Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన మీద
పద్యమల్లినందుకు పొద్దున్నే
ఇంటి ముందు పారిజాత పూల చెట్టు
పూల తివాచీ పరిచింది!
మార్నింగ్ వాక్ కోసం
ఎత్తిన నా అడుగు
గాలిలోనే నిలిచిపోయింది
ఎగాదిగా దాన్నే చూస్తుంటే
పరిమళంతో స్వాగతం పలికింది!
పంట పొలాల మధ్య
నడుస్తూ నడుస్తూ పోతూవుంటే
ఒక్కసారిగా ఒళ్ళు పులకరించి పోయింది
స్థబ్దంగా నిలబడి చూస్తూఉంటే
పైరు స్పర్శను గాలి మోసుకొస్తున్నది
మట్టికి మనిషికి
ఇంకా మిగిలి ఉన్న పేగు బంధం
నన్ను తన్మయిన్ని చేసింది!
అల్లంత దూరంలో ఒడ్డు మీద
పంట పొలానికి కంటికి రెప్పయిన రైతు
వసంతమంటని చెట్టులా ఉన్నాడు!
అతని తల మీద
తెల్లని గడ్డం నిమురుతూ దళారి గద్దొకటి
నిరంతరం ఎగురుతూనే ఉంది!
బురదలో కూరుకుపోయిన
నా పద్య పాదం గొంతు జీరబోయింది!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి,
9440233261