Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వచన కవితా పితామహుడిగా పేరు గాంచిన కుందుర్తి ఆంజనేయులు గారు 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపించారు. పద్యం ప్రధాన సాహిత్య స్రవంతిగా ఉన్న క్రమంలో, యువతలో వచన కవిత్వాన్ని ప్రోత్సహించడానికిగానూ ఉత్తమ వచన కవిత్వానికి బహుమతి ఇవ్వాలని సంకల్పించారు కుందుర్తి గారు 1967లో. అదే ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్. ప్రముఖ కవి శీలా వీర్రాజు గారు మొదటి అవార్డ్ అందుకున్నారు. 1982లో కుందుర్తి గారి మరణం అనంతరం ఆయన ఆశయాన్ని కొనసాగించారు వారి కుమారుడు కుందుర్తి సత్యమూర్తి గారు. ఆయన సాహితీవేత్త కాకపోయి నప్పటికీ తండ్రి సంకల్పాన్ని నేరవేర్చడం బాధ్యతగా స్వీక రించారు. కుందుర్తి వారిపై గౌరవంతో శీలా వీర్రాజు సుభద్రా దేవి దంపతులు ఫ్రీవర్స్ ఫ్రంట్‌కు కార్యకర్తలుగా సహకారం అందిస్తూ వచ్చారు. పదేళ్ళ క్రితం సత్యమూర్తి గారూ ఈ లోకాన్ని వీడి పోయారు. తదనంతరం తన భర్త అడుగుజాడల్లోనే ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్ ప్రధానాన్ని కొనసాగిస్తూ వచ్చారు ఆయన భార్య ఆదర్శమూర్తి శాంత గారు. యాభై ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రస్థానం, అనివార్య కారణాలతో ఇంతటితో ఆగిపోవటం తెలుగు వచన కవిత్వానికి కాస్త విచారం కలిగించే వార్తే. మొదట 116 రూపాయలు అవార్డు పారితోషికంగా ఆరంభమై నేడు 10,000 రూపాయలను పురస్కార గ్రహీతకు అందిస్తూ వచ్చారు. ఇందులో ప్రభుత్వం చేయి గానీ ఇతర వ్యక్తుల ప్రమేయం కానీ లేవు. కేవలం కుందుర్తి వారి కుటుంబమే ఆర్థిక వనరుల్ని సమకూర్చింది. ఇప్పటి వరకూ ఈ అవార్డు పొందిన కవిత్వాన్ని గమనిస్తే ఎంతటి నిజాయితీగా ఈ అవార్డుల ఎంపిక జరిగిందో తెలుస్తోంది. ఎంతోమంది మహామహులు, ప్రముఖులు ఈ అవార్డు ను ప్రతిష్టాత్మకంగా భావించారు.
2018, 2019 సంవత్సరాలకు గానూ 49 వ, 50 వ ఫ్రీ వర్స్ ఫ్రంట్ అవార్డు లు పొందుతున్న కవులు ఒకరు కళింగాంధ్ర నుంచి సిరికి స్వామి నాయుడు గారు, మరొకరు తెలంగాణ నుంచి ఇబ్రహీం నిర్గుణ్ గారు. ఇరుప్రాంతాలూ పోరుభూములే. ఇరువురి జీవన నేపథ్యాలూ కష్టాల కడలులే. శ్రమ రుచి లోతుగా తెలిసిన మనుషులే. ఈ ఇద్దరూ ఉపాధ్యాయ వత్తిలో ఉన్నవారే. అంతేకాదు ఇద్దరూ కవిత్వం పట్ల నిబద్ధత గలవారే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, పార్వతీ పురం వాస్తవ్యులైన కవి సిరికి స్వామినాయుడు గారి తొలి కవితా సంపుటి ''మంటి దివ్వె'' 2011లో వచ్చింది. 2018లో వచ్చిన ''మట్టి రంగు బొమ్మలు'' వారి మలి కవితా సంపుటి. 49 వ ఫ్రీ వర్స్ ఫ్రంట్ అవార్డు అందుకుంటున్న సంపుటి ఇదే. వీరి నుంచి మరొక నూతన కవితా సంపుటి ప్రచురణకు సిద్ధంగా ఉంది.
2019వ సంవత్సరానికి గానూ 50 వ ఫ్రీ వర్స్ ఫ్రంట్ అవార్డ్ అందుకుంటున్న కవి ఇబ్రహీం నిర్గుణ్ గారు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా వాస్తవ్యులు. వారి మొదటి కవితా సంపుటి ''ఇప్పుడేదీ రహస్యం కాదు''. ఇప్పుడు అవార్డు అందుకుంటున్న సంపుటి ఇదే. వీరి నుంచి మలి కవిత్వసంపుటి రాబోతోంది.
ప్రతిష్టాత్మక ఫ్రీ వర్స్ ఫ్రంట్ అవార్డ్ అందుకున్న నేపథ్యంలో వారిరువురితో చిన్న ముచ్చట..
కవిత్వం కవికి ఊపిరి లాంటిది
- ఇబ్రహీం నిర్గుణ్
కవిత్వం ఏం చేయగలదంటారు?
మన హిందీ సాహిత్యంలోని నాలుగు భాగాలలో రీతి కాల్లో బిహారీలాల్ అనే పండితుడు పనిచేసే రాజ్యంలో రాజు తన రాజ్యాన్ని పట్టించుకోకుండా జల్సాగా గడిపేస్తుం టాడు. ఆ సమయంలో బిహారీ లాల్ రాసినటువంటి ఒక పద్యం చదివి రాజుగారు వెంటనే కొన్ని నిమిషాల్లోనే కిందికి వచ్చి తను అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితానికి ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచే చెక్ పెట్టి, తన రాజ్యాన్ని చాలా గొప్పగా పరిపాలించు కున్నాడు. ఇలాంటి నిదర్శనాలు ఎన్నో.
కవిత్వంలో ఏదో లేకపోతే కవుల్ని రచయితల్ని చూసి ప్రభు త్వాలు ఎందుకు భయపడతాయి. ఎందుకు వారిని చేర దీస్తాయి. ఎందుకు వారికి తాయిలాలు ఇస్తున్నాయి. అంటే సంథింగ్ ఏదో ఉంది. కవి వల్ల ఏదో ప్రమాదం ఉంది. కవి వల్ల ప్రభుత్వాలు కూలిపోయిన ఉదాహర ణలూ ఉన్నారు. కవి అంటే పాలకవర్గాలుకెప్పుడూ భయమే. సామాన్యునికి కవిత్వం అర్థం కాక పోవచ్చు. అదే కవిత్వం పాట రూపంలో ఉంది కదా. పద్యం రూపంలో ఉంది కదా. అది కూడా భయ పెట్టొచ్చు కదా. సామాన్య మానవునికి అది చేరినపుడు అత్యంత కీలకమైన ఓటు అనే అంశాన్ని అది ప్రభావితం చేయొచ్చు కదా. కాబట్టి కవిత్వం అంటే ఏదో కాదు. జనాన్ని కదిలించి ఆలోచింపజేసేది కవిత్వం. చాలా శక్తివంతమైనది.
మీ జీవితంలో కవిత్వం ప్రవేశించక ముందు, కవిత్వానంతరం మీ లోపలి చైతన్యంలో గల మార్పు ఏమైనా మీరు గమనించుకున్నారా?
నా లైఫ్‌లో కవిత్వం రాకముందు నేను ఒంటరివాణ్ణి. అన్యాయం జరిగితే ఖండించే స్వభావం మొదటి నుంచి ఉంది. అయినా కొన్ని పెద్దగా పట్టించుకోకపోయేవాణ్ణి. ఇప్పుడు నేను ప్రతిదీ పట్టించుకుంటాను. ఇక్కడే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఏం జరిగినా కానీ ఇప్పుడు పట్టించుకుంటాను. ఇంతకుముందు నాకు నొప్పి పెద్దగా తెలియకపోయేది. ఎప్పుడైతే 1992 నుంచి శివారెడ్డి గారి కవిత్వం చదవడం మొదలెట్టానో, ఆ వాక్యాలు నన్ను బాధపెట్టాయి. నన్నె క్కడో ఇబ్బంది పెట్టాయి. నన్ను కోలుకోకుండా దెబ్బ తీశాయి. అక్కడ నుంచి నేను ఆలోచించడం మొద లుపెట్టాను. ఎదుటివారి బాధను అర్థం చేసుకునే శక్తి ఏదో కవిత్వానికి ఉంది అనిపించింది. ప్రపంచమేదో దుఃఖపడుతోంది. అందులో మనమూ ఒక సమిధ కావాల నిపించింది. ఆ దుఃఖంతో నేనూ బాధపడుతున్నా అని తెలియాలను కున్నా. అదే నావైన వాక్యాల్లో చెప్తున్నా. సమాజంలో జరిగే అన్యా యాల్ని చూసి దుఃఖపడు తున్నా. కవిత్వంలోకి రాక ముందు కొన్ని సంఘటనలకు ఏమీ అనిపించేది కాదు. కవిత్వంలోకి వచ్చాక ఆయా సంఘటనల బాధితుల్లో నా కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. కవిత్వం చదవడం మొదలె ట్టాక నాలో ఉన్న నేను కరిగిపోతోంది. ప్రతి దానికీ చలించడం మొదలైంది. కవిత్వం రాయడం మొదల య్యాక ఇప్పుడు, నేను నేను కాదు. నావాళ్ళు కూడా ఒక్కోసారి నా వాళ్ళు కాదు అనిపిస్తుంది. నా వాక్యాలన్నీ ప్రజలవే అనుకున్నా.
కవిత్వ ప్రపంచంలో ఆధిపత్య ధోరణి ఉందంటారా? మీ అభిప్రాయం ఏమిటి?
ఉంది అనుకునే వాళ్ళకి ఉంది. లేదనుకునే వాళ్ళకు లేదు. అయితే ఆధిపత్యం చేయాలనే ఉద్దేశ్యంతో కవిత్వం రాస్తే అది కవిత్వం కాదు. అందర్నీ కలుపుకుపోయేదే కవిత్వం. ఎవరి భావస్వేచ్ఛకు అనుగుణంగా ఎవరికి కలిగిన ఫీలింగ్‌తో వారు రాస్తారు. అంతేకానీ చివరికెళ్ళో మధ్య లోకెళ్ళో ఈ వాక్యం ఇలాపోతే బావుండేది, ఇంకా బాగా రాయొచ్చు అనటం కరెక్ట్ కాదు. ఆ విధంగా చేయడం వారిని అభద్రతా భావానికి గురిచేయడమే. ఆ కుంగుబాటు కు గురై రాయకుండా ఆగిపోయిన వాళ్ళను కూడా చూశాం. నిజానికి ఎవరైతే ఆధి పత్యం ప్రదర్శిం చాలనుకుంటు న్నారో వారే అభద్రతతో బాధ పడుతున్నట్టు. ఏదైతే అనుభవిస్తారో, చూస్తారో, వారి మనసుకు కలిగిన భావన నుంచి వారు రాస్తారు. అదే అనుభవం ఇంకొకరికి ఉండకపోవచ్చు. అదే అనుభవం ఉన్నా ఒకే లాంటి భావన వేరొకరికి కలగాలని లేదు. భావస్వేచ్ఛను గౌరవించాలి అని నా అభిప్రాయం.
'కవిత్వం' అంటే ఓ కవిగా మీ మాటల్లో..?
కవిత్వం అనేది కవికి ఊపిరి లాంటిది. మనం బ్రతికి ఉండి శ్వాస తీసుకున్నట్టే. కవి రాయకపోయినా చదువు తుంటాడు. వింటుంటాడు. కవిత్వం అంటే ఒక ప్రేమ ఉంటుంది. కవిత్వానికి మరణం ఉండదు. ప్రపంచం అంతరించిపోయే వరకూ ఉంటుంది. కవిత్వం అంటే గొప్పగా ఎక్కడో ఉండేది కాదు. భాషలో, యాసలో, చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు కానీ నిత్యజీవన సంభాషణ ల్లోనే భాగమై ఉంటుంది కవిత్వం.
ముందు ముందు కవిత్వం ఎలా ఉంటే బావుంటుందని మీరు ఆశపడుతున్నారు?
ముందు ముందు కవిత్వం బతకాలంటే ఒకరి కవిత్వం మరో కవి ఈర్ష్య కు గురికాకూడదని కోరుకుంటున్నాను. కవిత్వం మంచి విమర్శకు లోనుకావచ్చు కానీ ఈర్ష్య కు గురికాకూడదు. కవిత్వానికి ఆవల ఉన్న వ్యక్తి అసూయ పడితే పోనీ, కవిత్వంలో బతికే వారికి అది అంటితే కవిత్వం బతుకుతుందా? కవిత్వం బతకాలంటే కవి ఈర్ష్యకు దూరంగాఉండాలని గట్టిగా కోరుకుంటున్నాను.
- ఫణిమాధవి కన్నోజు
7659834544