Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ చిన్నిపాపల
నవ్వును తుంచేయకండి
ఒక్కో మొగ్గ విలువ
కొన్ని కోట్ల పూలలాంటివి
మనుషుల తలలను తీసి
శూన్యాకాశంలో
వేలాడగట్టకండి
ఒక్కో ఆర్తనాదం విలువ
కొన్ని కోట్ల ఉరితాళ్ళలాంటివి
కన్నీరు కూడా తిరుగబడుతుందన్న
చరిత్ర తెలుసు కదా
దుఃఖాన్ని దుఃఖంతోనే తీయొచ్చన్న
కొత్త నిర్వచనం కూడా తెలుసుకోండి
వాళ్ళ దేహాలు
ఒక్కో విల్లుగా మారి
మీ అరాచకత్వాల మెడలను
వంచేస్తాయి
వాళ్ళ
ప్రశాంతమైన కనురెప్పలు
మరఫిరంగులై
మీ మీదకు
ఎక్కుపెట్టబడతాయి
ఆక్రమించుకోండి
నేలను, నింగిని
ఆధీనంలోకి తీసుకోండి
నిప్పును, గాలిని, నీరును
మీరెం చేయగలరు
అదొక్కటి తప్ప!
స్వేచ్ఛను
హరించి వేస్తున్నామన్న కలలను
కలలుగానే కంటూ ఉండండి
ఎండిన పెదాలపై పుట్టే
నవ్వును గురించి మాత్రం
మర్చిపోకండి
కొన్ని వేలకోట్ల అగ్ని పర్వతాలు
పుట్టేది అక్కన్నుండే!
- తండ హరీష్ గౌడ్
8978439551