం చుట్టూరా రోడ్డు వేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం వెయ్యి పౌండ్లని మంజూరు చేస్తుంది. స్థానిక నాయకుడు మనూమని పిలిచి రోడ్డు వేయడానికి అందరూ రావాలని అందుకు గాను మొత్తం వంద పౌండ్లు ఇస్తానని చెబుతాడు. అయితే ఆ నాయకుని కొడుకు తెలివైన వాడు. ప్రభుత్వం చాలా నిధులు మంజూరు చేసిందని కాని వాకర్ తమని మోసం చేస్తున్నాడని మనం చెప్పిన కూలీ ఇవ్వనంత వరకు పనికి వెళ్ళవద్దని అందరితో చెబుతాడు. దీంతో వాకర్ ఒక మాయోపాయం పన్నుతాడు. పక్క ఊరి వారిని పిలిపించి వాళ్ళకి విందు భోజనాలు, సారాయి పోయించి వారితో పనిచేయించుకోవడం మొదలుపెడతాడు. దీనితో స్థానికులు ఉపాధి కోల్పోయినా ఆ పక్క ఊరి వారితో గొడవ పెట్టుకోవడానికి సాహసించరు. కారణం వారు కూడా సొంత తెగ వారే గదాని. సరిగ్గా ఆ సెంట్ మెంట్నే వాకర్ ఉపయోగించి మొత్తానికి స్థానికుల్ని కాళ్ళ బేరానికి తెస్తాడు. దానితో ఆ నాయకుడి కొడుకు కక్ష పెంచుకుంటాడు.
ఈ విషయం గ్రహించిన యువ అధికారి, ఒకసారి ఆ నాయకుని కొడుకు ఆరోగ్యం బాగోలేక తన వద్దకి వచ్చినప్పుడు రివాల్వర్ బుల్లెట్స్‌ని అందుబాటులో ఉండేలా పెడతాడు. వాటి సాయంతో అతను ఒకరాత్రి పూట వాకర్ గుర్రం మీద వస్తుండగా కాల్పులు జరుపుతాడు. దీనితో వాకర్ గాయపడి మంచం మీద కొన్ని గంటలు ఉండి మరణిస్తాడు. చివరి క్షణాల్లో యువ అధికారి Mackintosh కి కొన్ని నిజాలు తెలుస్తాయి. సీనియర్ అయిన వాకర్ పెద్దగా కూడబెట్టినది ఏమీ లేదని, నిస్వార్ధపరుడైన గవర్నర్ అని తెలుసుకొని తాను తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఇదీ స్థూలంగా కథ. దీని ద్వారా రచయిత చెప్పదలిచినది ఏమిటంటే వలస పాలకుల్లో నిస్వార్ధులు ఉన్నారు. వాళ్ళ విధి వాళ్ళు నిర్వర్తించారు అనేది. ఈ కథలో ఆ ద్వీపాల్లో ఉండే వారి జీవిత విధానాల్ని కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు. సముద్రం నిత్య జీవితంలో పోషించే పాత్ర అర్థమవుతుంది.
ఇక మరో కథని చూద్దాము. దానిపేరు The Letter.. ఈ కథ మామ్ కి బాగా పేరు తెచ్చిన కథల్లో ఒకటి. మొత్తం 35 పేజీల్లో సాగింది. ఇది సింగపూర్ నేపథ్యంలో ఉంటుంది. ఇక్కడి సామాజిక, సాంఘిక విషయాల్ని స్పశించాడు రచయిత. అలాగే అక్కడికి వలస వచ్చిన మలయా, చీనీ, తమిళ ప్రజల గూర్చి చెబుతాడు. ఇక యూరోపియన్ల గూర్చి చెప్పేదేముంది. ఆ చుట్టుపక్కల టీ ఎస్టేట్ యజమానులు వారే. అలాంటి టీ ఎస్టేట్ యజమాని మిస్టర్ క్రాస్బి ఓ రోజు లాయర్ జాయిస్ వద్దకి వస్తాడు. తన భార్య హామండ్ అనే వ్యక్తిని కాల్చి చంపిందని దానికి కారణం అతని విపరీత ప్రవర్తనే అని చెబుతూ ఆ కేసు నుంచి ఆమెని రక్షించవలసిందిగా కోరుతాడు. వీరు ఇరువురు కుటుంబ స్నేహితులు కూడా.
అయితే జాయిస్ వద్ద పనిచేసే సహాయకుడు, సింగపూర్ యువకుడు అయిన వాన్ చెన్ సెంగ్ తనకి స్థానిక స్త్రీ ఒకామె ఉత్తరం ఇచ్చిందని కేసుకి సంబందించిన కొన్ని రహస్యాలు దానిలో ఉన్నాయని చెబుతాడు. దాని అసలు ప్రతిని సంపాదించడానికి ఎన్నో బజార్లు దాటి ఓ మారుమూల గది లో ఉన్న వ్యక్తికి కొంత పైకం ఇచ్చి మొత్తానికి సంపాదించుతారు.
తీరా ఈ ఉత్తరం ద్వారా కొన్ని ఆధారాల్లోకి వెళితే తేలింది ఏమిటంటే హామండ్ అనే వ్యక్తితో క్రాస్బీ భార్యకి అక్రమ సంబంధం ఉందని. అతను ఇటీవల ఈమెని నిర్లక్ష్యం చేసి స్థానిక స్త్రీతో కలిసి ఉంటున్నాడని అసూయతో కాల్పులు జరిపిందని తేలుతుంది. అయితే చివరకి క్రాస్బీ భార్యని ఎలా దీని నుంచి ఆ లాయర్ జాయిస్ కాపాడాడు అనేది సస్పెన్స్‌లో ఉంటేనే మంచిది. ఇది ఒక క్రైం థ్రిల్లర్‌లా సాగుతుంది.
ఇక ఆ తర్వాత Salvatore అనే కథని పరిశీలిద్దాం. ఇది అయిదు పేజీలు నిడివిలో ఉన్నది. ఇటలీకి దగ్గరలో ఉన్న ఓ దీవిలోని మత్స్యకార యువకుని జీవితాన్ని చిత్రించే కథ ఇది. మనం ముందే చెప్పుకున్నట్లు మామ్ కొన్ని కథల ముగింపుని సాదాసీదాగా వదిలేస్తాడు. అలాంటి వాటిలో ఇది ఒకటి. మరి దీనిలో ఏమి చిత్రించాడు అంటే... యవ్వనంలో ప్రేమలో పడ్డ మనిషి భాగస్వామితో రాబోయే రోజులు గురించి ఏవేవో కలలు కంటూ ఉంటాడు. ఆ మనిషి తనకి దొరకదు... కాని ఇంకెవరితోనో జీవితం అలా ఆగకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది అనేది దీనిలోని సారం. నేపుల్స్ సమీపం లో నివసించే Salvatore అనే యువకుడు జాలరి కుటుంబానికి చెందిన వాడు. అతను గ్రాండ్ మెరీనాకి చెందిన ఓ యువతిని ఎంతగానో ప్రేమిస్తాడు. ఆ దేశ చట్టాల ప్రకారం తప్పనిసరిగా మిలటరీ సర్వీస్‌లోకి వెళ్ళవలసి వస్తుంది. దానితో అతను విచారంగా దానిలో చేరి దూర ప్రాంతాలకి వెళ్ళిపోతాడు. వెనిస్, బారి, చీనా ఇలా ఎన్ని ప్రాంతాలకో విధులలో భాగంగా ప్రయాణం చేస్తాడు.
ఈ విధుల నిర్వహణ మూలంగా ఎముకల వ్యాధికి గురవుతాడు. వైద్యం చేయించుకొని కొద్దిగా నయం అయిన తర్వాత సొంత ఊరికి తిరిగి వస్తాడు. ప్రేమించిన యువతి కోసం చూస్తాడు గానీ ఎక్కడా కనపడదు. తల్లిని అడిగితే ఆమె చెబుతుంది ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిందని..! కొన్ని రోజులు గడిచిన తర్వాత తల్లిదండ్రుల వత్తిడి వల్ల ఇంకో యువతిని పెళ్ళాడుతాడు. ఆమెని పెళ్ళి చేసుకోవడం వల్ల చేపల వ్యాపారానికి కావలసిన డబ్బు సమకూరుతుంది. అది కూడా తల్లిదండ్రుల ఆలోచనే. చేపలు పడుతూ ఆ తర్వాత జీవన ప్రయాణంలో సాగిపోతుంటాడు.
సరే... మిగతా కథల్ని అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ చర్చించుకుందాం. సోమర్సెట్ మామ్ గురించి చెప్పాలంటే తన కాలంలో ఎక్కువ సంపాదించిన రచయితగా చెప్పాలి. ముఖ్యంగా 1930 ల్లో..! మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రెడ్ క్రాస్ అంబులెన్స్ కార్ప్స్లో పనిచేసినపుడు మామ్, ఎర్నెస్ట్ హెమింగ్వెకి సహౌద్యోగిగా ఉన్నాడు. 1938లో మన దేశంలోని రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించాడు. ఈ అనుభవాల్ని Razors Edge (1944) అనే నవలలో పొందుపరిచాడు. ఆయన వైవాహిక జీవితం అర్ధాంతరంగా ముగిసింది. జీవిత చరమాంకంలో ఇద్దరితో హౌమో సెక్సువల్ సంబంధాలు పెట్టుకున్నాడు. అదేమిటో గాని చాలామంది పాశ్చాత్య రచయితలు వాల్ట్ విట్మన్, ఆస్కార్ వైల్డ్, డిహెచ్.లారెన్స్, ఇ.ఎం.ఫారెస్టర్, బాల్జాక్, థోరో, టెన్నెసి విలియంస్ లాంటి వారందరూ ఇలాంటి సంబంధాల్ని కొనసాగించారు. ఇయాన్ ఫ్లెమింగ్ సష్టించిన జేంస్ బాండ్ పాత్రకి సోమర్సెట్ మామ్నే ప్రేరణ అని చెబుతారు. 25, జనవరి, 1874లో లండన్‌లో జన్మించిన సోమర్సెట్ మామ్ 1965లో డిసెంబర్ 16 నాడు పారిస్ లోని తొమ్మిది ఎకరాల స్వగహంలో మరణించాడు.
- మూర్తి కెవివిఎస్
7893541003