Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండిత కోయిల గ్రాంధికంలో పాడింది
మధురంగానే ఉంది
అయితే పాట ఆయుష్షు కేవలం గండపెండేరమే
అది భాషా పంజరంలో బందీ కోయిల.
రెండో కోయిల అందరి భాషలో పాడింది
తేనియ ప్రవాహంలా ఉంది
దాని ప్రాణం బిరుదు సత్కారాలతో
సరిపోయింది
అది మీరజాలని భావజాల పంజరంలో
జ్ఞాన కోయిల.
మూడో కోయిల గొంతు సవరించింది
స్టేడియం దద్దరిల్లింది
దాని ఆయువు ఆహూతుల గుండె చప్పుళ్ళు
అయినా అది చప్పట్ల పంజరంలో జీవిత ఖైదీ.
నాలుగో కోయిల నిజమైన గాయని
హద్దుల్ని బద్దలుగొట్టడమే దాని పని
అది రెక్కలు విదిలించినా సంగీతమే
విశ్వ శ్రేయోగీతమే.
అది చిరాయువు..జీవన సౌందర్యంలా.
- డా. డి.వి.జి.శంకర రావు
94408 36931
మాజీ ఎంపీ, పార్వతీపురం.