Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవుల్లో మారు వేషాల్లో బతికే కవులున్నారు. ఫేక్ కవులున్నారు. వీరికి భిన్నంగా నిజ స్వరూపంతో తమదైన ఆహార్యంతో తమదైన చైతన్య స్వరంతో రంగంలోకి దిగే వారున్నారు. ఈ కోవకు చెందిన కవే బూర్ల వెంకటేశ్వర్లు. మిత్రులు ఇతన్ని 'బూర్ల' అని ప్రేమగా పిలుచుకుంటారు.
జీవితంలో తనకు తారసపడిన చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు స్పందించడం కవిగా బూర్లకు అలవాటు.నిర్దిష్ట వ్యవహారాలనుంచి సాధారణ సమస్యల వరకూ అతని దష్టి సోకుతుంది. రోజువారీ సంఘటనలూ, సన్నివేశాలూ మాత్రమే కాదు జీవిత సారాంశానికి చెందిన పలు అంశాలు ఇతని కవిత్వంలో చోటు చేసుకుంటాయి. సమకాలీన రాజకీయాలను విమర్శనాత్మక వాస్తవికతతో చూడటంలో ఈ కవి దిట్ట.కులం, మతం,మానవ సంబంధాల పట్ల హేతుబద్ధ దక్పధంతో ఉండటం ఇతని బలం.పిల్లల గురించీ, ప్రకతి గురించీ, రైతుల గురించీ, తల్లి దండ్రుల గురించీ, జీవన తత్వం గురించీ పరిపక్వ ఆలోచన చేయగలిగే సత్తా ఈ కవికుంది. సమాజ సమస్యల్ని విడివిడిగా చూసి సంతప్తి పడకుండా, అవి ఒకదానితో ఒకటి పెనవేసుకున్న తీరును పట్టుకోగలిగిన అవగాహన బూర్లకు ఉంది. అలాగే ఆయా విషయాలకుండే పాక్షిక స్వతంత్రను కూడా ఇతను అర్ధం చేసుకోగలడు. ఏది రాసినా ఈ దష్టితో పాటు పదునైన సరళమైన సాదా వాక్యంలో దాన్ని బంధించగలిగే నైపుణ్యం ఈ కవిది.
పైన నేను చెప్పిన అంశాలకు ఈ పుస్తకంలో కావల్సినన్ని ఆధారాలున్నాయి.వీధుల్లో బతుకమ్మ సౌరభం ఎలావుందో ఒక చోట ఇలా చెబుతాడు:
తొవ్వంతా
నెత్తిన పూల తోటనెత్తుకొని నడుస్తున్నది
బజారాంతా
బతుకు పాటకైగట్టి అందుకున్నది
బతుకమ్మ
కళగల్ల మొకంతోని నవ్వుతున్నది
వాక్యాన్ని చదవటానికి మనం కష్టపడనక్కరలేకుండా మెత్తగా సాగిపోయే విధానం. పై వాక్యాల్లో ఉన్న సౌందర్యం అలాంటి సాదాసీదా నిర్మాణం నుంచి వచ్చిందే. కవికి ఉండాల్సిన ఈ ముఖ్య లక్షణం బూర్ల నుంచి ఏ సందర్భంలోనూ తప్పుకోదు. తెలంగాణ సాధించిన తరువాత సాగుతున్న పాలక రాజకీయం మీద విమర్శ చేసే సందర్భంలోనూ సంక్లిష్టత ఇతని వాక్యాల దరిచేరదు.
''ఇన్నేండ్లు పోరు ధారవోసింది
ఇంకా పాలేరుతనానికి కానే కాదు
అధికారం భుజం మార్చుకునే
పటేలుతానానికే
ప్రజా తెలంగాణమంటే
జెండా నడింట్ల పాతుకునటానికి కాదు
నడి బజాట్ల ఎగరేసుటానికే''
తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని వెలిబుచ్చుతూనే పాలకుల పోకడలను ఎండగడుతున్న పై వైనాన్ని ఈజీగా గుర్తించొచ్చు. తన రాష్ట్ర పరిస్థితినే కాదు ప్రయివేటు పరమైపోయిన దేశాన్ని కూడా పదునైన వ్యక్తీకరణకు గురిచేశాడు. 'కార్పొరేట్ కత్తి కింద వంగిన గొర్రెల తలలన్నీ ఎవరివ'ని వాకబు చేస్తూ వచ్చిన రాజకీయ నిర్దారణ బలంగా వ్యక్తమైన తీరు చూడండి.
''గతమంతా బహిరంగ దౌర్జన్య బలవంతుల రాజ్యం
వర్తమానమంతా ప్రజాస్వామ్య నియంతల స్వామ్యం
భవిష్యత్తంతా ఆర్ధిక దుర్మార్గుల ఎస్టేట్లో ప్రైవేటయ్యే దేశం''
బూర్లకు పాలక వ్యవస్థ మీదే కాదు పాలిత వ్యవస్థ మీదా విమర్శ ఉంది.
''నువ్వూ నేనూ శత్రువు చేతికి కరవాలమై
అస్తిత్వాల్ని మట్టుపెట్టే శ్లోకాలు పాడుతం''
ఈ అవగాహన వల్లే ఈకవి ఈనాడు దేశంలో సాగుతున్న అసహనాన్నీ, మత హింసనీ నిలదీయ గలిగాడు. సుసంపన్నమైన, బహువిధమైన ఈ దేశ సంస్కతిని ముక్కలు చేస్తున్న చాందస తల్వార్ నీ, 'చిల్లుల బొంతను చేసి' చిందులేస్తున్న శూలాన్నీ బోనులో నిలపగలిగాడు.
''జుట్టు పెంచలేదని గడ్డాన్నీ
బురా? వెయ్య లేదని పువ్వుల్నీ
కుడి చెయ్యిలా లేదని ఎడమ చేతినీ
సాష్టాంగ నమస్కారం చెయ్యలేదని మోకాల్లనూ
బరుకడం చిదుమడం విరవడం నరకడం'' అంటూ చక్కని పొయేటిక్ లాజిక్ ను నిర్మించగలిగాడు.
ఈ మానవ ప్రేమ పునాది నుంచే తన మూలాలతో బలమైన బంధాన్ని కలిగివున్నాడు.తన కులాన్నీ, మొత్తం పీడిత కులాల్నీ వాటి ఆరాటాల్నీ, పోరాటాల్నీ అక్కున చేర్చుకున్నాడు. ఈ క్రమంలో చేనేత వత్తి ఎదుర్కొంటున్న సంక్షోభం మీదా, వ్యవసాయ ఎద్దడి మీదా మంచి కవిత్వం రాశాడు.బాల్యం లోకి వెళ్లి తండ్రి తనకోసం దాచి తెచ్చిన శితపకాయల్ని పచ్చిగడ్డి మోపు నడుమ వెదుక్కున్నాడు.
పర్యావరణాన్నీ, బుద్ధిజాన్నీ, అంబేడ్కర్నీ సొంతం చేసుకున్నాడు. జీవితాన్ని తాత్వికంగా అర్థం చేసుకోవటానికి వ్యాకులతతో కూడిన ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో కొన్ని పరిశీలనాత్మక చింతనలను వెదజల్లటమూ చేశాడు.
కానీ ఎన్నో కలలున్నాయి కాబట్టి భౌష్యత్తుమీద ఆశాభావం ఉన్నట్లే.అందుకే 'మనిషి దివ్వె', 'పనిమంతునివై' లాంటి కవితలు రాయగల్గాడు.
''లోపం ఒక నెపం మాత్రమే
కాళ్లులేని నది పరుగెడుతుంది
కదలలేని తరువు గాలిని విసిరికొడుతుంది
పరుగులేని సముద్రం కెరటపు పోటెత్తుతుంది''
ఇదీ ఈ కవి స్ఫూర్తిమత్వం. కూలబడ్డ వాళ్లకూ, బెదిరిన వాళ్లకూ, చెదిరిన వాళ్లకూ అవసరమైన వాక్యాలివి. ఇంత ఆరోగ్యకరమైన ఆలోచనలు చేసే బూర్ల వెంకటేశ్వర్లు
'అర్జునుని వంటి నిన్ను/ ఆ ఉత్తరాదులు బహన్నలను చేశారా' లాంటి వాక్యాలను రాయకుండా ఉంటే బాగుండేది. అర్జనుడు సానుకూలమూ కాదూ, బహన్నల ప్రతికూలమూ కాదు. నిజానికి జెండర్ సేన్సిటివిటి పెరుగుతున్న ఈరోజుల్లో బహన్నలను చిన్నచూపు చూడటం హర్షణీయం కాదని నా అభిప్రాయం.
ఒక మనిషి ఇతరులతో మాట్లాడేటప్పుడు తన భావాల్ని స్పష్టపరచడం అసాధ్యం కాదు. మాట్లాడేది శుద్ధ వచనమైనా, గాఢ కవిత్వమైనా కమ్యూనికేషన్ బ్రేక్ కావాల్సిన అగత్యం లేదు.ఈ సత్యాన్ని ఎంతోమంది మంచి కవులు ఇప్పటికే నిరూపించారు.ఇలాంటి కవుల్లో బూర్ల కూడా ఖచ్చితంగా ఉంటాడు.చిక్కదనాన్ని సాదాతనంతో సమ న్వయీకరించ గలిగిన సామర్ధ్యం ఈ కవిది. మొత్తంగా సానదేలిన తేటవాక్యం బూర్ల కవిత్వం.
- జి.లక్ష్మీనరసయ్య