Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతుకును పండించే మెతుకు
గుడిసెలో కూలివాడి సత్తు
కంచంలో ముతకన్నమైనా
మిద్దెల్లో ఉన్నోడి వెండి పళ్ళెం
లోని పలావు పరమాన్నమైనా
రైతన్న చెమట తడితో
మట్టి గర్భంలోంచి మొలిచినవే
ఆరుగాలం శ్రమించి
అన్నపు రాశులను పుట్టించే
మట్టిమనిషులు నేడు గర్భశోకంతో
నమ్ముకున్న నేలను బలవంతంగా
చెరబడుతున్న దుర్మార్గపు
చట్టాలను కాలదన్నేందుకు
దండుగా మారి హస్తినపై
దండెత్తి పోరుతూనే ఉన్నారు
కార్పొరేట్ శక్తులకు తొత్తులైనరాజ్యం
కొండ, చెట్టు,నీరు, నేలల్ని
దోచుకొమ్మని అప్పనంగా
అప్పచెబుతూ ప్రజల జీవనాన్ని
నడిబజారులో అమ్మకానికి పెట్టింది
అమ్ముకోవటానికి ఏమీ మిగలకుండా
ప్రజల ఆస్తులను ఆఖరికి
నడిచే దారులను వేలం వేస్తున్న
దుర్మార్గ స్థితిలో ప్రశ్నించటం నేరమైన
అన్యాయ పాలనలో ఇదేమిటని
ఎదురుతిరిగితే దేశద్రోహమంటూ
నోళ్ళు తెరిచిన జైళ్లలో కుక్కేస్తూ
కాషాయ మౌఢ్యవిషాన్ని కక్కుతున్న
వేయి పడగల విషనాగు నీడలో
సామాన్యుని బ్రతుకు దుర్భరమై
మార్పుకోరే శక్తులు ఏకమై
పిడికిళ్లు బిగించి కదిలి రానున్నారు
సహన శీలుడైన కషీవలుడు
ఆగ్రహిస్తే మీ కోటలు బీటలు పడి
మీ రాచరికాలు, అరాచకాలు
ఊపిరాడక ఉక్కిరబిక్కిరైన
క్షణాలు అపుడే మరిచారా ?
గణతంత్ర దినోత్సవాన
జన తంత్ర పతాకాలు
ఎర్రకోట బురుజుపై ఎగిరిన
రెప రెపల్ని చరిత్ర లిఖించలేదా?
రైతు కంట కన్నీరు తుడిచేందుకు
కష్టించే శ్రమజీవికి న్యాయమైన
ఫలితం దక్కే పరిస్థితుల కోసం
దేశమంతా ఉప్పెనలా ఎగిసేలా
సంఘాలన్నీ సంఘటితమై
ఇచ్చిన బంద్ పిలుపుకు
అందరం జ్వలించే కాగడాలౌదాం
ప్రజల సమస్యల్ని పట్టించుకోక
కుంభకర్ణుడి నిద్ర నటించే ఏలికల్ని
నిరసనల నిప్పు అస్త్రాలతో
నిద్రలేపి నిలదీసేందుకు
ఢిల్లీ సర్కారు గుండెలు బేజారయ్యేలా
ఆందోళన తెలుపుతున్న రైతన్నలకు
బాసటగా బావుటాలై రగులుదాం!
(27 'భారత్ బంద్'కు సంఘీభావంగా)
- డా. కె. దివాకరా చారి,
9391018972