Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరాలు మారినా అంతరాలు చెరగని సమకాలీన సామాజిక వ్యవస్థకు దర్పణం పట్టే కథా సంపుటి ''రాయక్క మాన్యమ్ (దళిత మహిళల కతలు)''. ఆధునిక సమాజంలో దళిత మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను ఎత్తిచూపుతూ, జూపాక సుభద్ర వెలువరించిన కథా సంపుటిది. తెలంగాణ దళిత బిడ్డల స్వరాన్ని బలంగా వినిపిస్తున్న రచయిత్రిగా కవయిత్రిగా, వ్యాసకర్తగా జూపాక సుభద్ర సుప రిచితురాలు. అడుగడుగునా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ బతుకు పయనం సాగించే దళిత మగువల అంతరంగ చిత్రాన్ని ఆవిష్కరిస్తూ రాసిన కథాసంపుటిని 2014లో తొలి ముద్రణగా, 2017లో మలి ముద్రణగా వెలువరించారు. 'దళిత మహిళల కతలు' అని పేర్కొన్న రచయిత్రి ఆ కతల వెనుకున్న వేదన ను, ఈ కథల ద్వారా అక్షరబద్ధం చేశారు. హైటెక్ యుగంలో సైతం ఆరని కులం కుంపటి రగిల్చే మనోవే దనకు సాక్షంగా నిలిచే కథలివి. విద్యార్థినిగా, ఉద్యోగినిగా, అధికారిణిగా, పాలకురాలిగా ఏ స్థాయిలో ఉన్న మహిళైనా దుర్భరమైన వివక్షకు గురౌతున్న వైనాన్ని ఈ కథలు వెల్లడిస్తాయి. అంతేకాకుండా మ రోవైపు మహిళల ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యసాహసాలను, పోరాట పటిమను తెలిపే కథలకు కూడా వేదిక ఈ కథాసంపుటి. ఎన్ని సమస్యలు ఎన్ని ముళ్ళ బాటల్ని పరిచినా అవన్నీ దాటుకొని ముందుకుసాగే 'మహిళ' సామర్థ్యానికి కొలమానంగా నిలిచే కథలివి. తెలంగాణ యాస, భాషలో అతిసహజమైన కథాకథనంతో రాయబడిన ఈ కథలు యథార్థ సంఘటనలకు నిదర్శనంగా నిలుస్తాయి.
17 కథలున్న ఈ సంపుటిలో ప్రతి కథా దేనికదే ప్రత్యేకం. సాధారణంగా దళిత స్త్రీ నిత్య శ్రామికురాలు. ఆమె జీవనయానం ముళ్ళబాట కాకున్నా పూలబాట మాత్రం కాదు. ఇంటా, బయటా ఎన్నో సవాళ్లనెదుర్కొంటూ ముందుకు సాగుతుంది. కులపరంగా, జెండర్ పరంగా తీవ్రమైన వివక్ష నెదుర్కొంటుం ది.ఇవి రెండూ వీడని నీడలా ఆమె చుట్టూనే తిరుగుతుంటాయి. ఈ పరిస్థితుల్లో ఆమెలో రగిలే వేదన, సంఘర్షణ, ఆవేశం, ఆలోచనకు ఈ కథలు అద్దం పడతాయి. ఈ కథలలో ప్రధాన వస్తువు దళిత స్త్రీ జీవన.
అన్నిచోట్లా కులం ప్రతిబంధకంగా మారిన తీరును ''శుద్ధి చెయ్యాలె'' కథ ద్వారా ఎత్తిచూ పుతుంది రచయిత్రి. అస్పశ్యతను కథా వస్తువుగా గ్రహించి నేటికీ సమసిపోని అంటరానితనాన్ని చిత్రించారు. ఈ కథలో భావితరాలను తీర్చిదిద్దే అధ్యాపకురాలిగా ఉన్నతోద్యోగం సంపాదించిన కథానాయికకు, కళాశాల నెలకొన్న పల్లెలో, అద్దెకు ఇల్లు దొరకడం గగనమవుతుంది. ఎలోగోలా నాలుగు రోజుల తీవ్ర ప్రయత్నం ఫలించి ఒకింట్లో అద్దెకు దిగినా, కులం కారణంగా కొంత కాలానికే ఆ ఇల్లును ఖాళీ చెయ్యాల్సి రావడం ఒక విషాదమయితే, ఇల్లుగల వాళ్ళు ఇంటిని శుద్ధి చేసుకోవడం మరింత దుర్భరం. ''తాతల తరాలున్నట్లు మేము లేము. ఎన్నో ఉద్యమాలు చేసి చదువుకొని యీ స్థితికొచ్చినంక గూడ మా నుదుటిమీద అంటరాని గీతలు చెరిగిపోవడం లేదు. వాళ్ళు చేసినవమానం తిరిగి చెవుల్లో సీసం నింపుతున్నట్లు, నాలిక చీరుతున్నట్లు, వేళ్ళు నరుకుతున్న ట్టుగానే వుంది. ఎప్పుడో ఎన్నో పోరాటాలు చేసి మేం పగులగొట్టిన ముంతలు మళ్లీ మా మూతులకు కడుతు న్నట్లుగా, జారిపోయిన తాటాకులు మళ్లీ మా మొలలకు ముడేస్తున్నట్లే అన్పించింది.'' (పుట : 56). అంటూ తీవ్రమైన నిరసనస్వరాన్ని వినిపించింది రచయిత్రి. దళిత వర్గాలు నేటికీ అంటరానితనానికి గురవుతున్నాయన్న నగసత్యాన్ని ఈ కథలో చూపుతుంది రచయిత్రి.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 17 అస్పశ్యతను నిషేధించింది. అంటరాని తనం చట్టరీత్యా నేరం. అంటరాని తనాన్ని అవలంబించిన వాళ్ళు శిక్షార్హులు. ఇటు వంటి మాటలు నీటి మీది రాతలుగానే మిగిలిపోతున్నాయి.
చాప కింద నీరులాగా వర్ణవ్యవస్థ నేటికీ ఏదో ఒక రూపంలో కొనసాగు తూనే ఉంది. మనసు అట్టడుగు పొరల్లో దాని వాసనలు ఇంకా బతికే ఉన్నాయని, ఆయా సందర్భాల్లో అది బయట పడుతుందని నిరూపించిన కథ ''బల్లెనే దోస్తు వూల్లెగాదు''. మధురమైన స్నేహబంధానికి సైతం కులం గోడలు అడ్డురావడాన్ని చిత్రించిన కథ ఇది. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరమ్మాయిల నిష్కల్మశ స్నేహం బడి వరకేనని, గ్రామంలో ఆ స్నేహానికి నడుమ కులం లక్ష్మణ రేఖ గీస్తుందని ఇందులో బట్టబయలు చేసింది కథాయిత్రి. జెండా వందనం రోజు వేసుకోవడానికి తన కొత్త డ్రస్సును తన దళిత స్నేహితురాలికిచ్చిన సువర్ణను ఆమె తల్లి దండించడమే కాకుండా, ఆ డ్రస్సును అగ్నికి ఆహుతి చేసిన వైనం తీవ్రమైన దళితవివక్షకు పరాకాష్ట.
రాజకీయాలలో మహిళల పాత్రను చిత్రించిన కథ ''షానిలబడాలె''. మండల ప్రెసిడెంటుగా ఎన్నికైన సాంబలక్షి మానసిక సంఘర్షణను వ్యక్తం చేసిన కథ ఇది. తొలిసారిగా ఎన్నికలలో నిలబడి ఎంపీపీగా గెలిచిన సాంబలక్షి చార్జి తీసుకోవడానికి మండలాఫీసుకు వెళ్లిన సందర్భంలో ఆమె మానసిక స్థితికి అద్దం పడుతుంది ఈ కథ. కాయకష్టం చేసుకొని బతికే సాంబలక్షి తనకు అపరిచయమైన మండలాఫీసులో ఎలా మసలుకోవాలో తెలియక ఆమెలో చెలరేగిన మానసిక క్షోభ వర్ణనాతీతం. తెలంగాణ పార్టీ తరపున గ్రామసర్పంచ్‌గా ఎన్నికయిన దళిత మహిళ దేవక్క అంతరాలు సమసని సమాజంలో వివక్షకు గురవుతున్న విషయాన్ని ''గద్దెత్కపోయిన బత్కమ్మ'' కథలో చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మను ఊరు, వాడ భేదం లేకుండా నిర్వహించుకోవాలన్న దేవక్క కోరిక నెరవేరని వైనాన్ని ఈ కథ వెల్లడిస్తుంది. బతుకమ్మ ఆడటం దళితులకు నిఘం అన్న కారణాన్ని చూపుతూ దళితులను, గ్రామ సర్పంచ్ అయిన దేవక్కను అగౌరవపరచడం అమానవీయ పరిస్థితులకు నిదర్శనం. దేవక్క ఎంత వప్రయత్నించినా ఊరివాళ్ళతో కలిసి బతుకమ్మ ఆడటాన్ని సాధించలేకపోయింది. ఊరిజనం గ్రామ కట్టుబాట్ల పేర దళితులను అవమానిం చడాన్ని ఈ కథ ఎత్తిచూపుతుంది.
సమకాలీన సామాజికవ్యవస్థలో బలవంతులకు, బలహీనులకు మధ్య స్పష్టమైన తేడాలు చూపడాన్ని వివరించే కథ ''పాయిదేర్లతనం''. ఈ కథ సమాజం లోని బలహీనుడి స్థానాన్ని ఎత్తి చూపు తుంది. పోలీసాఫీర్ను హతమార్చేందుకు నక్సలైట్లు పోలీసు జీపుపై జరిపిన బాంబుదాడిలో పోలీసుతో పాటూ జీపు డ్రైవరు కూడా దుర్మరణం చెందుతాడు. పోలీసు భార్యకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన న్యాయం తక్షణమే జరుగగా, జీపు డ్రైవరు భార్య మాత్రం తనకు జరగాల్సిన న్యాయం కోసం పోరాటం చెయ్యాల్సి రావడం ఎంత వరకు సమంజసమన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇటువంటి సందర్భాలలో ప్రభత్వాలు సాయం ప్రకటించినంత వేగంగా ఆచరణలో అమలుకాకపోవడంలేదన్న చేదు నిజం తేటతెల్లమవుతుంది.
దళిత మహిళ చైతన్యానికి నిదర్శనంగా నిలిచే కథలు ''రాయక్కమాన్యం'', ''నల్లజెండా''. ఈ రెండు కథల నేపథ్యాలు వేరైనా స్త్రీ నాయకత్వ పటిమను సమర్థవంతంగా విశద పరిచాయి. యుగాల నాటి అణచివేతకు చరమగీతం పాడేందుకు సమాయత్తం కావల్సిన అనివార్యతను సూచించే కథ ''నల్ల జెండా'' ఒకనాడు బడుగు, బలహీన వర్గాల తరపున గొంతు విప్పిన 'అన్నలపార్టీ'లో క్రమంగా దొరలు పెత్తందార్లు చేరడం, తిరిగి చర్వితచరణంగా బలహీనవర్గాల వారిని తొక్కిపెట్టడం, ఏ పార్టీకి చెందని దళిత వ్యక్తి పోషన్న గ్రామ ప్రజలను చైతన్యం చేస్తున్నాడని, అతన్ని తప్పించ డానికి పోలీసు ఇన్ఫార్మర్గా ముద్రవేసి అన్నల ముసుగులో ఉన్న గ్రామ పెత్తందార్లు పోషన్నను చంపించడం పెను విషాదం. ఈ విశాదాంశాన్ని ప్రతిఘటించేందుకు జడ్పీటీసీగా ఎన్నికైన దళిత నాయకురాలు శాంతక్క పూనుకొని దళితులపై జరుగుతున్న దాడులను ఎదిరించడం ఆమె చైతన్యాన్ని తెలుపుతుంది. 'రాయక్కమాన్యం' కథలో రాయక్క మరొక చైతన్య గీతంగా కనిపిస్తుంది. మాదిగల ఆశ్రితకులమైన డక్కలి కులానికి చెందిన రాయక్క తనకు దక్కాల్సిన మాన్యం కోసం న్యాయబద్ధంగా పోరాడుతుంది. ఇది దళిత మహిళల తెగువను పోరాటతత్వాన్ని, చైతన్యాన్ని రుజువుపరుస్తుంది.
దళితుల ఆహారపుటలవాట్లను విమర్శించే వారికి సమాధానం చెప్పే కథ ''మీరెట్ల వెజ్జులు''. లోకో భిన్న రుచి అన్నట్లు, ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చు. ఎవరి ఇష్టాఇష్టాలు వారివి. ఎవరి అభిప్రాయాలు వారివి. ఒకరిని ఒకరు కించపరుచుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ సమాజంలో అన్ని విషయాలలో వలే దళితుల ఆహారపుటల వాట్లలో సైతం తీవ్రమైన వాదవివాదాలు చోటుచేసుకుం టున్నాయి. దళితులు మాంసాహారాన్ని తినడాన్ని వ్యతిరేకించే వర్గాల వారికి రచయిత్రి ''జంతు శరీరం నుండి తీసుకునేది ఏదైనా మాంసాహారమే. రక్తం మరో రూపమే పాలు. దాంట్ల నుండి పెరుగు, వెన్న, నెయ్యి వస్తయి గదా! పశువుల మాంసం నుంచొచ్చే పాలను, ఆ పాల నుంచొచ్చే కొవ్వును వెన్నగా లొట్టలేసుకుంటూ తినుకుంటూ మేము ప్యూర్ వెజ్జులమంటే ఎట్లబ్బా?... మాంసం తినేటోల్లు తక్కువె ట్లాయె? మాంసం నించి వచ్చిన కొవ్వును దినేటోల్లు ఎక్కువెట్టాయె? అని నిలదీస్తుంది. ముఖ్యంగా దళితులతో కలిసి భోజనం చేయడానికి కూడా సహించని వర్గాల వారి హేయమైన మనస్తత్వాన్ని ఈ కథ బహిరంగపరుస్తుంది.
పుట్టుకతోనే కంటిచూపులేని దివ్యాంగురాలు కథ- ''అమాస కన్నుల పున్నమి'' ప్రధాన పాత్ర సంతోష. చూపులేని కారణంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి అయిన వారందరి వరకు వివక్షకు గురైనా, బతుకు నిత్యపోరాటమైనా ఆత్మ విశ్వాసమే ఆలంబనగా బతికే సంతోష జీవితంలోని విషాద కోణాలను కళ్ళున్న సమాజానికి చూపిన కథ ఇది. కళ్లు లేని సంతోష భవిష్యత్తులో బతకడం కష్టమని ఆమెను చం పడానికి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించక సంతోష పెరిగి పెద్దదవుతుంది. అన్నలు, వదినలు, బంధువులు, ఇష్టపడి పెళ్ళి చేసుకున్న వ్యక్తి కూడా సంతోషను సంతోష పర్చలేదు. ఆమె చీకటి సామ్రాజ్యంలో వెలుగులు నింపే వ్యక్తులే కరువయ్యారు. అడుగడుగునా అనేక సమస్యలు, అయినవాళ్ళందరి నిరాదరణకు గురై జీవితమొక శిక్షగా భావిస్తుంది. అటువంటి పరిస్థితులలో వికలాంగుల సంఘ సభ్యుల ఆదరణతో ఆమె పునరుత్తేజం పొంది, ఆత్మ నిబ్బరంతో బతకగల ధైర్యాన్ని ప్రోదిచేసుకోవడమే ఈ కథ ఇతివత్తం. వికలాంగుల జీవితాల్లోని చీకటి కోణాలను ఈ కథ ద్వారా వెల్లడించారు జూపాక సుభద్ర.
తరతరాలుగా తీవ్ర అణచివేతకు గురై విద్యకు, విజ్ఞానానికి దూరం చేయబడ్డవారు దళిత సామాజిక వర్గీ యులు. నాలుగక్షరాలు నేర్చుకుందామన్న తపనతో బడిలో చేరే వారికి ప్రభుత్వం నిర్వహించే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లు ఒకింత ఊరట. అయితే అక్కడ కూడా అధికారుల నిర్లక్ష్యం నీడలో, అమానవీయ పరిస్థితులతో రాజీపడుతూ, చదువు కునే విద్యార్థినిల దైన్యాన్ని వెల్లడించే కథ ''షెవ్వా ...నెత్తురు''. సొంత గ్రామానికి దూరంగా నెలకొన్న పాఠశాలలో విద్యనభ్యసించడానికి వసతి కోసం ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థినిలకెదురయ్యే అమానవీయ స్థితిగతులను ఈ కథ ద్వారా తెలియపర్చారు జూపాక సుభద్ర. ''వెంటిలేషన్లు లేని చిన్న చిన్న పంది గుడిసెలసోంటి గదులు, సాలీసాలని టాయిలెట్లు, యిక రోజూ నీళ్ళ కోసం, బాత్రూం కోసం, అన్నం కోసం యుద్ధమే. కనీసం నాలుగన్నరకు లేస్తేనే స్నానం, టాయిలెట్స్, కార్యక్రమాలు. పొరపాటున కొంచెం లేటయ్యిందా.... యిక స్నానం కాదు కదా టాయిలెట్‌కి కూడా ఓ మగ్గు నీళ్ళ కోసం అవస్థలు పడాల్సిందే. (పుట:27) ఇదీ ప్రభుత్వ హాస్టళ్ల అధ్వాన్న పరిస్థితి. ఇవే కాకుండా నిత్యం అధికారుల అనుమానపు చూపులను, అవమానపు మాటలను, చులకన భావాలను, నిరంకుశ ధోరణులను సహిస్తూ ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థినులలో రగిలే సంఘర్షణను ఈ కథ ద్వారా విశదపర్చారు.
తెలంగాణ యాస, భాషల్ని అవహేళన చేయడాన్ని ఖండిస్తూ ''మా మాట గిట్లనే'' కథలోను, పరీక్ష రాయడానికి పెన్నులేక, ఆ పెన్ను సాయం కోసం పరీక్షలో మరొక విద్యార్థినికి తన జవాబు పత్రాన్ని చూపించడానికి రాజీ కుద్చుకున్న దళిత విద్యార్థిని పేదరికాన్ని ''రాజీపడ్డ రాత'' కథలోనూ, కార్పొరేటు ఆసుపత్రుల్లో జరిగే అమానవ దోపిడీని వెల్లడిస్తూ ''మొండి వైదికం'' కథ, ఆదర్శాల కోసం చేసుకునే కులాంతర వివాహాల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతూ ''ఆదర్శ విధ్వంసం'' కథ, దళితుల జీవితాల్లోని ఆటు పోటులను వెల్లడిస్తూ ''దేవిపోతల కారటు'', ''మా అయ్య'' కథలలో అత్యంత సహజంగా, యథార్థంగా చిత్రించారు జూపాక సుభద్ర. ఈ కథల్లోని పాత్రలు, సంఘటనలు నిత్య జీవితంలో మనకు ఎదురయ్యేవే కావడం గమనించదగినది. వాస్తవ సంఘటనలను కథలుగా మలచి దళితుల మోచేతి దెబ్బ వంటి జీవితాల్లోని విషాదాన్ని ప్రతిఫలింపజేయడంలో కతకత్యులయ్యారు.
- వి.వింధ్యవాసినీ దేవి
సహాయాచార్యులు, కె.వి.ఆర్. మహిళా కళాశాల (స్వ.ప్ర), కర్నూలు