Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సాహిత్యం కళలు సమాజంలోని పొరల్లోకి చొచ్చుకుని పోవాలి. ఆయా ప్రాంత, ప్రదేశాల పరిస్థితుల్ని బట్టి వారి రూపాలను మార్చుకుని, సమాజాన్ని జాగృత పరచాలి' అని లెనిన్ మహాశయుడు చెప్పినట్లు ప్రజారచయితలుగా వున్న వాళ్ళకు సమాజ గమనాల అధ్యయనం, చైతన్యయుత సృజన ఎంతో అవసరం. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా కవులు, కళాకారులు, రచయితలు, నాటక కర్తలు ఎంతో ఉద్యమ సాహిత్యాన్ని వెలువరించి, పోరాటానికి నూతన ఉత్సాహాన్ని అందించటమే కాక, స్వయాన సృజనకారులు ఉద్యమంలో పాల్గొన్నారు.
1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఆరంభమైన ప్పటికీ 1905 నాటి బెంగాల్ విభజనతో మొదలైన వందే మాతర ఉద్యమం సాహిత్య చరిత్రలో ప్రముఖమైన ఘట్టంగా నిలుస్తుంది. 'వందేమాతరం' అనే ఒక చిన్న పదబంధం, సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని గడగడ వణికించింది. బెంగాల్‌కు చెందిన ప్రముఖ రచయిత బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గీతం దేశం మొత్తం స్వాతంత్య్ర కాంక్షకు, ప్రతీకగా, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన నినాదంగా మారుమ్రోగింది. మన తెలుగు నేలపై కూడా జాతీయోద్యమ ప్రస్తావనలు 19వ శతాబ్దం చివరన ఆరంభమయ్యాయి. వేదం వెంకటరాయ శాస్త్రి రాసిన 'ప్రతాప రుద్రీయ' నాటకంలో స్వాతంత్య్ర ఉద్యమ భావాల అంకురార్పణ ఉంది.
ఇక స్వాతంత్య్రోద్యమం ముందుతరం నాయకులు బాలగంగాధర తిలక్, లాలాలజపతిరారు, బిపిన్ చంద్రపాల్‌లు ప్రజలను చైతన్యం చేయటంతో తెలుగు సాహిత్యమూ ఉద్యమ బాట పట్టింది. 1907 సూరత్ కాంగ్రెస్ మహా సభలో తిలక్ 'స్వరాజ్యం నా జన్మహక్కు' అంటూ సమర శంఖాన్ని పూరించాడు, అప్పటి నుండి సాహిత్యమూ వెల్లువెత్తింది. 1907లో రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలు, తెలుగు నేలలో ఒక నూతనోత్తేజాన్ని నింపాయి. ఆయన సభలోనే ఉపన్యాసం తెలుగులోకి అనువాదం చేసిన చిలకమర్తి లక్ష్మీనరసింహం చివరి రోజున వేదికనెక్కి ''భరత ఖండంబు చక్కని పాడియావు / హిందువులు లేగదూడలై యేడ్చుచుండ / తెల్లవారను గడుసరి గొల్లవారు / పితుకుతున్నారు మూతులు బిగియగట్టి'' అన్న పద్యం వారి ఉపన్యాస ప్రేరణతోనే చదివారు. లాలాలజపతిరారుని ఆంగ్లేయులు నిర్బంధించి జైల్లో పెడితే, ఇదే చిలకమర్తి 'చెరసాలల్ పృథు చంద్రశాలలెయగున్' అని అన్నారు. ఇక దేశభక్తిని నూరిపోసే విధంగా 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ' అనీ 'సిరులు పొంగిన జీవ గడ్డయి, పాలు గారిన భాగ్యసీమయి వ్రాలినది ఈ భరత ఖండము, భక్తిపాడర తమ్ముడా' అంటూ జాతీయ భావాన్ని ధాటిగా బోధించారు రాయిప్రోలు సుబ్బారావు.
ఇక జాతీయ కవిగా ప్రసిద్ధుడయిన గరిమెళ్ళ సత్య నారాయణ 'మాకొద్దీ తెల్లదొరతనము / మా ప్రాణాలపై పొంచి / మానాలు హరియించే' అంటూ ఆంగ్లేయుల 160యేండ్ల దౌర్జన్యాన్ని 160 పాదాలుగా సాగే ఈ పాట ప్రపంచ సాహిత్యంలో అతిపెద్ద పాటగా చరిత్రకెక్కింది. గరిమెళ్ళ కేవలం కవిగానే కాక ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపాడు. కటిక దారిద్య్రాన్ని అనుభవించాడు. 'కొందరు త్యాగము చేయవలె, కొందరు దారిద్య్రముతో నశించవలె, పూర్తిగా నాశనమైన గాని దేశమునకు స్వరాజ్యము రాదు' అంటూ తన యావజ్జీవితాన్ని స్వాతంత్య్ర సమరానికి ధారపోసి, బ్రిటీష్ వారిని గడగడలాడించారు. అదే విధముగా దుబ్బాక రాజశేఖర శతావధాని 'రాణా ప్రతాపసింహ చరిత్ర' లో కాంచన శృంగ భాగము కిరీటము కాగ, కాశ్మీరమాస్యపంకము గాగ, సింధూ గంగానదుల్ చేదోయిగాగ...' అని భారత చిత్రాన్ని కావ్యీకరించారు.
జాతీయోద్యమం మన తెలుగునేలపై మూడు ఆకాంక్షలతో కూడుకుని సాగింది. ఒకటి బ్రిటీష్ వాళ్ళను తరిమి కొట్టాలన్న జాతీయ భావన, రెండు ఆంధ్ర రాష్ట్ర సాధన, మూడు నైజాం నవాబు నుండి తెలంగాణ విముక్తి. ఈ మూడు స్వేచ్ఛను పొందటం కోసం చేసిన పోరాటాలే. 1913లో బాపట్లలో ప్రథమాంధ్ర మహా సభ జరిగింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఆరంభమైంది. కవులూ తమ కర్తవ్యాన్ని గుర్తించారు. సహాయ నిరాకరణోద్యమంలో జైలుకు వెళ్ళి అక్కడే వున్నవ లక్ష్మీనారాయణ 'మాలపల్లి' నవలను రాశారు. దువ్వూరి రామిరెడ్డి రైతు కోసం కృషీ వలుడు, కవి కొండల 'కూలీ అన్నలు' రచించాడు. ఆనాటి ప్రజల ఆకాంక్షలకు వేదికలుగా, 'కృష్ణాపత్రిక' 'జమీన్ రైతు' 'ఆంధ్ర భాషా సంజీవని', 'వివేక వర్ధిని', 'గోల్కొండ', 'విశాలాంధ్ర' మొదలైన పత్రికలు నిలిచాయి. ఉద్యమంలో కొండా వెంకటప్పయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, పుచ్చలపల్తి సుందరయ్య, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, పొట్టి శ్రీరాములు, అయ్యదేవర, దుర్గా భాయి, అలాగే తెలంగాణలో జమీందార్లకు, జాగీర్దార్లకు వ్యతిరే కంగా, ఆంధ్ర మహాసభ, కీలక భూమికను నిర్వహించింది. మాడపాటి హనుమంత రావు, కె.వి. రంగారెడ్డి, స్వామి రామానంద తీర్థ, కోదాటి నారాయణరావు, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్థూం మొయిను ద్దీన్, సరోజినీనాయుడు, సుద్ధాల హన్మంతు, మొదలైన వారు ఉద్యమ దివిటీలై నడిచారు. వీళ్ళంతా సాంస్కృతికోద్యమాన్ని రాజకీయోద్యమం గా మలిచి ప్రజలను చైతన్య పరిచారు.
పారిశ్రామిక విప్లవం తర్వాత, ఫ్రెంచి విప్లవాల ప్రభావంతో ఒక అంతర్జాతీయ దృక్పథం మన తెలుగు సాహిత్యంలో ప్రతిఫలించింది. దాన్ని అందిపుచ్చుకున్న తొట్ట తొలి కవి గురజాడ అప్పారావు. 'దేశమంటే మట్టికాదోరు / దేశమంటే మనుషులోరు, అన్నదమ్ములవలెను జాతులు మతములన్నవి మెలగవలెనోరు' అని దేశానికి, మనుషులకు ఒక కొత్త నిర్వచనాన్ని కవిత్వంలో వినిపించారు. అందుకే 'దేశభక్తి' గీతాన్ని శ్రీశ్రీ అంతర్జాతీయ గీతంగా పేర్కొన్నాడు. ఇక జాతీయోద్యమ సాహిత్యంలో సమర ప్రేరణలుగా దేశభక్తిని పాదుకొల్పటం, భూ భాగపు ప్రాశస్త్యాన్ని వివరించడం, సమర యోధులను కీర్తించడంతో పాటు సమరానికి పిలుపులివ్వటమూ మనం చూస్తాము.
'కొల్లాయి గట్టితేమి మా తాత కోమటై పుట్టితేమి? వెన్నపూస మనసు, కన్నతల్లి ప్రేమ, పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు' అంటూ బసవరాజు అప్పారావు పాడుతారు. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంధ్రప్రశస్తి, ఆంధ్ర పౌరుషం, ఝాన్సీరాణి కావ్యం దేశభక్తిని రగుల్కొపుతాయి.
'సగర మాంధ్రాత్రాది షట్చక్రవర్తుల
అంకసీమల నిల్పినట్టి సాధి
.......................
బుద్ధాది ముని జనంబుల దపంబుల మోద
భాష్పముల్ విడిచిన భక్తురాలు
సింధు గంగానది క్షీరమెపుడు
గురిసి బిడ్డల పోషించు కొనుచున్న
పచ్చి బాలింతరాలు మా భరతమాత' అని జాషువా కీర్తించాడు. గాంధీ మహాత్ముని హరిజనోద్ధరణకు ప్రతిస్పందనగా భారతీయ కుల వ్యవస్తపై నిప్పులు చెరిగే కవిత్వాన్ని రాశారు. భారతీయతను కమనీ యంగా గానం చేసిన వారు తుమ్మల సీతారామమూర్తి.
''తల్లి సంకెలలో తల్లడిల్లువేళ / నాకమైనను నరకంబు గాగయున్నే'' అని ప్రచారం చేశారు. 'వీర గంథము తెచ్చి నారము, వీరుడెవ్వడొ తెల్పుడీ, పూసిపోదుము, మెడను వేతుము పూలదండలు భక్తితో' అని వీరులను ఆహ్వానించారు త్రిపురనేని. 'హిందూ మాతను రా డయ్యరు! వినర లోక మాతనురా / హీనుడ వినుర దేశమాతనురా! నా డబ్బుని తిని నీవు నా బిడ్డలను జంప చేతులెట్లాడెరా! నీతిలేని వాడ!'' అని జలియన్ వాలాబాగ్ దురంతాన్ని తలచుకుని ఆగ్రహించాడు కొండపల్లి జగన్నాథదాసు.
'వీరావేశము జెందినారమిక, వీర విహారం చేస్తాము, పరాధీనతను బాపుకొనంగా ప్రళయభేరి మోగిస్తాము' అంటూ మల్లాది వారు కవిత్వాన్ని కవాతు చేయిస్తారు. 'ఎంతకాలమీ బానిస బతుకును / భరియింతువురానీవు / చావో రేవో వారియింపగనట సాగుము ముందుకు లేచి / భారత సోదర పరుగిడి రారా!' అని సహాయ నిరాకరణ ఉద్యమానికి తన అక్షరాలతో పిలుపును ఇస్తాడు మాము నూరు నాగభూషణరావు. 'పరదేశీయులు తొలగండి- యీ భారతదేశం మా దేశం, వినండి వినండి ప్రజలూ- వీర భారత సందేశం, భారత దేశ స్వాతంత్య్రమును పరిరక్షించుడె మా లక్ష్యం- భారతదేశపు రక్షణకై మా ప్రాణాలన్నియు తృణ తుచ్ఛం' అనివానమామలై వరదాచార్యులు ఎలుగెత్తి పాడాడు.
1917లో రష్యాలో వచ్చిన సోషలిస్టు విప్లవ ప్రభావం మన తెలుగు సాహిత్యంపై తీవ్రంగా పడింది. ప్రతి ఒక్కరూ ప్రగతిశీల భావాల్ని ఆహ్వానించారు. తెలంగాణలో స్వాతంత్య్ర ఉద్యమానికి ఉత్తేజితమై రచనలు చేసిన వారు అనేక మంది వున్నారు. కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమా చార్యులు, సురవరం ప్రతాపరెడ్డి, అయోధ్య రామ కవి, మాడపాటి, బూర్గుల రామకృష్ణా రావు, పొట్లపల్లి రామారావు, హీరాలాల్ మోరియా, పి.వి.నరసింహారావు, అరిగె రామస్వామి, వట్టికోట ఆళ్వారుస్వామి మొదలైన వాళ్ళు తమ రచనల ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. ఆనాటికి ప్రజాకంఠకుడుగా వున్న నైజాము నవాబు మీద అగ్నిధారలు కురిపించాడు దాశరథి. 'ఓ నిజాము పిశాచమా కనరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని నినదించడమే కాక జైలు జీవితాన్ని గడిపారు. కాళోజీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ''మాతృదేశము మాట ముచ్చట / ముదుము గూర్పదు మదికి ననియెడి / పరమనీచుడు ధరణినంత / గలయి వెదికిన గాననగునా? నీరు లేని యెడారియైనను / నావవరదల వసతియైనను / అగ్గికొండల అవనియైనను / మాతృదేశము మాతృదేశమే'' అని దేశభక్తిని పాదుకొల్పాడు.
''జంగ్ హై జంగే ఆజాదీ / ఆజాదీ కె పర్చమ్ కె తలే / హం హింద్ కె రహ్నే వాలోంకి / మెహకూమోంకి మజ్దూరోంకి / దహెఖానోంకి మజ్దూరోంకి / ఆజాది కే మత్వాలోంకి / ఏ జంగ్ హై జంగే ఆజాదీ'' అంటూ ప్రజల స్వాతంత్య్ర కాంక్షను అక్షరీకరించడమే కాదు... లక్షలాది మందిని ఆచరణకు కదిలించిన వాడు మఖ్దూం.
నైజాము సర్కారురా, ఓరన్నా! నాజీల మించిందిరా రకరాకాల్ / ప్రజారాజ్యానికై పోరాడు ప్రజలపై రాక్షస చర్యలన్ చేస్తుండే
అని తిరునగరి ఆంజనేయులు వెట్టిచాకిరీ చేయిస్తున్న సర్కారును దుయ్యబట్టారు. 'ఈ భూమి నాదిరా! ఈ నిజాం ఎవడురా? ఈ జులం ఈ జబర్థస్తీ నెగురదన్నివేయరా, లెమ్ము తెలుగు వీరుడా, రణమ్ము చేయలెమ్మురా! అంటూ సుద్దాల హన్మంతు విప్లవానికి పిలుపునిచ్చాడు. ఇక ఆనాడు ప్రజల మూలగల పీడిస్తున్న జమీందారులపై అతి సామాన్యులు తిరుగబడ్డారు. సాధారణ వ్యక్తులే సాహిత్య కళాకారులుగా రూపమెత్తారు. యాదగిరి 'బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తవ్ కొడుకో, నా కొడుక ప్రతాపరెడ్డి' అంటూ హెచ్చరిక గీతాన్ని ఎక్కుపెట్టాడు. ప్రతి ఒక్కరి గొంతులో మారుమ్రోగి పాట అది. 'ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు, ఒక నెత్తుటి బొట్టులోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు' అని సోమసుందర్ వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టాడు. 'ఇది నాగలి, ఇది దాగలి - ఇదె పునాది, సైతానుకు ఇదే సమాధి' అని తెలంగాణా రాచరిక విధ్వంస కాండపై 'త్వమేవాహం' ప్రకటించాడు ఆరుద్ర. కుందుర్తి 'తెలంగాణ' కావ్యాన్ని వెలువరించాడు. సుంకర సత్య నారాయణ, వాసిరెడ్డి భాస్కరరావులు 'మా భూమి' నాటకాన్ని రచించి ఊరూవాడా ప్రదర్శించారు. తెలంగాణ ప్రజల గోసను సజీవంగా చూపిందీ నాటకం. అదే విధంగా స్వేచ్ఛ కోసం జరిగే పోరాటానికి తన వంతు కృషిని కొనసాగించిన రచయితలు బొల్లిముంత 'మృత్యుంజయులు', లక్ష్మీ మోహన్ - 'సింహ గర్జన', మహీధర రామ్మోహనరావు - 'ఓనమాలు', వట్టికోట - 'ప్రజల మనిషి', 'గంగు', దాశరథి రంగాచార్య- 'చిల్లరదేవుళ్ళు', ఉద్యమ చరిత్రను, ప్రజల జీవితాన్ని ప్రతిబింబిస్తాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భాన్ని పురస్కరించు కొని వరంగల్లులో మొగిలయ్య గౌడ్ కోటపై జెండా ఎగురవేస్తే, అత్యంత దారుణంగా రజాకార్లు బల్లెంతో పొడిచి ఆయనను చంపిన ఘటన విని చందాల రామకవి 'నవాబులకు స్థానంబు లేదు-యిమ్మంచు అడిగెడిదికలేదు, గానమ్ముకాదిది బాణమ్ము- సంగ్రామమునకు పయనమ్ము- రానిమ్ము దేవుడే కానిమ్ము- బారు ఫిరంగులు మ్రోగినా, బాంబుల వర్షం కురిసినా- ఎత్తిన జెండా దించబోం' అని అక్షర ఫిరంగి పేల్చారు. అదే తీరుగా తెలంగాణలో పత్రికా రచయితగా షోయబుల్లాఖాన్ రజాకార్ల ఆగడాలపై తన వ్యాసాల్లో విరుచుకుపడేవాడు. అందుకు ఆయనను కాల్చి చంపారు.
జాతీయోద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి తమ సృజనను కొనసాగించిన కవులు, రచయితలు, తెలంగాణ రాజ్యంపై తిరుగుబాటు ప్రకటించిన కవులూ రచయితలు ఉద్యమంలో భాగమయ్యారు. రాజద్రోహులుగా ముద్రవేయబడ్డారు. అనేక కష్టాలు ఎదురైనా నిబద్ధంగా పోరాటంలో పాల్గొన్నారు. ఇపుడు మనం ఆశించిన స్వాతంత్య్ర ఫలాలు తిరగబడుతు న్నాయి. భారతం పరాధీనమవుతున్నది. అన్ని అమ్మివేయ బడుతున్నాయి. ప్రశ్నించిన స్వతంత్ర దేశంలోనే రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు, కళాకారులు రాజద్రోహులుగా పిలువబడుతున్నారు. 'మన స్వాతంత్య్రం మేడిపండు, దారిద్య్రం రాచపుండు' అన్న చందంగా మారిపోయింది. దేశ వెన్నెముకలైన రైతులు, శ్రామిక చేతులూ నిత్య దోపిడీకి గురవుతూ పోరాట బాటలో కదులుతున్నారు. ఇప్పుడు మన సాహిత్యకారులు, స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో వారికి అండగా నిలవాలి. సాహిత్య సృజన చేయాలి.
- కె.ఆనందాచారి