Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్య విమర్శ, పరిశోధనా వ్యాసాల పోటీ
తెలుగు సాహిత్యరంగంలో కవిత్వం, కథలు, నవలలు వస్తున్నంత విస్తతంగా విమర్శ రావడం లేదు. సమగ్రమైన, పరిపూర్ణమైన విమర్శనా వ్యాసాలు బహు తక్కువ. అలాగే సాహిత్య పరిశోధనా వ్యాసాలు కూడా అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాహిత్య, విమర్శ, పరిశోధనకు సంబంధించిన వ్యాసాల పోటీ నిర్వహించాలని 'పాలపిట్ట'సంపాదక మండలి సంకల్పించింది. సాహిత్య విద్యార్థులు, పరిశోధకులు, విమర్శకులు, సాహిత్యాన్ని బోధించే అధ్యాపకులు, సాహిత్యాన్ని గురించి వ్యాసాలు రాసేవారిని పోటీలో పాల్గొనవచ్చును. ఎంట్రీ ఫీజుగా రూ.500 పంపించాలి. ఈ పోటీలో గెలుపొందిన వ్యాసాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ. 5000/-, రూ. 3000/-, రూ. 2000/- అందజేయనున్నారు. సాధారణ ప్రచురణకు స్వీకరించే ప్రతి వ్యాసానికి రూ. 1000/- చొప్పున పారితోషికం ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు 31 ఆగస్టు 2021లోగా palapittamag@gmail.comకు పంపించవచ్చు. వివరాలకు 9490099327 నెంబర్ నందు సంప్రదించవచ్చు.
22న ''ఫ్రీవర్స్ ఫ్రంట్'' కవిత్వ పురస్కారాలు
అయిదు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ కవిత్వ సంపుటికి బహుమతి ఇస్తున్న 'ఫ్రీవర్స్ ఫ్రంట్' 49వ అవార్డును సిరికి స్వామినాయుడు రాసిన 'మట్టిరంగు బొమ్మలు' కవితా సంపుటికీ.. 50వ అవార్డును ఇబ్రహీం నిర్గుణ్ రాసిన 'ఇప్పుడేదీ రహస్యం కాదు' కవితాసంపుటికీ ఇవ్వనున్నారు. ఈ పురస్కారాలను ప్రసిద్ధ విమర్శకులు శ్రీ జి.లక్ష్మీనరసయ్య అధ్యక్షతన ఆగష్టు 22న ఆదివారం సాయంత్రం 5 గం||కు జూం వేదికగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శీలా వీర్రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తానా నవలల పోటీ-2021 ఫలితాలు
తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) నిర్వహిస్తున్న నవలల పోటీ - 2021 ఫలితాలు వెలువరించింది. ఈ పోటీలో విశాఖపట్నంకు చెందిన చింతకింది శ్రీనివాసరావు రాసిన మున్నీటి గీతలు, అనంతపురంకు చెందిన బండి నారాయణస్వామి రాసిన అర్ధనారి రెండు నవలలు సమాన స్థాయిలో బహుమతికి ఎంపికయ్యాయి. విజేతలకు త్వరలోనే బహుమతుల అందజేస్తామని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.