Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొన్న చూశావు కదా!
రాజీపడని
రహస్యాల గదులు
రహదారి కెక్కి
రచ్చ చేసిన తీరును..
నిన్న విన్నావు కదా!
కోకిల గొంతులు నొక్కిపెట్టి
కాకుల గుంపులు చేసిన
అరాచకమైన శబ్దాలను..
ఇంకా -
చూస్తూనే ఉన్నాం కదా!
ఎరుపెక్కిన కన్నీటి ఆనవాళ్ళను..
నెత్తురుతో తడిసిన చరిత్ర పుటల్లో
ముక్కలైన గాజుపెంకుల్లాంటి
బతుకు చిత్రాలను..
ఇప్పుడా!
చిత్తైపోయిన జీవితాల గురించి,
కాలపు వక్షం నుంచి
రాలిపడిన
ఆ ఎండుటాకుల గురించి
కన్నీటి వాక్యాలు
రాయాలని ఉంది..
గతుకుల దారుల్లో
ఎంత నడిచినా
ఎండదెబ్బలకు
అరికాళ్ళు రక్తమోడ్చినా
జాలిపడని కాలంపై
కొంచెమైనా విసుగుపడక
సూరీడుతో కలిసి తిరిగే
సోపతిగాళ్ళ గురించి
కొన్ని వాక్యాలు
రాయాలని ఉంది..
కడుపులో ఆకలిజెండాలు
రెపరెపలాడుతుంటే..
నిద్రకు వీడ్కోలు చెప్పిన
కళ్ళు రోడ్డంతా నడుస్తుంటే..
ఏ దిక్కూ దొరకక
దిగులు కొండెక్కి
బతుకు దీపం ఆర్పుకుందామనుకునే
పేదరికాన్ని గురించి
కొన్ని వాక్యాలు
రాయాలని ఉంది..
దూప తీరని దోపిడి -
తమను మింగేస్తున్నా
బాధల బరువులను
నెత్తికెత్తుకుని పోయే
కథల గురించి,
గుండెను ఆవిరి చేసే
గుండె పగిలిన
గాథల గురించి,
రేపనే దానిని లేకుండా చేసిన
ఈ రోజు గురించి
కొన్ని నెత్తుటి వాక్యాలు
రాయాలని ఉంది.
తొలిపొద్దుకైనా, మలిపొద్దుకైనా
తెలియని ఎరుపుదనాన్నంతా
సిరాగా నింపుకుని
రాయాలని ఉంది..
- తిరునగరి శరత్ చంద్ర
6309873682