Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదే మాట చెబుతున్నాం పోడు మా జన్మహక్కునీ .. !
మీ అటవీ చట్టాల కంటే ముందే పుట్టిన ఆదివాసీలం
అనాదిగా యీ మట్టిసారాన్నే ఒంటికి పూసుకున్న మూలవాసులం
బెంటుమీద సూరీడ్ని రాజేసీ
కొండను కాల్చీ .. కంకితో మొజ్జు నరికి
పోడుజేసుకు బతికే కొండకొడుకులం
తొలిపంటను తల్లి జాకరమ్మ ముందు
మడపలి తీసిన అడవిబిడ్డలం ..!
ఎండ కురిసినపుడు ..
ఇదే అడవిని ఆకునుజేసి కప్పుకున్నాం
వాన పడ్డప్పుడు .. ఇదే కొండగుండెలో తలదాచుకున్నాం
ఇదే పోడు మట్టి.. మా దొన్నల్లో ఎన్నెల ముద్దయింది
ఇదే వాగు.. మా తల్లి చనుబాలదారయింది
ఇదే కొండ.. మా బతుకులకు అండదండయింది!
యివాల.. మీ ఉక్కుపాదాలతో
మా హక్కుల్ని మట్టేస్తున్నచోట -
పోడుపొదుగు నుండి మమ్మల్ని లాగేసి
మా నోళ్లకు మూతిబుట్టి కట్టి
చట్టాలకొయ్యలకు కట్టేస్తున్నచోట -
కొండగడపలోంచి కిందకు నెట్టేసి
మా గూడేల్ని తగలబెడుతున్నచోట -
మా పోడు బతుకుల్ని బుగ్గిజేసీ
పుట్టి పెరిగిన అడవికి
మమ్మల్ని పరాయిని జేస్తున్నచోట -
మళ్ళీ .. అదే మాట చెబుతున్నాం
పోడు మా జన్మహక్కనీ .. !
కాకులగూళ్లను కూల్చేసి
గెద్దలు కొండల్ని తన్నుకుపోతున్నచోట -
పెద్ద పులులుకు
అప్పనంగా అడవినప్పగించీ ..
కొండమేకల మీద
ఆయుధాలెక్కుపెడుతున్నచోట -
మళ్ళీ .. అదే మాట చెబుతున్నాం
పోడు మా జన్మహక్కనీ ..
పోరు మా రక్తచలనమనీ ..!!
(పోడుభూములకోసం పోరాడుతున్న గిరిజనులకు ..)
- సిరికి స్వామినాయుడు, 9494010330