Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో ఒకటే ఉక్కపోత
బయట వాన కురుస్తోంది
గాలి నిండా సముద్రపు వాసన
ఇసుక రేణువుల మీద ఆకుపచ్చని గుర్తులు
తడిసిపోయిన రోడ్డు మీద
చెమట చుక్కల్ని ఆరబెట్టడానికి
సూర్యుడు లేడు
తల తడవకుండా కప్పిన చీరకొంగు లోనుంచి పిల్లవాడి కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి
ఆమె మాత్రం నిలువెల్లా తడిచిపోయి
నీరై కారిపోతు జారకుండా నడుస్తుంది
గోడ మీద పోస్టర్లో హీరోయిన్
ఎండలో కూడా తడుస్తుంది
భక్తి ప్రవాహపు ప్రభావం మైకులో వినబడుతుంది
బడి బయట ఎగురుతున్న
జెండా వాలిపోయింది
వానకి దేశభక్తి లేదు
రోడ్డు మీద గుంటలో బాలిక మతదేహం
ఆ పూటకి బ్రేకింగ్ న్యూస్
తడిచిపోయిన నోటు టీ కొట్లో చెల్లుతుంది
జొరమొచ్చినా పర్లేదు ఫోన్ మాత్రం తడవకూడదు
దేహానికి వాన భయం లేదు
ఆసరాగా ఉంటాయనుకున్న
గొడుగుల బల ప్రదర్శన వీగి పోయి
ఊచల బండారం ఇప్పటికి బయట పడింది
ఇళ్ల కిటికీల నుంచి వాన కనబడుతుందో
మురికి యాతన కనబడుతుందో
చెప్పడం ఎవరికైనా కష్టమే
గుమ్మాల ముందు ఉత్తకాళ్ళు తడిసిపోతుంటే
ఎంత గట్టిగా తొడుకున్నా
చెప్పులు మాత్రం అస్తమానం కిందకి జారుతూనే ఉంటాయి
వాన అడుగులేయడం నేర్పుతుంది
అపార్ట్మెంట్ అంచుకింద కనిన
పిల్లలని పూరి గుడిసెలోకి మారుస్తూ
పిల్లి దీనంగా వాననే చూస్తుంది
తడిచిపోయిన చోట ఎలా నిలదొక్కుకోవడం
మనసులో ఊపిరాడని యాతన
బయట మాత్రం చల్లటిగాలి సలపరింత
ఎండ పొడ తగిలేవరకు
చలికి సమాధానం కాలే కట్టె దగ్గరే ఉంది.
- అనిల్ డ్యాని 9703336688