Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రావిశాస్త్రిగా పేరొందిన రాచకొండ విశ్వనాథశాస్త్రి తెలుగు కథాసాహిత్యంలో, నవలా రచనలో తనకంటూ ఒక పరపడి ఏర్పాటు చేసుకున్న ప్రముఖ రచయిత. స్వతహాగా న్యాయవాది అయిన రావిశాస్త్రీ న్యాయస్థానంలోనే గాక తన జీవితంలోలోనూ అహరహం పేదలకు న్యాయం కోసం కలం అంకితం చేసిన గొప్ప రచయిత. వర్గసమాజంలో ప్రత్యక్షంగానే గాక కనిపిం చకుండా సాగే క్రూరమైన పీడననూ, న్యాయ ప్రక్రియలో వర్గ వైరుధ్యాలను కళ్లకు కట్టిన ప్రజారచయిత. కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితుడైన చైతన్యవంతుడు. 1922 జులై 30న విశాఖ జిల్లా తుమ్మపాలెంలో పుట్టిన రావిశాస్త్రి శత జయంతి వత్సరం మొదలవుతున్నది.
1940లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో బిఎ ఆనర్స్ చదివిన రావిశాస్త్రి తర్వాత మద్రాసులో న్యాయశాస్త్రం అభ్యసించారు. శ్రీకాకుళం విశాఖ జిల్లాల ప్రజా జీవితాన్ని లోతుగా పరిశీలించడం మొదలుపెట్టారు. యాభైలో ప్రాక్టీసు మొదలు పెట్టేనాటికే ఆయనకు ప్రగతిశీల భావాలు పట్టుపడ్డాయి, యాభయ్యవ దశకంలో విశాఖం జిల్లా యువజన సంఘాధ్యక్షులుగా ఉన్నారు. విశాఖ రచయితల సంఘాన్ని నడి పించారు. చాలా కాలం విరసంతో ఉన్నారు. న్యాయవాది గానే గాక విశాఖలో ప్రజాసంఘాల నేతలకూ యువతకు ఆయన ఎప్పుడూ అండగా ఉండేవారు. రచయితగానూ న్యాయవాది గానూ స్నేహశీలిగానూ రావిశాస్త్రి విశాఖ ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనారు. కాని ఇతరచోట్ల తెలుగువారి ప్రియతమ రచయితగా పదునైన రచనలు అందించారు.
1938లో వినోదిని పత్రికలో అచ్చయిన దేవుడేచేశాడు ఆయన తొలి కథ. 1993లో వెలువడిన ఇల్లు చివరి రచన. 1938లో వినోదిని పత్రికలో అచ్చయిన దేవుడే చేశాడు ఆయన తొలి కథ. 1993లో వెలువడిన ఇల్లు చివరి రచన. తానెలా రచయితనైందీ ఆయనే ఇలా రాశారు:
''పెద్దలు చెప్పిన కధలు వినీ, చదివి నాకు కధల్లో ఆసక్తి కలిగింది. పెద్ద వాళ్ళను ఇమిటేట్ చేద్దామనే ఉత్సాహం అప్పట్లో నాకు చాలా వుండేదని ఇప్పుడు నాకు బాగా స్పష్టంగా తెలుస్తోంది. అది అప్పుడు నాకు బాగా గొప్పగా కూడా తోచింది' నేను మొదట కధలు రాసినప్పుడు సరదా కోసమూ, గొప్ప కోసమూ తప్ప మరెందు గురించి రాయలేదు. మనం కూడా కథలు రాశాము. అవి పత్రికల్లో పడ్డాయి. అంటే నాకు చెడ్డ గొప్పగా వుండేది'' అని ఆయన తర్వాతి కాలంలో రాసుకున్నారు.
అలాగే ఆగిపోయివుంటే ఆయన రావిశాస్త్రి అయ్యేవారు కాదు. ఆయన రచనా యాత్ర ఉన్నత శిఖరాలకేసి సాగింది. సమాజంలో జరిగే అన్యాయాల గురించి, పేదల బాధల గురించి రాయాలని ఆయన గాఢంగా అర్థం చేసుకున్నారు. మొదట్లో మారు పేరుతో కొన్ని రచనలు చేసినా అసలు పేరుతో తొలిసారిగా ''అల్పజీవి'' నవల రాశారు. అది 'భారతి'లో ప్రచురితమైంది. అభద్రత ఆత్మన్యూనతా భావం అందులో కళ్లకు కట్టారు. శ్రీశ్రీ కోనేటి రావు కదల్లా, గోపీచంద్ ''అసమర్థుని జీవయాత్ర''లా, కొడవటిగంటి కుటుంబరావుగారి ''బ్రతుకు భయం''లో సీతప్పలా రావిశాస్త్రి సృష్టించిన 'అల్పజీవి' సుబ్బయ్య అందరినీ ఆకర్షించాడు. ఆందోళన పెట్టాడు. అల్పజీవి జేమ్స్ జాయిస్ ''చైతన్య స్రవంతి'' తరహాలో నడుస్తుంది. పరపు పిరికివాడైన సుబ్బయ్య పాత్ర చివరకు తనకే అసహ్యం కలిగించిందని అంటూ ఆయన 'చివర మాట'లో ఇలా రాశారు. ''పాపుల్లో సాహసులూ ఉంటారు. భయ స్తులూ ఉంటారు. కాని భయానికి మంచికి పొందిక లేదు. పిరికి వారెవరూ కూడా మంచివారు కాజాలరు. మంచికి నిలబడ లేరు. మంచిగా ఉండాలంటే గుండె నిబ్బరం చాలా ఉండాలి'' ఈ సూత్రాన్ని రావిశాస్త్రి జీవితాంతం నొక్కి చెబుతూ వచ్చారు. తప్పులైతే అందరూ చేస్తారు, త్యాగాలు మాత్రం కొందరే చేస్తారు అని పోరాడే యోధులకు తన రచనలు అంకితం చేశారు.
''ఆరుసారా కథలు!'' ''ఆరుసారో కథలు'', ''రాచ కొండ కలకంఠి కథలు. ''రాజు -మహిషి'', ''గోవులొస్తున్నాయి జాగ్రత్త'. రుక్కులు, సొమ్మలు పోనాయండి.'రత్తాలు- రాంబాబు', ''మూడు కథల బంగారం'', ''ఇల్లు'' ఆయన రచనలు. ఇందులో ప్రతి ఒక్కటి సామాజిక వాస్తవికతకు అద్దం పట్టేదే. ''నిజం'', ''విషాదం'' తిరస్క్రతి వంటి నాటకాలలోనూ ఆయన ఇదే పనిచేశారు. న్యాయవ్యవస్థ డొల్లతనాన్ని కపటత్వాన్ని ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. పాలకవర్గాల నయ వంచనను, దోపిడీని ఎండగట్టడంలో ఆయన కలం చాలా పదునైంది. ''ప్రస్తుతం మన దేశంలో ప్రతిరోజూ ప్రతిచోటా కూడా ఎందరో అమాయకులు చేయని నేరానికి శిక్షలు అనుభవించడం జరుగుతోంది. కాని ఈ మాత్రం డబ్బూ పలుకుబడి పదవీ హోదా కలవాడెవడూ పడడు. ఒకవేళ ఇరుక్కున్నా తప్పించుకోగలడు'' అని నిజం ముందుమాటలో రాశారు. ఇదే కథల్లోనూ పాత్రలు సంభాషణల ద్వారా చెబుతారు. ''పిపిలీకం'' అనేకథలో ఒక చీమ సత్యాన్వేషణకై బయలుదేరుతుంది. అనేక మజిలీలు గడిపి తిరిగొస్తుంది. వచ్చేసరికి దాని పుట్టలో పాము ఉంటుంది. తాను చీమనని, పాములు తమ పుట్టలు ఆక్రమిస్తాయని చీమకు అప్పుడే తెలుస్తుంది. సుమతీ శతక కారుడు చెప్పినట్టు అది అన్ని చీమలను సమీకరించి పామును హతమారుస్తుంది. 'వేతన శర్మ' కథలో పాలకులు తమ ప్రయోజనాలకై నడిమ తరగతిని ఎలా సృష్టించేదీ చెబుతుంది. మంచి చెడ్డల మధ్య ఘర్షణలో మనుషులు హీరోలు విలన్లుగా స్థిరంగా ఉండరని చెప్పడానికి మూడు కథల బంగారంలో బంగారుబాబు పరిణామక్రమం చిత్రిస్తారు.
ప్రబంధ కవులు ప్రకృతి నుంచి, శృంగార జీవనం నుంచి ఉపమానాలు తీసుకుంటే రావి శాస్త్రి సామాజిక జీవనం నుంచి, నిత్యజీవిత పరిశీలన నుంచి అతి చక్కని ఉపమానాలు సృష్టించారు. ఆయన వాక్యాలు, ఉత్తరాంధ్ర మాండలికంలో ఉపమానాలు వెల్లువలతో అలా సాగిపోతూనే ఉంటాయి. ప్రతి వాక్యం ప్రతిపదం వర్గ సమాజ నిష్టుర రూపాన్ని ఆవిష్కరించేదే. ఆయన కథల్లో గాని, నవలల్లోగాని కథ కన్నా కథనం, పాత్రల చిత్రణ, ఉపమానాలే ఎక్కువ భాగాన్ని ఆక్ర మిస్తాయి. హాస్యం వ్యంగ్యం తాండవిస్తాయి. రంగారావు రంగేళి పురుషుడేగాక రంగుల పురుషుడు కూడా అంటాడు. రావిశాస్త్రి శైలిని అనుసరించడానికి చాలా మంది ప్రయత్నించారు. బీనాదేవి ఆ విషయంలో చాలా వరకూ కృతకృత్యులయ్యారు.
రావిశాస్త్రి పాత్రల్లో ఎక్కువ భాగం 'అలగాజనం' లేదా సైద్ధాంతిక పరిభాషలో 'లం పెన్ ప్రొలిటేరియట్'గా ఉంటారు. వ్యభిచారిణులు, బ్రోకర్లు, దొంగలు, లంచగొండి పోలీసులు, పిక్ పాకటేర్లు, తాగుబోతులు, దారితప్పిన లాయర్లు, లోఫర్లు, దాఫర్లతో ఆయన రచనలన్నీ నిండి ఉంటాయి. వారే కొండంత జీవిత సత్యాలు చెప్పే రుషుల్లా కనబడతారు. పతితులార, భ్రష్టులార'' అని శ్రీశ్రీ సంభోదించిన అథోజగత్స హోదరులపై సానుభూతికిది సంకేతమని విమర్శకుల అభిప్రాయం. భిన్నాభిప్రాయాలూ ఉన్నాయి. శ్రీశ్రీతో, గురజాడతో ఆయనను పోల్చుతూ రాసిన వారున్నారు. గురజాడ తరహా వ్యంగ్యం, మాండలికం కూడా రావిశాస్త్రిలో చూస్తాం. అంతేగాక ఆయన కూడా కోర్టుల చుట్టూ తిప్పి అమాయకులను వేధించే రామప్పంతులు వంటి వారిని గురజాడా సృష్టించారు. గోర్కి కొన్ని కథల్లో అధోజగత్సహౌదరులను చిత్రించినా అలాటి జీవితాలతో గల పరిచయాన్ని బట్టి ఆ పాత్రలు చిత్రించానని గోర్కి చెబుతారు. నిస్సారమైన జీవితాలకన్నా అవికొంత మెరుగ్గాకన్పించాయంటారు. కాని రావిశాస్త్రి రచనల్లో ఇలాటి పాత్రలే కథను నడిపించే ప్రొటోగనిస్టులుగా ఉంటాయి. ''రత్తాలు-రాంబాబు'' 'ఆంధ్రజ్యోతి'లో సీరియల్‌గా వస్తున్నప్పుడు ఈ విషయమై సుదీర్ఘ చర్చ జరిగింది. ''మూడు కథల బంగారం''కు ముందు మాటలో ఆయన ఇలా చెప్పారు ''నేను ఎవరో పాశ్చాత్య రచయిత రాయగా ఎక్కడో చదివాను. అతను అవినీతి గురించి చెప్తూ మంచి వాళ్ళు కొంత మంది అవినీతిని మొదటి సారిగా చూసి అసహ్యించు కుంటారంటాడు. తర్వాత కొంత కాలానికి వారికి ఆ అవినీతి పట ్లనిర్లిప్తత ఏర్పడుతుందట. ఆ నిర్లిప్తత్తలోంచి కొంత కాలానికి అభిమానం చిగురిస్తుంది. అ అభిమానం చివరకు వారు ఆ అవినీతిని ఆలింగనం చేసుకోవడానికి దారి తీస్తుందట.'' తన నవలలో సూర్రావెడ్డు గురించి ఈ వాక్యాలు రాసినా ఈ మాటల్లో తన రచనా శైలిని గూడా వివరించారని అనిపించకమానదు.
రావిశాస్త్రి కాలమిస్టు కూడా. ఆనాటి పత్రిక 'జనశక్తి'లో వ్యాసాలు, స్కెచ్‌లు రాశారు. పులిపవర్లు అన్న దాంట్లో ఇలా రాస్తారు.. ''సింహాసనాల మీద పులులు కూర్చుంటే గోవులకీ, గొర్రెలకీ మరింక బతుకులుండవు. రాజులైనా, మంత్రులైనా ప్రజ లను రక్షించే వాళ్ళుండాలి కాని భక్షించే వాళ్ళుండకూడదు. ఎక్క డైనా సరే, ఏదేశంలోనైనా సరే రాజ్యం చేసే రాజుకి పులి పవర్లుం డడం ఏ సమయంలో కూడా ప్రజలకంత క్షేమకరం కాదు. అటువంటి పవర్లు గోవులక్కాకుండా గోముఖ వ్యాఘ్రాల చేతుల్లో వుంటే మరింక ప్రజల పాట్లు చెప్పేదేముంది? పేదల్ని రక్షించడానికని బయల్దేరిన నాయకులు పేదల్ని బక్షించే వాళ్ళుగా తయారవకుండా పేదలే కాసుకోవాలి. ఎందుచేతనంటే పులిపవర్లు గల పెద్దలు పులులుగా మారడానికి సరదా పడు తుంటారు ఎల్లప్పుడూ'' రావిశాస్త్రి రచనల్లో అన్నిటికన్నా ప్రధానంగా చెప్పుకోవలసింది న్యాయవ్యవస్థ అక్షరీకరణే. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ ఇటీవల చాలా సార్లు ఆ వియం ప్రస్తావిస్తుండడం విశేషం. పౌరహక్కులు, గోప్యత, భావప్రకటనా స్వేచ్ఛ ప్రతిదీ సవాలు నెదుర్కొంటూ రాజద్రోహం కేసులలో ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ప్రభుత్వ సంస్థలు తెగనమ్ము తున్నప్పుడు రావిశాస్త్రి రచనల అధ్యయనం ఎంతైనా అవసరమవుతుంది. ఉద్యమాలు పోరాటాల గురించి రచనలు వున్నంతగా మనకుపై తరగతుల బూటకాలు న్యాయం పేరిట చట్టం పేరిట జరిగే దారుణాల గురించి చెప్పిన రచనలు లేవు. వ్యంగ్యం హాస్యం కూడా తగ్గిపోతున్న స్థితి. కనుకనే ఆయన 1993 నవంబరు10న కమ్నమూశారు గాని ఆయన రచనలు మాత్రం చైతన్యం పంచుతూనే ఉన్నాయి. ఇలాటి సమయంలో రావిశాస్త్రి శతజయంతిని ఆయనకు జోహారులర్పించడానికే గాక ప్రతిభావంతమైన ఆయన శైలిని సాహిత్య సంపదను అధ్య యనం చేయడానికి ఈ సందర్భాన్ని ఉపయోగిద్దాం. ఎందు కంటే శ్రీశ్రీఅన్నట్టు శతాబ్దాల కిందట ఒక రావి గౌతముణ్ని ప్రభా వితం చేసింది. ఈ శతాబ్డంలో ఒక రావి తెలుగువారిని ప్రభావితం చేసి ప్రబుద్దుల్ను చేస్తుంది.
- తెలకపల్లి రవి