Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊరి వీధులన్నిటినీ నల్లని ఎర్రని జెండాలుగా ఎగరేసిన రోజది. సరిగ్గా ఇరవయ్యారేండ్ల క్రితం(1995 ఆగస్టు 20) వేలాదిగా తరలివచ్చిన ప్రజలూ ఉద్యమసహచరుల మధ్య అంతులేని విషాదమై సాగిన ఆ అంతిమయాత్ర నేటికీ కండ్లముందు కదలాడుతూనేవుంది. తన్నుకొస్తున్న దుఖాన్ని అదిమిపెట్టుకుని సహచరులు జోహార్లు చెపుతుంటే, గుండెలు బాదుకుంటూ ఆత్మీయులు రోదిస్తుంటే, చల్లని మంచుముద్దల మధ్య శాశ్వత నిద్రలో ఉన్న ఆ ముఖం ఇప్పటికీ వెలుగులు చిమ్ముతూనే వుంది. అంజన్న మరణించి రెండున్నర దశాబ్దాలు గడిచిపోయినా ఆయన జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే వెంటాడుతున్నాయి.
సాధారణంగా మరణం ద్వారా మనుషులు మనకు భౌతికంగా దూరమైపోతారు. కానీ వారు తాము జీవించిన కాలాన్ని వెలిగించినవారైనపుడు, ప్రజలకోసం తమను తాము సమర్పించుకున్న వారైనపుడు, తమ జీవితాచరణ ద్వారా జరిపిన కృషీ, నెలకొల్పిన విలువలూ అద్భుతమైన అనుభవాలుగా భవిష్యత్తుకు మార్గదర్శకమై నిలిచినపుడు... వారి జీవితం మరణానంతరమూ కొనసాగుతుందనడానికి అంజన్న ఓ ఉదాహరణ. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ విస్మరణలోకి జారిపోరు. నిజానికిది విప్లవోద్యమాల్లో మహామహులెందరో నెలకొల్పిన మహౌన్నత వారసత్వం. ఆ వారసత్వాన్నే అంజన్న అందిపుచ్చుకున్నాడు. కాబట్టే జననం నుండి మరణం వరకూ జీవితమే ఓ పోరాటమై సాగాడు. ప్రజా పోరాటాలలో చినుకై రాలి, వరదై పారి, ప్రవాహమై పరవళ్లు తొక్కాడు.. బతికినంత కాలం చీకటిని ఛేదించే వెలుతురు పాటయి ప్రవహించాడు. ప్రజాకళల పూదోటలో పారిజాతమై విరబూసాడు. నల్లగొండ ప్రజాతంత్ర ఉద్యమాన్ని నాయకుడై నడిపించాడు.
''నాయకుడంటే కుర్చీలో కూర్చుని సిద్ధాంత చర్చ చేసేవాడు కాదు. నాయకుడంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు చెప్పడం, సంవత్సరానికి రెండు ధర్నాలు, మూడు మీటింగులు, ఆరు సభలు నిర్వహించడం మాత్రమే కాదు, అవి చేసినంతనే జనం నీ వెంట నడవరు. నువ్వు జనంలో కలిసిపోవాలి. నిత్య పోరాటమయంగా నీ జీవితాన్ని మలచుకోవాలి. అనునిత్యం ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాగించాలి''- అంటారు మహానేత పుచ్చలపల్లి సుందరయ్య. ఈ మాటలకు నిలువెత్తు రూపం అంజన్న. ఆయన జీవించిన ముప్పైమూడేండ్ల కాలం చాలా చిన్నదే కావొచ్చు.. కానీ మరణించి ఇరవయ్యారేండ్లయినా అతను జనంలోనే ఉన్నాడు. అందుకు కారణం అతడికి ఉద్యమమూ జీవితమూ రెండూ వేరువేరు కాదు. అంజన్న తన వ్యక్తిగత జీవితానికీ, ప్రజాజీవితానికీ మధ్య వైరుధ్యాల్ని చెరిపేసుకున్నాడు. ప్రజల పట్ల ప్రేమతో, వారి సమస్యల పట్ల స్పందనతో, ఉద్యమాల నిర్వాహణలో తీరికలేకుండా తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా తిరిగాడు. చివరికి ఆ అనారోగ్యానికే బలైపోయాడు. ప్రేమించే గుణాన్ని కోల్పోయినవాడు ఎప్పటికీ ప్రజానాయకుడు కాలేడు. కనుక నిజమైన విప్లవకారుడు ఎప్పుడూ ఓ అద్భుతుమైన ప్రేమికుడై ఉండాలని తన జీవితం ద్వారా ఆచరించి చూపాడు. 'మనుషుల్ని యిష్టపడితే చాలు అది అన్నింటిని ప్రేమించేలా చేయడంతో పాటు, మనం యే వైపు నిలబడాలో కూడా నేర్పుతుంది' అని నిరూపించాడు. అందుకే ఆయన భౌతికంగా దూరమైనా ప్రజల కళ్లల్లో కళల్లో కలల్లో సజీవంగా నిలిచిపోయాడు. కాకపోతే, ఇంకెన్నో అద్భుతాలు చేయాల్సినవాడు ఓ కల చెదిరినట్టుగా చెదిరిపోయాడన్నదే బాధ. అయినా మరణించడమంటే ఊపిరి శరీరాన్ని వీడిపోవడం కాదు... ఆశయం ఆచరణను వదిలి వెళ్ళడం. అంజన్న ఆలోచనలు ఆచరణల మేలు కలయిక. అందుకే అతడు అమరుడు.
కళ అనేది మనసును రంజింపజేయడానికి మాత్రమే కాడు, మేధస్సుకు పదును పెట్టుకోవడానికీ, ప్రజలను మేల్కల్పడానికి కూడా ఉపయోగపడాలని నమ్మినవాడు. కనుకనే ప్రజాకళారంగంలో అద్వితీయమైన పాత్ర నిర్వహించాడు. తెలంగాణలోని ఓ మారుమూల పల్లె తాటిపాములలో పుట్టి, విద్యార్థిఉద్యమ కార్యకర్తగా ప్రారంభమై, యువజన నేతగా ఎదిగి, తెలుగునేల నలుమూలలకూ ప్రజానాట్యమండలై విస్తరించాడు. ఆయన ఓ గాయకుడు ప్రజానాట్యమండలి నాయకుడు మాత్రమే కాదు.. అంతకుమించిన కమ్యూనిస్టు కార్యకర్త. కమ్యూనిస్టు కావడమంటే కేవలం పార్టీ సభ్యత్వం తీసుకోవడమో, అదో గొప్ప ఆదర్శంగా చెప్పుకోవడమో కాదు, అది నిరంతరం జ్వలించే చైతన్యం అని అర్ధం చేసుకున్నప్పుడు కమ్యూనిస్టుగా మారే ఆ క్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. ''పువ్వులన్నింటినీ తుంచి పారేయగలవు, కానీ, వచ్చే వసంతాన్ని అపలేవు'' అన్న నెరూడా అక్షరాలే ప్రాణం పోసుకున్నాయా అన్నట్టుగా.. శత్రువు ఎన్ని అవాంతరాలు సృష్టించినా భవిష్యత్తుపై అచంచల విశ్వాసంతో సాగిన అంజన్న ప్రయాణంలోని ఆ అద్భుతక్రమమే నేడు అతడిని అందరి గుండెల్లో నిలబెట్టింది, ఆదర్శమై వెలుగొందుతోంది.
మనుషుల క్రియాశీలతను మొద్దుబార్చడమే లక్ష్యంగా సాగుతున్న నేటి వాతావరణంలో స్పష్టమైన రాజకీయ దృక్పథం ద్వారా మాత్రమే మనల్ని మనం పదునుపెట్టుకోగలం. అందుకు కట్టుబడిన ఆచరణ ద్వారా మాత్రమే మనల్ని మనం కాపాడుకోగలం. ఇది అంజన్న తన జీవితం ద్వారా, మరణం ద్వారా రుజువు చేసిపోయాడు. మృత్యువు ఎదురుపడ్డా నమ్మిన విశ్వాసాలను నిర్భయంగా ప్రకటించాడు. నిర్బంధాలకు ఎదురెళ్లి ఉద్యమగీతాలను ఆలపించాడు. చెరసాలలకు స్వేచ్ఛను కోరాడు. అక్షరాలకు ఆలోచనలు పూయించాడు. సాక్షరతా ఉద్యమానికి సారథిగా ''చదువు వెలుగు''లు విరజిమ్మాడు. ఒప్పించడమే తప్ప నొప్పించడం తెలియని తనదైన నాయకత్వ పటిమతో మనందరినీ అబ్బురపరిచాడు. ఆశయాలకు ఆత్మీయతను జోడించి, గుండెను పొడి చేసి గడప గడపకు పంచిపోయాడు. అందుకే అంజన్న తనను తీర్చిదిద్దిన ప్రజలకూ, తాను తీర్చిదిద్దిన వేలాది మంది కళాకారులకూ ఏ దారిలో వెళ్లినా ఎదురొచ్చే జ్ఞాపకం. నిరంతర స్ఫూర్తి పతాకం. నిరంతరం ఆచరణలో ఉండే మనిషికి బలమైన విశ్వాసాలతో పాటు, ఉదాత్తమైన విలువలూ ఉంటాయని తెలియజేసాడు.
ఇప్పుడు అంజన్న ఆశయాల్ని కొనసాగించడమంటే ఏమిటి? విలువలతో కూడిన వ్యక్తిగత జీవితం, నిబద్ధమైన ప్రజాతంత్ర ఉద్యమ ఆచరణ, వీటన్నిటికీ కారణమైన మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం... ఈ మూడూ పెనవేసుకుపోయిన జీవితం ఆయనది. దానిని మనం అందిపుచ్చుకోవాలి. గొప్ప ఆలోచనలూ, ఆశయలూ కలిగి ఉన్నంతనే సరిపోదు.. అందుకు తగిన కార్యాచరణ కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. అలాంటివాడు కాబట్టే అంజన్న ఈ రోజు మరుపురాని స్మృతిగీతమై నేటికీ వినిపిస్తున్నాడు. అరుణపతాకమై రెపరెపలాడుతున్నాడు...
- రాంపల్లి రమేష్