Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భౌతిక రూపమున్న ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చుతూ ఉపమ లేదా రూపక అలం కారాన్ని ఉపయోగించి కవిత్వం రాసినప్పుడు, ఆ రెండింటి మధ్య భౌతికమైన సారూప్యం (physical resemblance) ఉంటే ఆ పోలిక బాగుంటుంది. పాతకాలపు పోలికలు దాదాపు అన్నీ అట్లా రూపపరమైన సాదశ్యం ఉన్నవే. చంద్రబింబం వంటి ముఖం, దొండపండు లాంటి పెదవి, శంఖం లాంటి మెడ, అరటి బోదెల్లాంటి ఊరువులు, తామరతూడుల వంటి వేళ్లు మొదలైన పోలికలను పరిశీలిస్తే వీటిలోనివి అన్నీ భౌతికమైన వస్తువులే అనీ, పైగా వాటి మధ్య భౌతికమైన సారూప్యం ఉన్నదనీ గమనించవచ్చు మనం. కోటేరులాంటి ముక్కు అనే పోలిక కూడా ఎంత బాగుంది! అసలు కోటేరు అంటే ఏమిటి? దుక్కికి పోయేటప్పుడు గానీ దుక్కి దున్ని తిరిగి వచ్చేటప్పుడు గానీ, దుంప మీదికీ కర్ర కిందికీ ఉండేట్లు తలకిందుగా కాడికి తగిలించే నాగలి, అని అర్థ వివరణ ఇచ్చారు ఒక నిఘంటువులో. అంటే నాగలికర్రు (ploughshare) లాగా ఉన్న ముక్కు అన్నమాట. మనం తరచుగా వాడుతూ కూడా కచ్చితమైన అర్థాన్ని తెలుసుకోని తెలుగు పదాలు ఉన్నాయి కొన్ని. ఆయన ఫలానా రంగా నికి ఎనలేని సేవ చేశాడు, ఆమె ఆదమరచి నిద్ర పోయింది... ఈ వాక్యాలలోని ఎన, ఆద అనే పదాల అర్థాలేమిటి అని చెక్ చేసుకునేందుకు బద్ధకిస్తాం. ఇవి అచ్చ తెలుగు పదాలే మరి! పాత పోలికలలో కంజదళాయతాక్షి కూడా సరిగ్గా పొసగే పోలికే. దాని అర్థం తామరరేకుల వంటి కన్నులు కలది అని. అదేవిధంగా మీనాక్షి.... అయితే, వీటిలోని కొన్నింటిలో అతిశయోక్తి ఉన్న మాట నిజం. కానీ, కవిత్వ మంటేనే అతిశయోక్తి కదా. పాతకాలపు ఈ పోలికలు బాగున్నా ఇవి చాలా అరిగిపోయాయి కాబట్టి, ఆధునిక కాలంలో వీటిని మానుకోవాలి. మరి కావ్యకన్య అనేది ఎలా పొసగుతుంది? కావ్యం కన్యలాగా ఉండదు కదా? అని ప్రశ్నించవచ్చు ఎవరైనా. కానీ, ఇక్కడ కావ్యం భౌతికమైన వస్తువు కాదని గమనించాలి. కవిత, వ్యాసం, నవల, నాటకం, కావ్యం మొదలైనవి నైరూప్య నామవాచకాలు (abstract nouns). కాబట్టి, వాటిని ఆ విధంగా తప్ప వేరేవిధంగా పోల్చలేం. భౌతిక రూపం లేని కావ్యాన్ని ఏ భౌతిక వస్తువుతో పోల్చి సారూప్యాన్ని తేగలం? కాబట్టి, సారూప్యం లేకుండానే పోల్చక తప్పదు. కావ్యహారం, కావ్య మాల, కావ్యరసాలం, కావ్య మకరందం... ఇట్లా దేనితో పోల్చినా సారూప్యం ఎందుకు ఉండదంటే, వాటిలో ఒకటి సాధారణ నామవాచకం(common noun కాగా మరొకటి నైరూప్య నామవాచకం(abstract noun) కనుక. కాబట్టి, కావ్యకన్య సరైన పోలికే.
ఇక ఆధునిక కవిత్వంలో పోలికల విషయానికి వస్తే, ఈ అంశానికి ప్రాధాన్యమివ్వని సందర్భాలు ఎదురవుతాయి కొన్నిసార్లు. నేను ఊహించి, కల్పించి పేర్కొంటున్న ఈ ఉదాహర ణలను పరిశీలించండి: సముద్రపు సూది అని ఎవరైనా పోల్చారనుకుందాం. దీనిలోని సముద్రం, సూది... రెండూ భౌతికమైన వస్తువులే. కానీ, సముద్రం సూదిలాగా సన్నగా పొడుగ్గా ఉంటుందా? ఉండదు. దానికి బదులు సముద్రపు (భారీ) గంగాళం అని రాస్తే కొంత వరకు సారూప్యం సిద్ధిస్తుంది. సూర్యకిరణాల సూదులు అనే పోలిక కూడా బాగానే ఉంటుంది. అయితే, ఇందులోని సూర్యకిరణాలు భౌతికమైన వస్తువులు కావు. కానీ, కొన్నిసార్లు ఎండవేడిమి తగిలినప్పుడు సూదులతో చిన్నగా గుచ్చినట్టు అనిపిస్తుంది. పైగా రెండు కొండల మధ్య సూర్యుడి బొమ్మను గీసినప్పుడు ఆ బొమ్మలోని కిరణాలు సూదుల్లాగానే ఉంటాయి.
మబ్బుల దారాలు అని మరొకచోట వచ్చిందనుకుందాం. మబ్బులు ముద్దల్లాగా ఉంటాయి కానీ దారాలలాగా సన్నగా పొడుగ్గా ఉండవు కదా! మబ్బు దొంతరలు, మబ్బుల దిండ్లు, మబ్బుల సబ్బు నురగలు అని రాస్తే రూపపరమైన సాదశ్యం సిద్ధిస్తుంది. చినుకుల దారాలు అన్నప్పుడు పోలిక బాగా కుదురుతుంది. ఎందుకంటే, వర్షం కురుస్తు న్నప్పుడు చినుకులు పైనుండి కిందికి ఒక ధారలాగా ఏర్పడతాయి. ఇట్లా పోలికలలో భౌతిక సారూప్యం ఉండాలనటానికి మరొక కారణం కూడా ఉంది. అదేమిటంటే, వాటిని చదివినప్పుడు పాఠకుని మనసులో అవి స్పష్టంగా బొమ్మ కడతాయి. గాలి, ప్రేమ, సుఖం, దుఃఖం, సంతోషం మొదలైన నైరూప్య నామవాచకాలను (abstract nouns) ను కూడా భౌతికమైన వస్తువులతో, లేదా భౌతికమైన వస్తువులను అటువంటి నైరూప్య నామవాచకాలతో సారూప్యం ((physical resemblance) వచ్చేలా పోల్చలేం. రెండూ భౌతికమైన వస్తువులు అయినప్పుడే అది సాధ్యం.
- ఎలనాగ, 9866945424