Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వంలో ప్రాంతీయ తత్వం గురించి మీరేమంటారు?
కవులు రచయితలు విశ్వ జనులు. ప్రవహించే నదులలాంటి వారు. వారికి ప్రాంతాలుండవు. నిరంతరం ప్రజల్ని చైతన్యం జేస్తూ అలా సాగిపోతుంటారు. కాలమాన సందర్భాలను బట్టి ఏ నేలకానేల తన కవుల్ని రచయితల్ని తయారు జేసుకుంటుంది. ఏ నేల మీద దుఃఖం ఉంటుందో.. సంక్షోభముం టుందో.. ఏ నేల మీద కష్టాలూ కన్నీళ్లూ సమ్మిళితమై ప్రవహిస్తాయో ఆ నేల మీంచి మంచి సాహిత్యం వస్తుంది. ఒక ప్రాంతంలో సంక్షో భాన్ని అన్ని ప్రాంతాల కవులు స్పందించి రాస్తారు. కాకపోతే ఏ ప్రాంత సమస్యలు ఆ ప్రాంత సాహిత్యవేత్తలు గట్టిగా వినిపించ గలరు. ఆ నేల అస్తిత్వాన్ని ఇతర ప్రాంతాల కవులకంటే బలంగా చెప్పగలరు.. ఎందుకంటే ఆ సంక్షోభాన్ని స్వయంగా అనుభవిస్తారు కాబట్టి. అంతేగానీ కవులకు, సాహితీమూర్తు లకు ప్రాంతాలుండవు. దారుణ ఘట నలు జరిగినపుడు తెలుగు సాహితీ ప్రపంచమంతా కంపిస్తోంది. నిరసన సాహిత్యాన్ని వెలువరిస్తోంది. అలాగే న్యాయబద్దమైన ప్రాంతీయ ఉద్యమా లకు అనుకూలంగా తెలుగు సాహిత్యం స్పష్టమైన మద్దతు ప్రకటిస్తోంది. కాబట్టి వ్యక్తులకు ప్రాంతాలుంటాయి గానీ.. కవులకు ప్రాంతా లుండవు. కవులకు ప్రాంతాలను అంటగట్టి అక్కడికే పరి మితం చేయడం సముచితం కాదు. వేరు పరచడం మంచిదికాదు. కవిత్వం వేరు. వ్యక్తులు వేరు. వ్యక్తుల పరివర్తనల్ని మొత్తం ఆ ప్రాంత సాహిత్యానికి ఆపాదించ కూడదు. అన్ని ప్రాంతాలకు చెందిన నా ముందు తరాల కవుల నుండీ నేనెంతో స్పూర్తిని పొందేను. నేడు వివిధ ప్రాంతాలనుండీ నాతో నడుస్తున్న తరాల ప్రేమనూ పొందు తున్నాను. ప్రాంతాలకతీతంగా ఒక అక్షర బంధం మనల్ని దగ్గర చేస్తుంది. నిజమైన కవులూ సాహితీ వేత్తలూ ప్రాంతా లకు.. కులాలకు.. మతాలకూ.. అతీతంగా ఉంటారు. అడ్డుగోడలు కూలగొడతారు.
సమాజ చలన గతిననుసరించి, సామాజిక సందర్భాల్లో చోటు చేసుకుంటున్న అనేక వేగవంతమైన మార్పుల నేపథ్యంలో కవిత్వం ద్వారా ఏదైనా సాధించగలమా? మీ అభిప్రాయం..?
ప్రపంచీకరణ ప్రభావం వలన మానవ జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సమాజ చలనగతి త్వరితంగా మారుతోంది. ఒక విధ్వంసం మన చుట్టూ నల్లమబ్బులా కమ్ముకుంటోంది. వరదలా ముంచు కొస్తోంది. ఈ విధ్వంసం మనం కోరుకున్నది గాదు. అలా అనీ ఆపలేమని చెప్పీ మౌనంగానూ ఉండలేము. కానీ.. మన నిరసనైనా తెలియచేయాలి కదా. ఆ నిరసనే కవిత్వం. ఈ రోజు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటం జేస్తున్నారు. సాహిత్యవేత్తలు అనేక రూపాల్లో మద్దతు ప్రకటిస్తున్నారు. రేపు విజయం సాధించవచ్చూ.. లేక పోవచ్చు.. కానీ ఒక సామూహిక నిరసన వ్యక్తపరిచాం గదా.. కవిత్వమిదే చేస్తోంది. అంతెందుకూ కవులూ సాహితీవేత్తల వలనే అంతటి తెలంగాణ ఉద్యమం పతాకస్థాయికి చేరి విజయం సాధించింది. కాబట్టి కవిత్వం ద్వారా ఏదైనా సాధించామా లేదా అన్నదాని కంటే ప్రజల ఆకాంక్షల్నీ ఆశల్నీ ప్రతిబింబించామా లేదా అన్నదే ముఖ్యం.
మునుముందు సమాజంలో కవి ఎటువంటి పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉందంటారు?
ప్రస్తుతం సంక్లిష్టమైన స్వేచ్ఛారహితమైన సందర్భంలో మనమున్నాం. నిత్య నిర్బంధాల మధ్య బతుకుతున్నాం. ఇవాళ కవులు రచయితల పాత్ర చాలా ఆవశ్యకమైనది. శత్రువు చాలా బలవంతుడు. కనిపించడు. అనేక రూపాల్లో దాడి జేస్తున్నాడు. ఊపిరాడ నివ్వ కుండా ఉరులు పన్నుతు న్నాడు. ఉన్న సాహిత్యవేత్తలం పిడికెడు మందిమి. మనం కూడా ప్రాంతాల కులాల మతాల వర్గాల పేరుతో చీలిపోతే ఎలా..? మనం సమిష్టిగా కలసి శత్రువు దాడిని ఎదుర్కోవాల్సిన అవసర ముంది. అందుకు కవులూ రచయితలూ ఒక వేదిక మీదకు రావాల్సిన సమయమాసన్నమైంది. ఇప్పటికే మన మూలాల్ని కోల్పోతున్నాం. మన భాషకీ యాసకీ బతుక్కీ దూరమై పోతున్నాం. పేద ధనిక వర్గాల మధ్య అంతరం విపరీతంగా పెరిగి పోతోంది. రైతు మాయమవుతు న్నాడు. బజారు విస్తరి స్తోంది. విలువలు పతనమవుతు న్నాయి. మతం పేరున.. కులాల పేరున.. ప్రాంతాల పేరున విడిపోయి మనిషి ముక్కలైపోతున్నాడు. ఈ విధ్వంసమంతా సాహిత్యంలోకి రావాలి. ప్రజలు చైతన్యం కావాలి. ఇందుకు సాహిత్యవేత్తల పాత్ర కీలకమైంది. కవులు.. సాహితీ వేత్తలు సమాజ నిర్మాతలనీ మరోసారి రుజువు చేయాలి.
''కవిత్వం'' అంటే మీ మాటల్లో..?
ఇదీ కవిత్వమని చెప్పలేం. కవిత్వమొక అనుభూతి. గుండె తాకిన ప్రతి వాక్యమూ కవిత్వమే. కవిత్వమొక దీర్ఘ తపస్సు. ఒక దీక్షాకంకణం. అత్తరు పూయాటం కాదు, వాక్యాన్ని పదునైన కత్తిని జేసీ కాలానికి కాపలా కాయటం. అక్షరాల్ని నిప్పుల్లో కడిగి ప్రజాక్షేత్రాల్లో విత్తులుగా వెద జల్లటం. కవిత్వం మనిషిలో దీపం పెడుతుంది. నదిలా విశాలం చేస్తుంది. జీవితమెక్కడ ఉంటుందో కవిత్వమక్కడ ఉంటుంది. కాలంతో పాటు ప్రవహిస్తూంది. తరాల మధ్య వారధి కడుతుంది. కవిత్వం పోటీకాదు. పురస్కారాలూ భుజకీర్తులూ కాదు. ఎవరి భావజాలాలు వారివి.. ఎవరి ఆలోచనా వైఖరులు వారివి. తదనుగణంగా సాహిత్యానికీ.. తద్వారా సమాజానికి మనమేం ఇచ్చామో అదే కావాలి. కవులు సమాజాన్ని అంతర్నేత్రంతో సునిశితంగా పరికించాలి. కొత్త దారుల్ని నిర్మించుకోవాలి. పడే వేదన మనదిగా ఉండాలి. పరకాయ ప్రవేశం చేయాలి. ముందు తరాల్ని గౌరవించటం.. వెనుక తరాల్ని ప్రేమిం చటం పోత్సహించటం చేయాలి. అంతి మంగా కవిత్వంలో నిబద్ధత ఉండాలి. ప్రజాక్షేత్రంలో నిత్య జాగరూకులై ప్రజల్ని కాపలాకాస్తూ.. కవులు నిరసన జెండాలు కావాలి. కవిత్వం శాశ్వత ప్రజాపక్షం గావాలి.
- సిరికి స్వామినాయుడు