Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రాజు'లు చావడం ఆనవాయితీనే!
'రాజు'ల్ని హతమార్చడానికి
చట్టాల్లాంటి పడికట్టు పదాలు
అక్కర్లేదు!
రైలు పట్టాల్లాంటి కథలు చాలు!!
రాజ్యం పోవాలంటే
పోరాటమే దిక్కు!
పేంక్రియాస్ లోపాన్ని
ఇన్సులిన్ ఎక్కించి
సరిపెట్టుకుంటున్నట్టు,
రంధ్రం పడ్డ బిందెకు
మాటేసుకున్నట్టు,
బొద్దింకకి లక్ష్మణ రేఖగీసి
కట్టడి చేసినట్టు,
ఆలౌట్తో దోమనీ,
హార్పిక్‌తో ఇంకేదోనీ,
మాస్క్‌తో కరోనానీ
యోగాతో సర్వరోగాల్నీ
నిలవరించే పని
నిర్విఘ్నంగా చేసే మనం
ఆరేళ్ళ పసికూనపై
అత్యాచారం చేసినోడ్ని
అసలెందుకొదులుతాం?
అందుకే రైలు పట్టాల మీద
వదులుతాం!!
ఇన్సులిన్ని మళ్లీ మళ్లీ
అడుగుతోంది శరీరం...
బొద్దింక లక్ష్మణ రేఖ దాటుతోంది
ప్రతిరాత్రీ...
ఆలౌట్ అయ్యాయనుకున్న దోమలు
ఆరింటికి ఠంచనుగా ఇంటికి...
హార్సిక్ వాసన కోసం అవీ...
మూడో వేవ్ కోసం కరోనా...
ఆపిన యోగాతో
అమాంతం పెరిగిన పొట్టా...
కూలికెళ్లి
ఖాళీ అయిన పాక ముందు
వంటరిగా ఆడుకునే పాప కోసం...
ఇంకో పేదోడి గల్లీలో
గుట్కా నముల్తూ,
సారా కొట్టు పక్క ఓరగా,
ఇంకో... 'రాజు'... క్రూరంగా....!!
మాటో, మందులో, బందులో,
ఉరితాళ్ళో, ఉపశమనాలో కాదు
పరిష్కారం...
వేళ్ళతో సహా వ్యవస్థని పెకిలించే
నిబద్ధతగల చైతన్యం !
- వి.విజయకుమార్
8555802596