Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్ర మహాసభ ఆవిర్భావం వరకు తెలంగాణ ప్రాంతంలో నవలు వచ్చిన దాఖలాలులేవు. తొలిసారి వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ వాస్తవికతను నిర్దిష్టంగా ప్రతిబింబిస్తూ 'ప్రజల మనిషి' ని రాశారు. తెలంగాణ ఉద్యమం కాలంలో ఆయన తెలంగాణ నవలకు విశిష్టమైన స్థానాన్ని కల్పించారు. నిజాం పాలనలో దొరలు ప్రజలను అణచివేసిన తీరును, దోపిడీకి ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి వారు చేసిన కుట్రలను, అన్యాయాలను ఆయన 'ప్రజల మనిషి' నవలలో చిత్రిక కట్టారు. కంఠీరవం అనే ఒక సామాన్య వ్యక్తి ప్రజల మనిషిగా ఎదిగిన పరిణామక్రమాన్ని సహజత్వం ఉట్టిపడేలా రాశారు. 1940కి ముందు తెలంగాణ ప్రజా జీవితాన్ని 'ప్రజల మనిషి' నవలలో వట్టికోట ఆళ్వారుస్వామి చిత్రించారు. తన రెండో నవల 'గంగు' ఒక యువతి తెలంగాణ విమోచనోద్యమం ద్వారా చైతన్యం పొంది కమ్యూనిస్టు పార్టీ వైపు వెళ్లడాన్ని చిత్రిస్తుంది. ఈ నవల 1940 తరువాత తెలంగాణలోని ప్రజా జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.
యువకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి నర్రా ప్రవీణ్ రెడ్డి కలం నుంచి మలి దశ తెలంగాణ పోరాట నేపథ్యంలో 'పొత్తి' నవల వచ్చింది. ఈ నవలలో ప్రధాన ఉద్యమ కేంద్రమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఊరు చూట్టూనే ఈ కథనం తిరుగుతుంది. 2014కు రెండేండ్లు ముందు కాలామే ఈ నవల కథాకాలం. స్వచ్ఛమైన తెలంగాణ యాసలో సాగిన నవలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన పోరాటలను కండ్లముందు నిలిపింది. పల్లె జీవితాన్ని, కల్మషం లేని ప్రేమను ఈ నవలలో రచయిత కండ్ల ముందు ఉంచాడు. ఇందులో నాయికా నాయకులు గంగ, శంకర్. రెక్కాడి గానీ డోక్కాడని మట్టి మనుషులు యాదమ్మ, వీరయ్యల బిడ్డ గంగ. కాస్తో, కూస్తో కలిమి గల్ల కుటుంబమైన శారదమ్మ, మల్లారెడ్డిల కొడుకు శంకర్. గంగది నిండు బతుకమ్మ మొకం. సెలయేటి సప్పుడసోంటి మాటలు, ఇసమంత ఇసం లేని తనం. అన్నింటికీ మించి మంచి వ్యక్తిత్వం ఆమె సొంతం. వూరు లేచకముందే ఆకిలూకి, సాంపిపల్లి, ముత్యమంటి ముగ్గేసి, ఇంట్ల పనులన్నిజేసి సదువుకొనుబొయ్యే అచ్చమైన పిల్ల గంగ. ''ఈ వాక్యాలలో గంగ స్వచ్ఛమైన హదయం తెలుస్తుంది. శంకర్ పట్నంలనే పెద్దసదువు సదువుకుంటవున్నడు. తాతీలుకు ఊళ్లకొచ్చి పోతడు. సమాజంపై పొత్తి నవలలో స్వచ్ఛత అవగాహన ఉన్నోడు. ఇగురం తెల్సినోడు. 1969 తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన శంకర్ పేరునే ఈ నవలలో కథానాయకుని పేరు పెట్టడం విశేషం.
గంగ డిగ్రీ అయిపోయి ఉస్మానియా యూనివర్శిటీలో ఎంట్రన్స్ రాసి సీటు తెచ్చుకొని, హాస్టల్లో చేరింది. ''కన్న ఊరిని, ఆ ఊరి సంస్కతినీ మర్చిపోతే మనం మనుషుల మెట్లయితం? పూరి మట్టి పొత్తిళ్లపై మొలిచిన జీవితాలు మనవి. ఈ దేహపు గూడంతా. మన ఊరి ఆత్మను నింపుకున్నదే. పల్లె నుండి పట్నం. దాకా ఎదిగినమంటే మన సంస్కతిని మరవడం కాదు. మన సంస్కతిని నలుదిశలా చాటడమే. పూరుమనకిచ్చింది పిడికెడంత సంస్కతి. గుప్పెడంత ఆత్మవిశ్వాసం. అటువంటి ఊరు మూలాలను మర్చిపోతే నిల్చున్న ఈ దేహానికి ఆత్మలేనట్లే'' అన్నగంగ మాటలు అందర్నీ ఆలోచింప జేస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్నని ఉస్మానియా యూనివర్శిటీల ఉద్యమం నడుస్తున్నది. ''పల్లెలు కంటున్న కలలు వేలకండ్లుగా వొంటి నిండా పూయించుకున్నది. కోట్ల చేతులు నిలువునా వందనం చేస్తున్నట్టుగా కన్పించే ఓ స్థూపం'' అంటూ ప్రవీణ్ రెడ్డి ఉస్మానియా క్యాంపస్‌లో ఉన్న అమరుల స్థూపాన్ని అద్భుతంగా వర్ణించడంలో ఆ స్థూపం విలువ తెలుస్తుంది.
శ్రీకాంతాచారి తదితరుల ఆత్మార్పణలు ఘట్టాలను, ఉద్యమ ఉధతిని, ఉయ్యాల పాటలు ఊపు. ''ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా'' (అభినయ శ్రీనివాస్-పాట), గూడ అంజన్న పాటలు ప్రతిధ్వనులను ఆర్ట్స్ కాలేజీ గోడలు రికార్డు చేసుకుంటున్నరు. ''రాతిగోడలు త్యాగాల గుర్తులను నిశ్శబ్దంగా వొంటిపై చెక్కుకుంటున్నయి'' అన్నప్పుడు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థుల ఉద్యమం తీవ్రత తెలుస్తుంది. ఉద్యమం గెలుస్తుందని, మన ప్రేమ ఫలిస్తుందని,
మన పెండ్లి జరుగుతుందని గంగకు భరోసా ఇస్తాడు. శంకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గంగ, శంకరు తాము ప్రేమించుకుంటున్నామని ఇంట్లో చెప్పినప్పుడు వాళ్లు ఒప్పుకోరు. శంకర్ తండ్రి మల్లారెడ్డి ప్రమాదానికి గురై ఆస్పత్రిలో ఉన్నప్పుడు రక్తం అవసరమైతే గంగ తండ్రి వీరయ్య రక్తం ఎక్కిస్తారు. మల్లారెడ్డి కోలుకున్నంక శంకర్ ''సూశ్నవా నాయనా... గాల్లెవరో మనమెవలమో అంటివి ఇయ్యాల మనల కాపాడింది ఎవరు? నీ ఒంట్లో ఇప్పుడు పారుతున్న రక్తం వీరయ్యది నా అంతరాల కంచెలు తొలగిన నాడే మనుషుల్లా బతకగలుగుతం సమ సమాజాన్ని నిర్మించగలం - అన్న శంకర్ మాటలు వాళ్ల వైఖరిలో మార్పు తీసుకుస్తోంది. ''నచ్చినంకనువ్వోకాడికి.. నేనోకాడికి బోతమా? అందరం కాటికే పొయ్యేది. కులం, మతం అంటూ మనుషులు విడిపోతున్నరు. ఇవన్నీ పోయిన నాడే మనం బాగుపడతం. మనుషుల్లా సమాజంలో నిలబడతం'' అంటాడు శంకర్. సమాజంలో నెలకొన్న కుల, మత కట్టుబాటులు తొలగాలని అప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్న సామాజిక సందేశం కూడా ఈ నవలలో చెప్పడం ద్వారా రచయత కుల రహిత సమాజాన్ని కాంక్షిస్తున్నట్టు స్పష్టం అవుతుంది.
ఈ 'పొత్తి' నవల ద్వారా ప్రేమలో, ఉద్యమంలో, పశువుల పట్ల చూపే వాత్సల్యంలో, తెలంగాణ భాషలో స్వచ్ఛత తెలుస్తది. రియల్ ఎస్టేట్ అన్నదమ్ముల మధ్య సష్ఠించిన గోడవలు చెప్పడం ద్వారా గ్రామాల్లో ప్రపంచీకరణ చేస్తున్న విధ్వంసం గురించి కూడా ఈనవలలో ప్రస్తావించాడు రచయిత. 'భూములే పాలోల్ల పానాలు దీస్తయక్కా...'- వంటి మాటలు కంటతడి పెట్టిస్తాయి. ఆసాంతం తెలంగాణ యాసలో, తెలంగాణ మాండలికంలో సాగే ఈ నవలలో ముఖ్యంగా వ్యవసాయ వత్తి పదాలు, సామెతలు, నానుడులు, పల్లె జీవితాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయ అణువణువు ప్రతి పుటలోను కనబడతాయి. బొడ్రాయి పండగ ముచ్చట్లు, సాకలి సొల్లమ్మ తిట్లు, ఊరు చెరువులు, గ్రామీణ జీవన చిత్రణ అలా అన్నింటిని పట్టి పొత్తి పోశాడు. వాటన్నింటితో పొత్తు పెట్టుకుంటే ఈ నవలలో దశ్యాలన్ని కండ్లముందు కనబడతాయి. ఇదే విధంగా సమాజాన్ని ప్రభావితం చేసే, ఆలోచనలు రేకెత్తించే, మానవత్వపు పరిమళాలను వికసించే, నిత్య చైతన్యవంతం చేసే, ప్రశ్నను సంధించే, సమాజంలో మార్పులు తీసుకువచ్చే రచనలు నర్రా ప్రవీణ్ రెడ్డి కలం నుండి మరిన్ని రావాలి.
- అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417