Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''జీవధ్భాష జీవనదిలాంటిది.జీవనది తన ప్రవాహంలో చిన్నచిన్న పిల్లకాలువలను కలుపుకుని జీవనదిగా గామిస్తుంది.అలాగే జీవధ్భాష కూడా ఇతరభాషా పదాలను సమూచితంగా తనలో కలిపేసుకుంటూ తన జీవలక్షణాలను కాపాడుకొంటూ ఉండాలి. ఏ భాషకైనా మార్పు సర్వసాధారణం''
- రవీంద్రనాథ్ ఠాగూర్
తెలంగాణ కథల్లో జీవద్భాష వైవిధ్యం గొప్పది. కథా సాహిత్య వారసత్వం ప్రాచీనమైనది. తెలుగు కథ పుట్టుకకు వందని, వెయ్యేండ్లని తీర్మానించడం సబబు కాదు. ఆదిమకాలం నుండే తెలుగు కథ మనుగడలో ఉంది.మానవ నాగరికతకు ముందే, మాట పుట్టాక మానవ సంబంధాలలో భాగంగా కథ పుట్టింది. వేదాలకంటే ముందే ఆదిమ అస్థిత్వ కులపురాణం జాంబవ పురాణం రూపంలో కథపుట్టుక తెలంగాణలో ఉంది. ఇది సబ్బండజాతుల సమాహారంగా వర్ధిల్లిన సాహిత్యం. గ్రీకు పురాణగాధలుగా హెల్లన్ చెప్పినట్టు, తెలంగాణాలో ఒక్కొక్క కులానికి ఒక్కో కుల పురాణగాధ ఉంది. అవి చిన్నచిన్న కథలుగా ఉన్నాయి. వీటిని ఆశ్రిత కులాల గాయకులు ఆయా జాతుల కుల గాధలు, వాళ్ళ యుద్దాలు, పోరాటాలు, జీవన సంఘర్షణలకు ప్రతిబింబంగా కథలుగా చెప్పారు.అవి ''విభిన్న శైలీ అల్లికతో వారసత్వం''గా ఈనాటికి ప్రజల నాలుక లపై మౌఖికంగా సజీవంగా ఉన్నాయి.
ముచుకుందా నదీ పరివాహప్రాంతం అచ్చమైన తెలంగాణ తెలుగు భాషా నుడి కారానికి, జీవద్భాష వైవిధ్యానికి, సాహిత్య వైభవానికి ముఖ్యమైన చిరునామా. కేంపు చెరువు (మూసి ప్రాజెక్టు) కేంద్రంగా శీలం భద్రయ్య రాసిన ''లొట్టపీసుపూలు'' కథా సంపుటిలో అట్టి జీవద్భాషా వారసత్వంను, వైవిధ్యాన్ని అందిపుచ్చుకున్నాయి. ఈ కథల ద్వారా నల్గొండ జిల్లా భాషా నుడికారాన్ని, మూసి కథా వైభవాన్ని తెలంగాణ పాఠక లోకానికి కానుకగా ఇచ్చాడు.
''లొట్టపీసుపూలు'' శీర్షికలోనే నిగూఢ అంతరార్ధం దాగుంది. తెలంగాణ మట్టిమీద పూలను కొలిచే సాంప్రదాయమున్నా నిరాదరణకుగురైన పూలెన్నో ఉన్నాయి. సాహితీవేత్తలు సైతం విస్మరించిన పూలల్లో ఒకటి లొట్టపీసు పూలు. వీటికి కావ్యగౌరవం కల్పించడం ద్వారా రచయిత గౌరవం రెండింతలైంది.
ఈ పుస్తకంలో ఉన్న పదిహేనుకథలలో ఇతివత్తం, వస్తువు, నేపధ్యం విభిన్నంగా ఉన్నాయి. కథలలో సాధారణ పాఠకునికి ఆసక్తికరమైన కథనం ఉంటుంది.విమర్శకునికి విస్తత చర్చకు అవకాశం ఉంటుంది.కథలు పాత కాలానివి. కథనం కొత్తది. వాడిన భాష మధురమైనది, సహజమైనది. ప్రతికథలో నాటికాలానికి చెందిన పాత్రల బానిసత్వపు సంకెల్లున్నాయి. అవి తెంచుకోడానికెత్తిన పురుటి నొప్పుల పిడికిళ్ళున్నాయి. పాత్రల గొప్పతనాన్ని అల్లడంలో రచయిత తన లోకజ్ఞానాన్ని వినియోగించి కథలను అందించాడు. కథలు ఎలారాయాలనే సందేహానికి సమాధానంగా ''అందొచ్చిన చేయికి పొందిక కుదిరినట్టు'' ఈతరం కథకులుగా శీలం భద్రయ్య నిలబడతాడు.
''ఇస పురుగు కథలో తక్కువ జాతిమహిళలపై గ్రామాల్లో ఆకత్యాలకు ఒడికట్టినపుడు వాటిని తెలివిగా ఎలా తిప్పికొట్టారో ఉంటుంది. కేంపు చెర్వుకథలో ముంపు బాధితులుగా సబ్బండ వర్గాల ఆర్తనాదాలు, దొరతనం ఆకత్యం ఇతివత్తంతో ఉంటుంది. బంచెర్రాయి కథలో తెలంగాణ మట్టిలో రజాకార్ల ఆకత్యాలకు బలయిన గొడ్డు గోదా, రాజిరెడ్డి తిరుగుబాటు కనబడుతుంది. కర్తవ్యం కథలో కాలువ కిందికి పోయి ప్రాణాలు పోగొట్టుకున్న రాముడు తల్లి దండ్రుల ఆత్మఘోష వినబడు తుంది. లొట్టపీసుపూలు కథలో గిరిజనుడు శివుడుపై పడిన హత్యా నేరానికి, అతని గుడిసె తగలబెట్టడం, కేసులపాలు చేయడం కన్నీరు తెప్పిస్తుంది. టముకు కథలో చేయని తప్పుకు వీరారెడ్డి చేతులలో చావు దెబ్బలు తిన్న మంగలి సర్వయ్య లాంటి వాళ్ళు ఊరొదిలిపెట్టి పోవడం సమాజంలో కనబడే దశ్యాలు సహజంగా కన్పిస్తాయి. కాటికాపరి కులానికి చెందిన ఆనందరావు బాల్యంలో చదువు కోసం పడిన ఆరాటం వెలుగుచుక్క కథ ద్వారా తెలుస్తుంది. ప్రపంచీకరణ ఫలితంగా చెప్పుల కార్కానా మూతపడి వద్దాప్యంలో వైద్యం లభించక విజయమ్మ, రామలింగంలు బతుకుదెరువుతో బాటు ప్రాణాలు పోగొట్టుకొంటారు. కోదండం కథలో రజాకార్లకు ఎదురు నిలబడ్డ అణగారిన వర్గాలకు చెందిన మహిళలు అక్కమ్మ, సాయమ్మలు, వారి పిల్లలు అంజయ్య నాటి తరం తిరుగుబాటుకు ప్రతినిధులు. కొత్తదొరలో దొరపోయినా దొరతనం కోటను ఇడిచి పెట్టకుండా పెంటయ్య నాయకునిలా రూపం మార్చుకోవడం అనేది ఇతివత్తం. కొత్తదొర అధిక్షేపక ఉత్తమకథ. కోటగోడపై చనిపోయిన గబ్బిలం చైతన్యం కోల్పోయిన అణగారినవర్గాల ప్రతీక. ''లత్త కథ''లో లింగమ్మ తలమీదున్న ఎగనాకుడు దరిద్రమనే అపోహను ఈనాటికి అక్కడక్కడ సమాజంలో ఉన్న మూడవిశ్వాసాన్ని కళ్ళకు కట్టారు. మాయబారి కథలో రజాకార్లను ఎదురొడ్డి గెలిచిన అన్నదమ్ములు ముత్తయ్య, పెదీరన్నలు. పుట్టిన గడ్డకు స్వాతంత్య్రం సాధించడం ద్వారా కన్న తల్లికి, కన్న భూమికి మాయబారి చెల్లించారు. కరోనా నేపధ్యంలో రాసిన అగ్గువ బతుకులు కథలో మేకలు కాసే రాములు, రాములమ్మ బతుకులు ఈకాలంలో ఎంత అగ్గువగా మారాయో చెప్పాడు. పరువుహత్య నేపధ్యంగా విధికి బలైన ప్రణరు లాంటి యువకుల జీవితాలు అగ్రవర్ణ దురహంకారంలో ఖూనీ కావడం హద్యంగా మలిచాడు. శూర్పణఖ కథలో మీనాక్షి పాత్రపై సానుభూతి కలిగించేదిగా, ప్రేమకు అడ్డు పేదరికం నిలవడం కొత్తగా పురాణపాత్రలతో పోలిక చేసి కొత్తప్రయోగం చేశాడు.ఇలా కథల్లో వస్తువు నవ్యతతో ప్రతికథ వైవిధ్యంగా ఉంది.
లొట్టపీసుపూలు రచయిత చిన్నకథల నుండి పెద్దకథల వరకు,నాటి నుండి నేటి వరకు అర్ధవంతంగా రాశాడు. యావత్ తెలంగాణ మెచ్చుకోదగ్గ ''కథా శైలీరహౌ'' అనే విధంగా శైలీ అల్లిక వారసత్వంగా అందిపుచ్చుకుని, చేయి తిరిగిన రచయితగా ఎదిగొచ్చిన శీలం భద్రయ్యను ప్రతి ఒక్కరూ మరీమరీ మతిల తెలుసుకొని సాహితీ ఆలింగణం చేసుకోవలసిందే.
ఇప్పటివరకు వస్తువునే శిల్పమని ఆంధ్రప్రాంత రచయితలు భావించారు. తెలంగాణలో కథ లేదని, భాష లేదని శిల్పంలేదని ఇంకా బుకాయించటం వందేండ్ల కథా తీర్మానం చెయ్యటం మూర్ఖత్వం. తెలంగాణ రాష్ట్రం సిద్దించినా ఇంకా అక్కడక్కడా ఆ సన్నాయి నొక్కులున్నాయి. సారవంతమైన సాహితీ సంపదను సాంస్కతిక రూపాన్ని బలవంతంగా మార్చినారు. వీళ్ళను గల్లావట్టి బోనులో నిలబెట్టే తెలంగాణ కొత్తతరం రచయితల రంగప్రవేశం ఒక సంచలనం. శీలం భద్రయ్య ''లొట్టపీసుపూలు'' కథలు తెలంగాణ జీవద్భాష నిజానిర్దాణకు, అసలు సిసలు భాషానిర్మాణ నిరూపణకు ఒక సవాల్‌గా నిరూపిస్తాయి. తెలంగాణ భాషా వారసత్వ కథా వారధిగా సారధిగా నిలబెడుతాయి.శీలం భద్రయ్య తెలంగాణ భాషామట్టి కథలు వర్దిల్లు... కొత్తవస్తు శిల్పమై వర్దిల్లు దేశాన..
- వేముల ఎల్లయ్య,
9440002659