Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉడుకుడుకు పొగల బువ్వ
చిప్పల కలుపుకుని తింటే
ఎంత సయీ సక్కదనమో ు-
బంగారం వెండి కంచంల తినేటోల్లకు
ఈ రుచి ఎట్ల ఎరుకైతది !
ఆల్ల నాల్క బంగారం గావచ్చు గని
అంగిటికి కమ్మగ బువ్వ తాకకుంటే
తిన్నా తిన్నట్లు గాదు
మిషిన్ మనుషులు !
మాడు రుచులు !
పేద పేదగా
చిప్పల బువ్వ తినుడు ఇకారమనిపిస్తది
ఓంకారమస్తది -''ఓయుక్కు'' !!
చిప్పల తినడానికి
మహారాజ యోగం గావాలే
ఐదు వేళ్లతో కలుపుక తింటుంటే
అమతం కన్నా ఎక్కువే
దేవతలకు అందని రుచి !!
చిప్పల బువ్వ తినేటోల్ల కువ్వత్ వేరే
కోసులదూరం నడిచినా కాళ్లు గుంజై
చూపు ఆమడ దూరంగా దుర్భిణి
ముదిమి మీద వడ్డా అందరినీ
గుర్తువట్టేతనం యాడికోదు
అందరి పేర్లు యాదుంటయి
మఖం ముఖంల పెట్టినట్లే ఎరుకతనం
చిప్పల తినేటోల్లకు దురాశ
అస్సలు గుండెకు దడగాదు -
బతుకంటే అర్థం పరమార్థం
చిప్పల బువ్వ తినేటోల్లకే సమజైతది
పండితులకేం తెలుస్తది
ఆల్లది గ్రంథపఠనం చిలుకపలుకులు
మొదట్ల అందరం చిప్పలనే తిన్నం
జ్ఞానం ఎక్కువైన కొద్ది
చిప్ప జాగల
లోహం తలెలు తలెత్తినై -
మట్టితనం మనుషులకు
దూరమైంది -
ఇగ మనిషిల మానవత్వం
పలిగిపోక ఎట్లుంటది !!
- కందాళై రాఘవాచార్య
8790593638