Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత మూడున్నర దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధనకు దశను, దిశను నిర్దేశిస్తున్న విద్వద్విమర్శకులు, ఆచార్య వెలుదండ నిత్యానందరావు. పద్యం, పేరడి, కవిత, లేఖ, వ్యాసం, నాటకం, పీఠిక, సమీక్ష, పరిష్కరణ, అనువాదం వంటి అనేక ప్రక్రియల్లో ఇతోధిక కృషి చేసినా తెలుగు సాహిత్య ప్రపంచంలో నిత్యానందరావు విమర్శకునిగా ప్రసిద్ధులు. నడయాడే గ్రంథాలయంగా, విద్యార్థుల చేత, అధ్యాపకుల చేత మన్ననలందిన దేశికులు వీరు. సుమారు 30 యేళ్ళుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో వివిధ హోదాల్లో తనదైన ముద్రను వేసిన ఆచార్య వెలుదండ నిత్యానందరావు 60వ జన్మదినం నేడు.
వచ్చే ఏడాది ఆగష్టులో పదవీవిరమణ చేయనున్న నిత్యానందరావు సమగ్ర రచనలు ఏడు సంపుటాలుగా ఈ సంవత్సర కాలంలో పాఠకులకు అందుబాటులోకి రానున్నాయి. నిత్యానందరావు తమ 16వ యేట కలం పట్టిన 1979 నుండి నేటిదాకా చేసిన రచనలన్నీ దాదాపు 4000 పేజీల రూపంలో, రాయల్ సైజులో ప్రచురితం కానున్నాయి. వీటిలో మొదటి సంపుటం 'అనుభూతి-అన్వేషణ' పేర పీఠికలతో కూడిన గ్రంథం ఈ రోజు జూమ్ వేదికగా ఆవిష్కరణ జరుపుకుంటోంది. ఈ కోవలోనే మిగిలిన ఆరు సంపుటాలు వెలువడనున్నాయి.
16 ఏళ్ళ ప్రాయంలో రాసిన తొలి పద్యాలు 'వాగ్దేవి' అనే శీర్షికతో రాజమండ్రి నుండి వెలువడే సమాలోచన అనే పక్షపత్రికలో ప్రచురితమయ్యాయి. ఇదే క్రమంలో తెలుగు వారి సంస్కృత సేవ అనే వ్యాసంతో మొదలుపెట్టి హిందీ, ప్రాకృతం, కన్నడ, ఒరియా, ఉర్దూ, తమిళ, మరాఠి మొదలైన భాషా సేవల గురించి సమాలోచన పత్రికలోనే రాసారు. నాటి రాజకీయ స్థితిగతులపై ఆంధ్రప్రభ దినపత్రికలో 'రాజకీయ భాగోతం' అనే పేరుతో కార్టూన్లతో కూడిన పేరడి పద్యాల శీర్షికనే నడిపారు. పాలెంలో డిగ్రీ చదివే రోజుల్లోనే ఆంధ్రప్రభ, ఈనాడు, వంటి దిగ్గజ పత్రికల్లో రాసేంత స్థాయికి ఎదిగారు.
గత వందేళ్ళుగా విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధనా పక్రియ దినదిన ప్రవర్దమానవుతూ వచ్చింది. దేశంలోని 20 విశ్వవిద్యాలయాలు, 12 తులనాత్మక అధ్యయన కేంద్రాలు, పలు ప్రాచ్య పరిశోధన సంస్థలు, 15 విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఇబ్బడి ముబ్బడిగా తెలుగు భాషా సాహిత్యాలపై పరిశోధనలు సాగాయి. ఏ విశ్వవిద్యాలయంలో ఎవరు ఏ అంశంపై పరిశోధన చేసారో తెలియని గందరగోళ పరిస్థితి 1980 దశకం నాటికే ఏర్పడింది. దాంతో అప్పుడప్పుడే ఎం.ఏ., పూర్తిచేసుకున్న విద్యార్థి నిత్యానందరావు 1987లోనే 1,136 పరిశోధనాంశాలతో 'విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన' అనే గ్రంథాన్ని వెలువరించి ఆచార్యులందరిని ఆశ్చర్యపరిచారు. ఈ గ్రంథమే 1998లో 2,960 అంశాలతో 2013లో 5,250 ఆరోపాలతో తిరిగి బృహద్గ్రంథంగా రూపొందించారు. పరి శోధకులకు, పర్యవేక్షకులకు ఈనాటికీ ఈ గ్రంథమే దిక్సూచీ. పరిశోధనాంశాలపై విసృతమైన అవగాహనేకాక, రీసెర్చ్ మెథడాలజీలో విశేష అనుభవం గడించిన ఆచార్యులలో నిత్యానందరావు అగ్రేసరులు.
సాహిత్య పాఠకులందరూ ఈసడించిన 'చంద్రరేఖా విలాపం' అనే ప్రబంధాన్ని పరిశోధనాంశంగా చేపట్టారు. కూచిమంచి జగ్గకవి రాసిన 225 ఏళ్ళ తర్వాత పాతికేళ్ళ యువకుడైన నిత్యానందరావు ఆ ప్రబంధాన్ని పట్టుకున్నారు. అదొక అశ్లీల ప్రబంధమని, అసభ్యశృంగార కావ్యమని సాహిత్యకారులందరూ ఆ కావ్యంపేరు వింటేనే ఉలిక్కి పడుతున్న తరుణంలో పరిశోధనకు సాహసంతో స్వీకరించి అందరినీ నివ్వెరపరిచారు. దాని లోతుపాతులన్నింటినీ పరిశోధించి అది తొలి వికట ప్రబంధమని నిగ్గుతేల్చి 1990లో ప్రచురించారు.
'తెలుగు సాహిత్యంలో పేరడి' అనే వైవిధ్యభరితమైన అంశాన్ని పరిశోధించి 1990లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి. పట్టా పొందారు. తెలుగులో పేరడి సాహిత్యంపై వచ్చిన తొలి సాధికారిక గ్రంథంగా ఇది పేరు గడించింది. ఆ తర్వాత వరుసగా హాసవిలాసం, భారతీయ జ్వలిత చేతన బంకించంద్ర, నిత్యవైవిధ్యం, నిత్యానుశీలనం, రాజనీతిజ్ఞుడు బూర్గుల రామకృష్ణారావు, నిత్యాన్వేషణం ప్రకటించారు. ఇవిగాక నవయుగ రత్నాలు, పరిశోధన వ్యాసమంజరి, ఆధునిక భాషా శాస్త్రం - ప్రకార్య భాష, ఆధునికాంధ్ర భావకవిత్వం, ఆంధ్రపదనిధానం, రామకృష్ణ యుధిష్ఠిర చరితమ్ వీరి సంపాదకత్వంలో మొదలైనవి వెలువడ్డాయి. వాజ్మయ దివాకరుడు, పాలవెల్లి, శతవాసంతిక గ్రంథాలకు సహ సంపాదకత్వం వహించారు. ఉస్మానియా, ఆంధ్ర, తెలుగు, అంబేద్కర్ విశ్వవిద్యాలయాలకు పాఠ్యాంశ రచయితగా ఉన్నారు. విస్తృతత్త్వం, వైవిధ్యం, విలక్షణత, విషయ పరిజ్ఞానం వీరి ప్రతి గ్రంథంలోనూ కనిపించే విశేషాంశాలు.
తొలినాళ్ళలో నిత్యానందరావు పద్యాలు, కవితలు, కథలు వివిధ పత్రికల్లో అసంఖ్యాకంగా ప్రచురితమయ్యాయి. ఆకాశవాణిలో వీరి నాటకాలు, ప్రసంగాలు కూడా ఎన్నో ప్రసారమయ్యాయి. కాని క్రమక్రమంగా సృజనాత్మక సాహిత్యానికి వీడ్కోలు పలికి విమర్శ రంగంవైపు అడుగులు వేసారు. నిత్యానందరావు సీరియస్ విమర్శకులైనా సుతిమెత్తగా గ్రంథంలోని లోటుపాట్లను తెలియజేయగల నేర్పరి. ఒకవైపు ప్రోత్సాహక వాక్యాలు రాస్తూనే మరోవైపు లోపాలను నిర్మొహ మాటంగా ఎత్తిచూపుతారు. సునిశిత పరిశీలన, సూక్ష్మ విశ్లేషణ వీరి ప్రత్యేకత. హాస్యప్రవృత్తి వీరి జీవలక్షణం. సరదాగా నవ్విస్తూనే సత్యావిష్కరణ చేస్తుంటారు. ఏది చెప్పినా, ఏది రాసినా ఒక మెరుపు, ఒక కొత్తదనం చూపించడం వీరి సహజ ప్రకృతిగా చెప్పవచ్చు. చదివించే శైలి, సమాచార పౌష్కల్యం వీరి రచనల్లో ఉండే గొప్ప లక్షణం. సంప్రదాయ, ఆధునిక సాహిత్యాలను రెంటినీ సప్రమాణ బుద్దితో వివేచించగల అతికొద్ది మంది విమర్శకుల్లో నిత్యానందరావు ఒకరు.
నిత్యానందరావు తాను చదివిన ఉస్మానియా విశ్వ విద్యాలయం లోనే ప్రస్థానాన్ని ప్రారంభించి 1992లో లెక్చరర్‌గా, 2001లో అసోసియేట్‌గా, 2009లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2015 - 17 కాలంలో తెలుగు శాఖకు అధ్యక్షులుగా పనిచేసారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఉత్తమ సాహితీవేత్త పురస్కారంతో పాటు భీమన్న, గంటిజోగి, బి.ఎన్.శాస్త్రి, ఎస్వీఆర్, ధర్మనిధి వంటి పలు పురస్కారాలు నిత్యానందరావు సాహిత్య సేవలకు గుర్తింపుగా లభించాయి. వారికి నిఈ సందర్భంగా అభినందనలు
- డా|| ఐ.సచ్చిదానందం, 9966175009
తెలుగు భాషోపాధ్యాయులు