Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కించిన రచనల్లో ఉన్నవ లక్ష్మీనారాయణ 'మాలపల్లి' ది ఎన్నదగిన స్థానం. ఉన్నవ లక్ష్మీనారాయణ దాదాపు మూడున్నర దశా బ్దాల పాటు స్వాతంత్య్రోద్యమం లో క్రియాశీలకంగా పాల్గొన్న సేనాని. పుల్లరి వ్యతిరేక పోరాటానికి నాయకత్వవ వహించిన ఉద్దండుడు. ఈ పోరాటం కారణంగానే జైలు పాలయ్యారు. దృరదృష్టవ శాత్తూ అటు తెలుగునాట స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనూ, ఆధునిక అభ్యుదయ సాహితీ వ్యాసంగంలోనూ ఉన్నవకు గానీ, మాలపల్లి నవలకు గానీ దక్కాల్సిన స్థానం దక్కలేదు అని చెప్పటం సందర్భరహితం కాబోదు.
స్వాతంత్య్రోద్యమ కాలంలో తెలుగు పద్య సాహిత్యం, వచన సాహిత్యం కొత్త పుంతలు తొక్కింది. సమాజంలో వీస్తున్న కొత్తగాలులు తెలుగుసాహిత్యానికి ఉఛ్చ్వాస నిశ్వాసలుగా మారాయి. దాదాపు మూడు నాలుగు శతాబ్దాల పాటు సామాజిక జీవితానికి దూరమైన తెలుగు సాహిత్యానికి మట్టి వాసన చూపించిన మహాకవి గురజాడ. గుజరాడ సాహితీ రంగంలో ప్రారంభించిన కృషిని కందుకూరి వీరేశలింగం దైనందిన జీవితంలోని సాంస్కృతిక భాగానికి అంటే ఆచార వ్యవహారాలకు విస్తరింపచేశారు. ఉన్నవ లక్ష్మీనారాయణ 'మాలపల్లి' నవలతో ఈ కోణాన్ని రాజకీయ ఆర్థిక రంగానికి కూడా వర్తింపచేశారని చెప్పవచ్చు. తెలుగు సమాజంలో కొత్తదారులు వేసిన వీరిని కృషిని వందండ్ల తర్వాత అనేక అస్తిత్వ చట్రాల నడుమ బంధించి ఆయా నిర్దిష్ట కాలంలో వీరి కృషి సాధించిన విజయాలను కుదించే ప్రయత్నం చేసే ప్రయత్నాలకు దక్కిన ప్రాధాన్యత వారి కృషిని ఆయా చారిత్రక పరిణామాల నేపథ్యంలో నిష్పక్ష పాతంగా మదింపు వేయటానికి దక్కలేదనే చెప్పాలి.
తొలినాళ్లల్లో మాలపల్లి నవల తెలుగునాట కలిగించిన సంచలనం, రాజకీయ భావోద్వేగాలు మరే రచనా కలిగించ లేకపోయింది. బహుశా ఒక గ్రామాన్ని కేంద్రంగా తీసుకుని సాగించిన ఈ రచన కేవలం గ్రామవర్ణనకు పరిమితం కాలేదు. గ్రామ జీవితాన్ని నియంత్రించే సామాజిక రాజకీయ ఆర్థిక చలనాన్ని కథావస్తువుగా చేసుకున్న నవల ఇది. మాలపల్లి కథా వస్తువు గురించి ప్రత్యేకంగా వరించాల్సిన అవసరం లేదు. అయినా ఈ తరం పాఠకుల అవగాహన కోసం సంక్షిప్తంగా చెప్పాలి.
గుంటూరు జిల్లా ప్రాంతంలోని 1920 దశకానికి ఓ గ్రామ రాజకీయ ఆర్థిక సాంస్కృతిక జీవన చిత్రణే మాలపల్లి. గ్రామంలో అప్పటి వరకూ నగదు రూపంలో చెల్లించే కూలి రేట్ల విషయంలో భూస్వామికి, కూలీలకు మధ్య తలెత్తిన ఘర్షణ చుట్టూ కథ నడుస్తుంది. రెండు భాగాలుగా వచ్చిన నవల ఇది. ప్రధానంగా గ్రామాన్ని, గ్రామంలోని మనుషు లను, కథానాయకుని కుటుంబాన్ని, కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాన్ని, గ్రామానికీ, కుటుంబానికి మధ్య ఉన్న సంబంధాలనూ వర్ణిస్తూ పాఠకుడిని గ్రామ జీవితంలోని ఆర్థిక సంబంధాల్లోకి తీసుకెళ్తుంది. ఆర్థిక విషయాలు చర్చకు వచ్చినప్పుడు వ్యక్తుల స్వభావాలు మారే తీరును వర్ణిస్తుంది. అంతిమంగా ఈ ఆర్థిక సంబంధంలో పుట్టుకొచ్చిన సమస్య ఘర్షణ రూపం తీసుకున్నప్పుడు ఆధిపత్య వర్గం, కులం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఆ నిర్ణయాలు ఎలా అమలు చేయించుకుంటుందో చాకచక్యంగా వివరించారు రచయిత. బహుశా సామాజిక ఆర్థిక కథనం కోణంలో ఇంత స్పష్ట మైన విభజన, పాఠకుడికి ఆసక్తి కల్పించే ప్రయత్నంలో కథలో సృష్టించే అనేక మలుపుల్లో చిక్కుకుపోయి రచన మౌలిక ఉద్దేశ్యానికి చేరుకోకుండా మిగిలి పోయే రచనలు ఎన్నో మనకు కనిపిస్తాయి. కానీ ఉన్నవ లక్ష్మీ నారాయణ ఈ చిక్కుముడులు అధిగమించి తాను చర్చించద ల్చుకున్న వర్గకోణాన్ని, నిర్మించ దల్చుకున్న భావి సమాజాన్ని స్పష్టంగా పాఠకుల ముందుంచుతాడు.
పుల్లరి సత్యాగ్రహానికి నాయకత్వం వహించినందుకు గాను రాయవేలూరు జైల్లో శిక్ష అనుభవించే కాలాన్ని నవలా రచనకు ఉపయోగించుకున్నారు రచయిత. జైల్లో జరిగిన ఓ పోరాటంతో దిగివచ్చిన జైలు అధి కారులు రాజీఫార్ములా కింద లక్ష్మీ నారాయణ రాసుకోవటానికి కావల్సిన సామాగ్రిని సమకూర్చటానికి సిద్ధమ వుతారు. ఆ విధంగా సమకూర్చుకున్న సాధనాలతో తాను ఆశువుగా చెప్తూ వెళ్తే తోటి ఖైదీల్లో ఒకరు దాన్ని అక్షరబద్ధం చేస్తే మరొకరు అక్షర దోషాలు, సందర్భ దోషాలు సవరించి జైలు అధికారి ఆమోదంతో బయటి కొస్తుంది. ఈ నవల మూలప్రతిలో ఉన్న విషయాలు జైలు అధికారుల ఆమోదానికి సమర్పించిన ప్రతిలో లేకుండా జాగ్రత్తపడటం ద్వారా రచన నేడున్న రూపంలో ప్రపంచానికి చేరింది.
జైలుకి వెళ్లటానికి ముందే స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న లక్ష్మీనారాయణ కొంతకాలం రాజమండ్రిలో ఉపాధ్యాయుడిగా పనిచేసే సమయంలో కందుకూరి వీరేశ లింగంకి సహచరుడుగా వ్యవహరిస్తాడు. ఆ క్రమంలోనే విద్య, స్త్రీ విద్య ప్రాధాన్యతను, వితంతు వివాహాల అవస రాన్ని, బాల్యవివాహాల రద్దు ఆవశ్యకతనూ గుర్తించాడు. రాజ మండ్రి నుండి తిరిగి గుంటూరు వచ్చాక స్వాతంత్య్రో ద్యమంలో పాల్గొంటూనే కొంతకాలం మున్సిఫ్ కోర్టులో పని చేశారు. ఈ సమయంలో బిపిన్ చంద్రపాల్ కోస్తా జిల్లాల పర్యటనలో ఆయన ఉపన్యాసాలను అనువదించారు. ఈ నడుమ కాశీనాధుని నాగేశ్వరరావుతో ఏర్పడిన పరిచయం ఉన్నవను మరింత క్రియాశీలకంగా మారుస్తుంది. ఇంగ్లాండ్ వెళ్లి బారిష్టరు చదువు పూర్తిచేయాలన్న లక్ష్యంతో సాగర యానం చేస్తాడు. ఇంగ్లాండ్ నుండి ఐర్లాండ్ వెళ్లి అక్కడ డబ్లిన్లో బారిష్టరు చదువు పూర్తి చేసుకుంటారు. తర్వాత షుమారు డజను మందిని పట్టుబట్టి డబ్లిన్ బారిష్టరు చదువుకు వెళ్లమని ప్రోత్సహిస్తాడు. అలా వెళ్లిన వారిలో నడింపల్లి నర్సింహారావు ఒకరు.
ఉన్నవ ఐర్లాండ్ చేరేనాటికి ఐర్లాండ్ స్వాతంత్య్ర పోరాటం ఉత్తుంగ తరంగమై బ్రిటిష్ వలస పాలకులను ముప్పుతిప్పలు పెడుతున్న తీరును అత్యంత సమీపంలో ఉండి పరిశీలిస్తాడు. ఈస్టర్ తిరుగుబాటు ప్రభావం ఉన్నవపై బలమైన ముద్ర వేసింది. ఐర్లాండ్ స్వాతంత్య్ర పోరాట యోధులకు ఫ్రాన్స్ కేంద్రంగా ఉన్న యూరోపియన్ సోషలి స్టుల మద్దతు ఉంది. వీరి ద్వారానే కమ్యూనిస్టు ప్రణాళిక అధ్యయన బృందంతో ఉన్నవ సంబంధాలు ఏర్పర్చుకుం టాడు. ఆయన కమ్యూనిస్టు ప్రణాళిక చదివినట్లు ఎక్కడా అధికారిక వ్యాఖ్యానం లేదు కానీ మాలపల్లిలో తక్కెళ్ల జగ్గడు పాత్రతో నడిపించిన సంభాషణ ద్వారా మనం ఈ విష యాన్ని రూఢపీర్చుకోవచ్చు. మూడేళ్ల పాటు డబ్లిన్లో చదువు కున్న తర్వాత 1916లో తిరిగి స్వస్థలానికి చేరుకుంటాడు.
అప్పుడప్పుడే స్వాతంత్రోద్యమంలో ప్రవేశించిన గాంధీ తనదైన ఉద్యమ శైలి, వ్యక్తిత్వం ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి తిరుగులేని నాయకుడుగా ఎదుగుతాడు. గాంధీ ఇచ్చిన శాలనోల్లంఘనం, సహాయ నిరాకరణ ఉద్యమాలకు గుంటూరు ప్రాంతంలో ప్రత్యక్ష నాయకత్వం వహిస్తాడు. అప్పట్లో ఉన్నవ నిర్వహించిన ఓ సభకు వేలాది మంది తరలి వచ్చారంటే ఉద్యమకారునిగా ఉన్నవకున్న ప్రజాదరణ స్పష్టమవుతుంది. ఐర్లాండ్ విద్యాభ్యాసంతో అంది వచ్చిన విశాల ప్రాపంచిక దృక్ఫథంతో చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించటం మొదలు పెట్టాడు. అటువంటి పరిశీలన నుండి పుట్టుకొచ్చినవే మాలపల్లి నవల్లోని పాత్రలు, సంభాషణలు, కథా వస్తువు. తెలుగునాట కమ్యూనిస్టు ప్రణాళిక అచ్చు కూడా వేయని కాలంలోనే ఉన్నవ 'మాలపల్లి' నవలలో తక్కెళ్ల జగ్గడు పాత్రను సృష్టించి కమ్యూనిస్టు ప్రణాళికలో మౌలిక అంశాలను చర్చకు పెడతాడు. సమసమాజ స్థాపకు సంపదపై సమాన హక్కు ఉండాలన్న వాదనను వినిపిస్తాడు. రామనాయుడు, సంగదాసు, వెంకటదాసు వంటి పాత్రలను సమాజంలోని వివిధ వర్గాలకు ప్రతినిధులుగా మలుస్తాడు.
ఇన్ని ప్రత్యేతలు ఉన్నందునే ఈ నవల తొలి ప్రతి విడుదలైన కొన్ని రోజులకే నిషేధానికి గురయింది. తర్వాతి కాలంలో అప్పటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోధ నాంశంగా ఎంపిక చేయబడిన ఈ నవల స్వాతంత్య్ర సాధన సంధ్యలో మరో సారి నిషేధానికి గురయింది. అంతిమంగా స్వాతంత్య్ర సాధనతో పాటే నిషేధాల నుండి 'మాలపల్లి' కూడా స్వాతంత్య్రం పొందింది. తర్వాతి కాలంలో ముద్రణకు నోచుకుని 'మాలపల్లి'ని తిరిగి పాఠకులకు పరిచయం చేసిన ఘనత జయంతి పబ్లికేషన్స్ పెరుమాళ్లుకు దక్కుతుంది.
రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ స్వాతంత్య్రోద్యమం లోనే కాక సాహిత్యోద్యమంలోనూ గుంటూరు జిల్లాలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్ర మహాసభకు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ సమయం లోనే సంఘం మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రదేశాన్ని వేరు చేయాలని తీర్మాని స్తుంది. ఈ కాలంలోనే ఉనికిలోని వచ్చిన సాహితీ పరిషత్ సంపాదక మండలి సభ్యునిగా కూడా ఉన్నవ కొంత కాలం వ్యవహరించారు.
ఈ విధంగా స్వాతంత్య్రోద్యమ సేనానిగా, సాహిత్యకారుడిగా, తెలుగునాట కమ్యూనిస్టు భావజాలానికి గురైన తొలి ఉద్యమకారుడిగా, సాహిత్యోద్యమ భాగస్వామిగా, శారదానికేతన్ వ్యవస్థాపకుడిగా, కందుకూరి అనుచరుడిగా పలు పాత్రలను పోషించి వాటికి తనదైన విలక్షణ సామర్ధ్యాలను, లక్ష్యాలను అద్దిన ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన మాలపల్లి నవల వందేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా తెలుగునాట అభ్యుదయ సాహిత్యం, సంఘసంస్కరణ ఉద్యమాలు, కమ్యూనిస్టు విలువల వ్యాప్తి వంటి అనేక అంశాల గురించి లోతైన పరిశీలన, పరిశోధన, అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది.
('మాపల్లి' నవల శతజయంతి సందర్భంగా మంచిపుస్తకం సంస్థ 'మాలపల్లి శతావలోకనం' వెబినార్ నిర్వహిస్తున్న సందర్భంగా నవతెలంగాణ ఈ ప్రత్యేక వ్యాసాన్ని పాఠకులకు అందిస్తోంది)
- కొండూరి వీరయ్య, 9871794037