Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1990కి ముందు పదవ తరగతి చదివినవాళ్ళకు లేదా రేడియో విన్నవాళ్ళకు 'బాలానందం' గురించి తెలియకుండా ఉండదు. టి.విలు, కంప్యూటర్లు లేనినాడు తెలుగు బాలబాలికలకు చక్కని వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించి, చక్కని సంస్కారాన్ని, నడవడికను నేర్పిన గొప్ప మాధ్యమం రేడియో. అందులో 'బాలల్లారా రారండి! బాలానందం విందాము' అంటూ సాగిన పిల్లల కార్యక్రమాలు, రేడియో అన్నయ్య అక్కయ్య న్యాయపతి కామేశ్వరరావు దంపతులు, 'బాలబంధు' తురగా జానకీరాణి నుండి నిన్న మొన్న పదవీ విరమణ చేసిన ఉషారాణి వరకు ఎంతో మంది ఈ మహాయజ్ఞంలో భాగస్వాములయ్యారు.
ఇటీవల ప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి జిలానీ బానూ ఆత్మకథ చదివినప్పుడు 'నషర్'గా పిలవబడ్డ ఆనాటి హైదరాబాద్ రేడియో గురించి, అందులో నిర్వహించిన అనేక పిల్లల కార్యక్రమాల గురించి తెలిస్తే, నందగిరి ఇందిరాదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, గంగరాజు సుశీలదేవి వంటి వారి రచనలలో నిజాం రాజ్య యుగానంతరం 'ఆలిండియో రేడియో' తొలినాటి విషయాలు చదివాను. దాదాపు మూడు, మూడున్నర దశాబ్దాల తరువాత మళ్ళీ నా జ్ఞాపకాలు తాజాగా కావడానికి కారణం ఇవ్వాళ్ళ నేను చదివిన 'ఇవటూరి కామేశ్వరరావు రచనలు' పుస్తకం.
ఆగస్టు 12, 1923న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకాలోని మినుమంచలిపాడులో నైష్టిక లింగధారులు కుటుంబంలో పుట్టిన కామేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక ఉద్యోగరీత్యా హైరాదాబాద్ వచ్చి స్థిరపడ్దారు. అంతకు ముందు మద్రాస్‌లో వివిధ ఉద్యోగాలతో పాటు కొంత కాలం ఆంధ్రప్రభలో సహాయ సంపాదకులుగా పనిచేశారు. తరువాత వ్యవసాయశాఖ సంచాలకుల కార్యలయంలో ఉద్యోగం చేశారు. సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి స్వయాన మేనల్లుడైన కామేశ్వరరావు మద్రాసులో వారి వద్ద ఉండి విద్యాభ్యాసం చేశారు. వారి సాహచర్య, మార్గదర్శనాలే వీరికి చరిత్ర, సాహిత్యంపట్ల ఆసక్తిని కలిగింపజేసి రచనారంగం వైపుకు వెళ్ళేలా చేశాయి.
కవిత్వం, కథలు, బాలల నాటికలు, వ్యాసాలు, రాజకీయ విశ్లేషణలు రాసిన కామేశ్వరరావు రచనలు 'భారతి', 'తెలుగు స్వతంత్ర, స్రవంతి, ఆంధ్రప్రభ మొదలుకుని ఆనాటి అన్ని ప్రముఖ పత్రికల్లో అచ్చయ్యాయి. ముఖ్యంగా 1953-54 ప్రాంత్రంలో మద్రాస్ నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడం వరకు జరిగిన 'శ్రీభాగ్ ఒడంబడిక' నుండి ఆనేక చారిత్రక అంశాల పట్ల 'తెలుగు స్వతంత'లో వ్రాసిన వ్యాసాలు ఆనాటి ఆనేక చారిత్రక, సామాజిక, రాజకీయ అంశాలకు అద్దంపట్టాయని చెప్పొచ్చు. వ్యాసాలతో పాటు ఎన్నో మంచి కథలు రాసారు వీరు. ఇవటూరి అనేక కథలు రాసినప్పటికీ 'కొత్త గౌను' కథ వీరి కథా సాహిత్యంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒకే కాన్వాస్ మీద అనేక అంశాలను గీసిన చిత్రమిది. ముఖ్యంగా సీతమ్మ అనే చిన్నారి పాప నేపథ్యంగా, దిగువ మధ్యతరగతి జీవితానికి అద్దంపట్టే విధంగా రాసిన కథ ఇది. ఈ ఒక్క కథ చాలు వీరి పేరును కథా సాహిత్యంలో శాశ్వతం చేసేందుకు. వచన రచనలతో పాటు గేయం, పద్యం రాసి మెప్పించిన వీరు 'సిరిసిరి మువ్వ' పేర రాసిన పద్యాలు అనేక విషయాలు, అంశాలకు అద్ధం పడుతాయి. ఇందులోనే బాలలను గురించి ఆయన చెప్పిన పద్యం ఆయన మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాని పట్టి చూపుతుంది.
'అల్లరి చేయుట పసి / పిల్లలకె చెల్లు లేకున్న / పిల్లలౌదురే వారు చెట్టు కింద / పిల్లులో గుల్లలో మరి సిరిసిరి మువ్వ!' అంటూ పిల్లలంటే ఏందో చక్కగా చెబుతారాయన. పిల్లల కోసం ఆయన అనేక నాటికలు రాశారు కామేశ్వరరావు. వాటిలో కొన్నింటిని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 'బాలానందం' కార్యక్రమంలో ప్రసారం చేసింది. అలా ఆకాశవాణి ద్వారా బాలలకు పరిచయమైన వీరు ఒక్క తొంభయ్యవ దశకంలోనే పదుల సంఖ్యలో పిల్లల నాటికలు రాశారు. ఇవటూరి రచనలులో వచ్చిన వీరి నాటికల్లో ఎనమిది బాలానందంలో ప్రసారమైన నాటికలు, మరో నాలుగు పిల్లల కోసమే రాయబడి వివిధ సందర్భాల్లో ఆకాశవాణి నుండి ప్రసారమైన నాటికలు ఉన్నాయి. తాను స్వయంగా కథుకుడు, విశ్లేషకుడైనా పిల్లల కోసం పరితపించి నిబద్ధతతో రాసిన కామేశ్వరరావు అందరు బాల సాహితీవేత్తల్లాగా పిల్లల కోసం కథలు, గేయాలు రాయడంవైపుకు తన దృష్టిని పెట్టలేదు. 'నాటకాంతం సాహిత్యం' అన్నది మనకు తెలిసిందే. పిల్లలకు ప్రత్యాక్షానుభూతిని కలిగించే నాటకాన్ని మాధ్యమంగా ఎంచుకుని ఆ దిశగా చక్కని కృషిని చేశారు. ఎన్నో మేలిమి నాటికలను మన బాలలకు 'బాలానందం' ద్వారా అందించారు. పిల్లలకు ఎక్కువగా ఇష్టమైన మరో మంచిపనిని కూడా కామేశ్వరరావు చేసేవారట. అది స్టాంపుల సేకరణ. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, శ్రీలంకలతో అనేక దేశాల స్టాంపులను వీరు సేకరించారు. ఫొటోగ్రఫి పట్ల అత్యంత ఆసక్తి కలిగినవీరు తన దేశ విదేశీ పర్యటనను అందుకు నేపథ్యంగా మలచుకుని చక్కని ఛాయా చిత్రాలు తీసేవారట.
ఇవటూరి కామేశ్వరరావు బాలల కోసం రాయగా రేడియోలో ప్రసారమైన వాటిలో మనకు 12 నాటికలు మాత్రమే లభ్యం అయ్యాయి. దాదాపు అన్నీ 'బాలనందం'లో ప్రసారం అయ్యాయి.
ఒక జానపథ కథాంశాన్నో, క్షేత్ర మహాత్మ్యాన్ని తీసుకునో లేదా తెలుగు వెలుగులైన ఆంధ్ర ప్రాంత మహామహులను పిల్లలకు పరిచయం చేస్తూనో ఆయన ఈ నాటికలు రాశారు. ఆయన రాసిన వ్యాసాలు కూడా అలాంటివే. పండుగలు, పబ్బాలు, వాటివాటి పౌరాణిక, చారిత్రక విశేషాలు, చారిత్రకాంశాలు వీరి వ్యాసాల్లో ఉండడం చూడవచ్చు. అన్ని ప్రక్రియల్లో రచనలు చేసినప్పటికీ ఇవటూరి ప్రధానంగా బాలల కోసం రాశారు. నాటికను అత్యంత సుందరంగా, పిల్లలకు అర్థమ య్యేలా రాసిన కామేశ్వర రావు వాటిలో పాత్రల్ని కూడా అలాగే నిర్దేశి స్తారు. జానపద కథ లను వస్తువులుగా తీసుకుని ఆకట్టుకునే విధంగా రాయడం వీరికి బాగా తెలుసు. వీరి నాటికల్లోని 'కుమారుని పెళ్ళి' అటువంటిదే. శంకర య్య, సోమిద ేవమ్మలకు ఒక పాము కుమారుడుగా జన్మిస్తుంది. ఆ పాము రోజురోజుకు పెరిగి పెద్దదవు తుంది. యుక్త వయస్సు వచ్చాక పెళ్ళి చేయాలని సంకల్పించి మీనాక్షి అనే అమ్మాయిని ఈ పాముకు ఇచ్చి పెళ్ళి జరుపుతారు. పెళ్ళి అయ్యాక పాము అందమైన యువకునిగా మారుతుంది. పాము యువకుడిగా మారడం చూసిన తండ్రి శంకరయ్య తన కుమారుడు శాశ్వతంగా మానవ రూపంలో ఉండేందుకు పాము శరీరాన్ని కాల్చివేస్తాడు. పాము మనిషి రూపంలో శాశ్వతంగా ఉండిపోతుంది, ఇది ఇందులోని కథ. కథను నాటకీకరణగా మలచడంలో కామేశ్వరరావు చక్కని పద్దతిని పాటించి పిల్లలకు ఆసక్తి కలిగేలా మలిచారు. మరో నాటిక 'కుశలబుద్ధి' కూడా అటువంటిదే. ఇది కూడా పిల్లలకు ఆసక్తిని కలిగించడంతో పాటు చక్కని బోధనను చేస్తుంది. దాన ధర్మాల్లో అగ్రజుడుగా ఉండి పేదసాదలకు అండగా ఉండే శ్రేష్టికి సంబంధించిన కథ ఈ నాటిక. దుర్భుద్ధితో చేసిన పనులు ఏ విధంగా చిక్కుల్లో పడేస్తాయో తెలిపే మంచి కథ ఇందులో ఉంది. దీనికి కూడా చందమామ కథల సొబగులద్ది రాయడంలో కామేశ్వరరావు సఫలం అయ్యారు. 'వర్తకుని మోసం' నాటిక కూడా జానపద శైలికి చెందింది కాగా, 'గాలి మేడలు' పిల్లలకు ఊహల్లో విహరించి ఉన్నది కాస్తా ఊడగొట్టుకునే పేరిశర్మ కథ తెలిపే నాటిక. మరో నాటిక 'భయం' వీరి నాటికల్లో కొద్దిగా గంభీరమైన పిల్లల నాటిక. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలకు పెద్ద విషయాలను పరిచయం చేసే నాటిక.
సుప్రసిద్ధ విద్యావేత్త గిజూభాయి బధేకా గురించి మనకు తెలుసు. భారతీయ విద్యా వ్యవస్థపైన వారి ప్రభావం ఎంతో ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న విషయంలో వారికి స్ఫష్టమైన అవగాహన ఉంది. కామేశ్వరరావు నాటికల్లో మరో మంచి నాటిక 'కొంగ కథ' ఇది చదివినంత సేపు నాకు గిజూభాయి రాసిన 'ఏడుతోకల ఎలుక కథ', 'రంగురంగుల కొడిపెట్ట' కథ గుర్తుకు వచ్చింది. ఇది అచ్చంగా అదే శైలిలో నడుస్తుంది. ఈ సందర్భంగా నాకు గిజూబాయి కథలను కొత్తగా పరిచయం చేసిన గుజరాతి బాల సాహితేవేత్త, చిత్రకారులు అబిద్ సూరతీ మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ''ఈ పిల్లల కథలను అందుకోండి. మీ పిల్లలకువీటిని వినిపించండి. పిల్లలు వీటిని మళ్ళీ మళ్ళీ చెప్పే విధంగా చెప్పండి. కథలను కూడా వారి వారి వయస్సులను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకోండి.... ముందు మీరీ కథలను హాయిగా ఆస్వాదించండి. ఇవి మంత్రదండాల లాంటివి'' అని గిజూబాయి కథల గురించి ఆయన ఈ మాటలు అంటారు. ఇవి ఈ నాటికల పట్ల కూడా వర్తిస్తాయనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. ఇవటూరి కేవలం జానపద అంశాలనో, మరోటో మరోటో చెప్పి ఊరుకోలేదు. పెద్దగా పిల్లలకు తెలుగు పెద్దల్ని నాటికలుగా పరిచయం చేశారు. ఆ కోవలో రాసిన నాటికలు 'అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ', 'ఆంధ్ర రత్నం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య' నాటికలు. వీటి గురించి వివరిచనవసరం లేదుకానీ, ఆయా వ్యక్తులను పరిచయం చేసేప్పుడు వీరు ఎంచుకున్న పద్దతి మాత్రం విలక్షణమని చెప్పొచ్చు. అందుకు ఈ రెండు నాటికలు ఉదాహరణ.
రచయిత ఇవటూరి కామేశ్వర రావు జన్మతః శైవుడు. ఆయన మనవడు శివ 'ఇవటూరి కామేశ్వరరావు రచనలు' పుస్తకంలో 'మా తాత దగ్గర విభూతి వాసన వేసేది' అంటాడు. ఈ ఒక్కమాట చాలు ఆయన ఎంత శివభక్తి తత్పరుడో తెలుసుకునేందుకు. అటువంటి ఇవటూరి తెలుగునాట ప్రసిద్ధమై నిలచి, తెలుగు దేశానికి ఆ పేరు సార్థకమయ్యేందుకు కారణంగా చెప్పే మూడు శైవ క్షేత్రాలైన ఆంధ్ర ప్రాంతం లోని 'దక్షారామం', రాయలసీమ లోని 'శ్రీశైలం', తెలంగాణ లోని 'కాళేశ్వరం' క్షేత్ర మహాత్మ్యాలను పిల్లలకు తెలుపుతూ ఆయా ప్రాంతాల పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యతలను చక్కగా వివరిస్తూ నాటికలు రాశారు. ఇవి పిల్లలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని, జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక భావనను కలిగిచడానికి చక్కగా ఉపయోగ పడడమే కాక తెలుగు దేశానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలిపేందుకు చక్కగా తోడ్పడతాయి.
ఇలా తనకు తారసపడిన ప్రతి అంశాన్ని పిల్లల కోసం నాటికలుగా మలచి వారికి పిప్పరమెంట్లు, చాక్లెట్లలాగా తీపితీపి రసాలద్ది అందించిన అచ్చమైన బాలల బంధువు ఇవటూరి కామేశ్వరరావు. ఆయన జన్మించి ఇప్పటికి 98 సంవత్సరాలు. లింగైక్యం చెంది 20 సంవత్సరాలు. 12.08.2003 ఈ బాలల తాత శత జయంతి. తన నాటికలను భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా, వారసత్వ సంప దగా అందించిన ఇవటూరి కామేశ్వరావు వెలయించిన నాటి కలన్నీ విహారిగారన్నట్లు 'దిక్సూచికలు.' ఆచార్య కొలకలూరి పేర్కొనట్లు 'వీరి నాటికలు చిరకాలం నిలుస్తాయి.'
సహాయ సంపాదకుడు, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా
డా || పత్తిపాక మోహన్