Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవల కండ్లు పొడిగా వున్నాయని
బయట ఋతువులు
బిక్కమొహం ఏసుకోని పోతున్నయి
భూత భవిష్యత్ లేమో కాని
వర్తమానంలోనే పూలచెట్లు తొలిగి
సమాధులు మొలకెత్తుతున్నాయి
కాలం ఎనెక్కి చూడదు
కుబుసాన్నే వదులుతుంది
రాత్రి నేను నిద్రపోకుండా
ఎదురు చూస్తున్నా
రేపు పూర్తి చేసుకొని
ఎల్లుండి ఆవులెల్లుండికి
అర్రులు చాసుకొని
పాదాలు తచ్చాడుతున్నాయి
జంత్రిలో దాసుకొని
పొద్దున్నే బిక్కుబిక్కుమంటు లేస్తున్నా
రోజు వొచ్చి
పిట్టగోడ మీద వలే పిట్టలు
నన్ను చిన్నంతరం చేసి చూస్తున్నాయి
ద్కెన్యపు నీడల మీద
సానుభూతి జల్లు కురుస్తుంది
కాలం దినాలుగా మారి
దినాలు చేస్తుంది
ఎవలింట్ల ఎవలికి
గంట మోగుతుందో
నిజమే కాలం కాష్టమ్కెంది
కట్టుకున్న మూటలేమో కాని
మూట కట్టి
నలుగురు లేకుండా
నారాయణా అనకుండా
చేతులు దులుపుకోవడం
చేదు నిజం
రోగ మెక్కడిది
గీ వ్కెదుగ మెక్కడిది
మా ఇంట్ల పుట్టిందా
మా వొంట్ల పుట్టిందా
పెయ్యి లేదు
పొయ్యి లేదు
దింపుడు కల్లెం దిగులు లేదు
పాడె కూడ లేని గొప్ప శవాలు
ఎక్కడికి ఎదిగినం
ఏడిదాక ఎదిగినం
చివరికి మిగిలింది ఏంది
పీనిగలు మరిన్ని పీనిగలు
సమస్తం పీనిగలు
అధిపత్యమే అరిష్టమ్కెంది
అందర్ని చంపేస్తుంది
మరణాల విస్తరణనే కోరుకుంటుంది
తెలిసో తెలువకనో
వొచ్చిన కాడికి వొచ్చినం
ఈ భూమండలం మీద
మహా మోనం కమ్మక ముందే
మల్లి వొచ్చిన తోవనే
ఎనక్కి పోవాలనిపిస్తుంది
పిల్లలు పిల్లలా పిల్లలు
నాయిన తాతల్లా
బతుకుతారన్న ఆశ
చెట్లు చేమని మందలిచ్చి
పచ్చులకు నాలుగు గింజ లేసి
పిల్లబాట ఎంట
మళ్లి మొదట్నుంచి
రావలనిపిస్తుంది
- మునాసు వెంకట్
9948158163