Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వం అంటే
ఎడ్లు బండి మెడగంటల చిరురవం
ధ్యాన మందిరంలో లయమయే దేహ భావం!
అలసిన మనుషులకు నొప్పులు తీర్చే
గోరు వెచ్చని నీటి తెరపీ
హాయి వాక్యాలకు పదాల మర్దనా గీతం
శబ్దాడంబర ప్రకటిత వాగుడు కాయ కాదు
భావాలుప్పొంగే కండల కసరత్తు కావాలి
సంఘటనల్లోంచి జాలువారిన పాలపొంగై
నీలి మంటల నిప్పుల జండాలు ఎగరాలి
నాన్నచూపుడు వేలు పట్టుకొని
నడచిన నాటి రోజులు గుర్తుకు తెచ్చే
గూగుల్ మ్యాపై వెన్ను తట్టాలి
శబ్దతరంగాలు వైరాగ్యాన్ని విడిచి
పోట్ల గిత్తల రంకెల పునరుత్తేజిత
ధ్వానమై నినదించాలి
వడి వడిగా కొడవలి మనసుల్లోని
కలుపు తీయాలి
గొప్పలు పోవడం కాదు
అలిశెట్టి పెన్ను వయి
ఋజాగ్రస్త అంగాలు తెగనరికి
కొత్త శిరసు మొలిపించే
అక్షర సర్జన్ అవాలి
కవిత్వంలో దమ్ముంటే
ఊరి మీద గాలి గోపురమవుతది
అలుగు మీది చేప పిల్లయి ఎగురతది
కవిత్వం ఆప్ఘన్ శరణార్థి కాదు
కుంచించుకొని నిలబడదు
ఆత్మలో మంచే వేసుకొని
ఒడిసెల విసిరే కర్షక బలం కావాలి!
అక్షరాలు పెద్దమ్మ లెక్క ముచ్చట పెట్టాలె
భోగి పండుగనాటి పండిన
రేగుపండై వాసనగొట్టాలె
చదువుమని సాగిల పడకు
చప్పట్లకు దండలకు సలాం గొట్టకు
నీది దమ్మున్న చానల్ అయితే
వ్యూయర్స్ వీక్నెస్ల కోసం వెంపర్లాడవు
ప్రజారణ్యంలో చెట్టుకు చిక్కిన
గాలి పటమయి ఎప్పుడు తెగుతావో
నీకే తెలియదు
గుప్పు గుప్పుమనే పొగ గొట్టపు
ఆకలి సైరన్
చెమట వాసనల పరిమళాల
పుట్టిన ఉత్పత్తి !
మొలకల ఆశల దినుసు
మొహం మీది రాతను సైతం
మార్చగలిగిన గ్లోబల్ గీత
చితిమీద చతికిల పడ్డశవాన్ని సైతం
లేపి నిలబెట్టే అక్షర జ్వాలలై ప్రజ్వలించాలి
- కె.ఎస్.అనంతాచార్య, 9441195765