Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇనగణత్రయంబు ఇద్రధ్వయంబును
హంస పంచకంబు నాటవెలది'' - చందఃశాస్త్రం, బ్రౌన్
''సప్తవర్షమందు సప్తశతినిరాసి
సంభ్రపరచినాడు సకల జనుల
సంన్యసించి తాను సాగగా లోకాన
అడ్డుచెప్పి రంట యమ్మనాన్న'' - డా. లేఖానందస్వామి
లోకజ్ఞాని, తొలి సైటిస్టు విరాట్ పోతులూరి వీరబ్రహేంద్రగారి రచనజ్ఞానాన్ని వంట పట్టిచ్చుకొని, ఆటవెలదుల పద్యాలను అల్లి సాహితీ రంగప్రవేశం చేయటం అరుదైన సందర్బం. తెలుగు లోకం గర్వించదగ్గ సమకాలీన పద్యకవి డాక్టర్ లేఖానందస్వామి. కథకుడు, నటుడు మంచి పరిశోధకుడు. వీరు 1970 ప్రాంతలోనే ''పట్వారి నాటకం'' ముద్రించారు. యాచకులు, పిచ్చుకుంట్లపైన ప్రామాణికత కలిగిన పరిశోధక యం.ఫిల్ వ్యాసం రాశారు. ''అట్టడుగు జాతి రెడ్లకు అశ్రితులుగా, కుంటి మల్లారెడ్డీ కథ చెపుతూ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలియ తిరుగుతూ రెడ్ల కుల గోత్రాలు చెప్పి, వాళ్ళను పాలకులను చేసి, వీళ్ళు పిచ్చుగుంట్ల బిచ్చగాల్లయిండ్రని'' తెలుగు లోకం దిమ్మదిరిగే పరిశోధక నిజాలను యంఫిల్ ద్వారా వెలుగులోకి తెచ్చాడు.
నల్లగొండ నాటక సంస్థలపై పరిశోధన చేసి, నిజాయితీగా ఉన్న శివనాగిరెడ్డి గారిచే ప్రశంసాప్రత్రం పొంది తెలుగు యూనివర్సిటీ ఉత్తమ పరిశోదన డాక్టరేట్ పొందాడు. ఇది ఎత్తిపోతల పరిశోధన కాదు. కాళ్ల చెప్పులరిగేలా తిరి గాడు. రోడ్ల కూడల్ల దగ్గర కూర్చొని నాటక కళాకారుల దగ్గరకు రోజుల తరబడి తిరిగి క్షేత్రస్థాయి పరిశోధన చేయడం నల్గొండలో అందరికీ విదితమే. చిత్రమేమంటే కరోనా లాక్డౌన్లో కరోనా తెచ్చిన కష్టాలు, కడుబీదలు, వలస జీవుల పక్షాన నిలిచి వారి కన్నీటి గాధలను అక్షరీకరించారు. ప్రతిరోజూ ఆరు గంటలకే సాహితీప్రియులతో ఉదయపు వాహ్యాళిని కవి సమ్మేళనం చేసేవారు. మది నిండా ఆటవెలదుల పద్యాలను అల్లుకొని నడక మిత్రులకు పద్యామతం పంచిపెట్టారు. లోకజ్ఞానం, అక్షరజ్ఞానం ఎక్కువగా ఉన్న డా. లేఖానందస్వామి సాన్నిహిత్యంలో ఆకోవకు చెందినవారే ఎక్కువ. చిన్నవాళ్ళ నుండి సైతం నేర్చుకోవాలనే వారి తపన పెద్దవారిని సైతం ప్రభావితం చేస్తుంది.
పద్యాన్ని చదివే వాళ్ళే కరువైన ఈకాలంలో, పద్యాలను రాసి,
శ్రావ్యంగా చదవగలిగే డా. లేఖానందస్వామి తాజా దేశీ ఆటవెలది పద్యకావ్యం ''ఊట ఖండకావ్యం''. దీనిలో ఈ పద్యం చూద్దాం.
''ఒక్కమాటయంటు ఒడుపుతో విసిరెను
లాకుడౌను వార్త లాఘవమున
బిక్కచచ్చిపోయె బీదబిక్కియునంత
కూలబడిరి వలస కూలిజనము (పద్యం-34)
ఆటవెలదుల ''ఊట'' కన్నీటి గాధలను, కష్టజీవిగా మారి, పద్యం అల్లిన విధం చదువరులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఏక బికిన ఆరు వందల ముప్పై పద్యాలు ఎక్కడా గణవిభజన మాత్రలు చెడకుండా, ఆటవెలది చంధస్సులో రాయడం అభినందనీయం. చరిత్ర అధ్యాపకులైన డా. లేఖానందస్వామి తెలుగు మీద ఇంత మమకారం చూపించాడు. ఈ పద్యకవికి వందనం.
తెలుగు పద్య అల్లికలో సాంప్రదాయాలు మూడు. ఒకటి వత్తాలు. రెండు జాతులు. మూడు గేయాలు.
చంధశాస్త్రం తెలిసిన జ్ఞానులు ఆటవెలదిని ఇంకో భాగమైన ఉపజాతులలో కూర్పు చేయడం జరిగింది. తేటగీతి, ఆటవెలది, సీసం, ఉపజాతులలో చేరినై. వత్తాలలో గురు, లఘు క్రమం అక్షర సంఖ్య నిక్కచ్చిగా ఉంటాయి. అందుకే వీటిని అక్షర గణాలు అంటారు. మాత్ర గణాలలో గురు లఘువులను మార్పు జరిగే వెలుసుబాటు ఉంటుంది. ఇవి జాతి ఉప జాతి పద్యాలలో ఉపయోగపడుతాయి. మాత్రగణ క్రమానికి ఇంకొన్ని రకాల గురు లఘును కలుపుకునే అవకాశముంటది. ఐతే లక్షణాలలోనే పద్య పరిమాణాన్ని మించిన గణాలు ఏర్పాటు జరుగుతుంది.
డా|| లేఖానందస్వామి వ్యక్తిగతంగా జిజ్ఞాసాపరుడు. అరవై దాటిన తర్వాత ఆసక్తితో యం.ఎ. తెలుగు చదివారు. అంతే ఉత్సాహంతో ఛందశాస్త్రం వంటపాటించుకున్నాడు. కాబట్టే వడి వడిగా ''ఊట'' ఆటవెలదుల కవి కాగలిగాడు. గిది సత్యం.
''వరుణదేవ రోజు వరుస నొచ్చె'' (విభాగం-50) లో కవిగా వానలు వరదలు వస్తే పులకించడం కనబడుతుంది. వారంపాటు తెరపి లేకుండా కురిసిన వర్ష వర్ణన గురించి, ప్రకతి సౌందర్యారాధన, తెలుగు భాషలో పలుకు బడులను ఉపయోగించిన తీరు ఈ ఆటవెలది పద్యంలోచూడొచ్చు.
''తెల్గుసీమ లందు తెగ బడి కురిసేను
నింగి పగిలి నట్లు నీరు నేడు
వారమైన గాని వదలగ లేదాయే
ధార కారినట్లు ధరన నిపుడు (పద్యం-426)
కవి మానవత్వం వైపు కరోన రోగుల పక్షాన నిలబడి కలాన్ని కదిలించిన తీరు ప్రశంసనీయం. సర్కార్ దావఖానల్లో కరోనా సోకి జనం అర్ధాంతరంగా ఆయువు నొదిలిపోతుంటే, వైద్యం కల్పించని సర్కారుపై కన్నెర్ర చేశాడు. రోగులు ఔషదాలను కొనే స్థోమత లేక, తిండి లేక ఆకలి చావు చచ్చారు. ఇలాంటి క్లిష్టసమయాల్లో ప్రభుత్వం కార్పొరేట్ కు తలొగ్గిన తీరును కవి ఆక్షేపించాడు.
''ఎంత మంచి కబురు ఎన్నాళ్ళకెన్నాళ్ళు''
(51వ అధ్యాయం)లో
''పదులు వేలు మించి పడకేయ రోగులు
వైద్య వసతి లేక బాధ నొందే
సర్దలేక పోయె సర్కారు దవఖాన
కార్పొరేట్ వైపు కదల మనెను'' (434వ పద్యం)
ప్రజలు జరుపుకునే పండుగల నిర్వహణపై కోవిడ్ ప్రభావాన్ని గురించి ఒకచోట బాధపడుతారు. కోవిడ్ మొదటి తరంగంలో వినాయక చవితి జరుపుకోలేదని బాధ పడిన కవి, రెండవ తరంగం వచ్చినపుడు, ఇలా బాధపడుతారు. ''ఈసురంటు వెళ్లే ఇపుడు చవితి''(విభాగం-52)లో ఈ విధంగా రాశారు.
చేతినిండ పనులు చిక్కంటు తలవగా
ఈసురంటు వెళ్లే ఇపుడు చవితి
ఏమి రోగమిదియు ఏమార్చే పేదల
అంతరించు టేపుడో యవనియందు (పద్యం-447)
పెండ్లిల్లకు పర్మిషన్లు ఇచ్చిన సర్కార్, కరోనాకు మళ్ళీ ఊతమిచ్చారు. రాజ్యాంగం కల్పించిన రిజిస్టర్ పెళ్ళిళ్ళను ప్రోత్సహించాల్సింది. జనం గుమిగుడడాన్ని అరికట్టడంలో విఫలమై జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది ప్రభుత్వం.
''ప్రజ్ఞ పాటవాల బహిరంగ ప్రాంతాన
చేయ వచ్చుననియే చేవ మీర
కడకు నిచ్చే కేంద్ర కళ్యాణ తంతుకు
పరిమితంబు తోని పర్మిషన్లు'' (467 వ పద్యం)
ముప్పై సంత్సరాలుగా చరిత్ర అధ్యాపకులుగా ఉండి తెలుగుభాష కోసం యం.ఎ. తెలుగు చదివి, పద్య రంగ ప్రవేశంతో బాటు చారిత్ర, సామాజిక శాస్రం, టిపిటి, యం.ఇడి, ఎం.ఫిల్, పి.హెచ్.డి వంటి అత్యున్నత పట్టాలు సాధించడంతో బాటు, తెలుగు భాషపై మమకారాన్ని కల్గి ఉండడం ముదావహం.
56 వ అధ్యాయంలో ''తరములెన్ని యైన తరగని నా భాష'' ఈ పద్యం ద్వారా తెలుగు అభిమానాన్ని చాటారు.
''తరములెన్ని యైన తరగని నా భాష
తేనే యూటయదియు తెలుగు భాష
ద్విత్వయక్షరాలు తెలగాన సీమలో
పదము చివర యుండి పలుకు యాస'' (పద్యం- 470)
తల్లులు ఉన్నంత వరకు తల్లి భాష వర్ధిల్లు దేశాన. మచ్చుకు ఆటవెలదుల ''ఊట ఖండ కావ్యం'' నిరూపన. మనుషులకు మానసికశాస్త్ర సిద్దాంతాన్ని భాషాశాస్త్రవేత్తలు చర్చ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలి. సాంకేతిక విద్య భారతీయ భాషల్లోకి ఇముడుతుందని సాంకేతికంగా మాత భాషను అమలు చేస్తున్న చైనా, జపాన్ దేశాల ప్రగతి చూడండి. భారత దేశంలో 1652మాత భాషలున్నాయి. షెడ్యూల్ భాష లు షెడ్యూల్ కాని భాషలు ప్రాంతీయ భాషలు. ప్రధాన భాషలు, అధిక సంఖ్యాక భాషలు ఇలా ఇన్ని భాషలున్నాయి. మాతభాషా ఉద్యమం జరుగుపున్న తెలుగు వాళ్ళకు దిగులు దేనికి. ఊట కవులే రేపటి మాతభాషా ఉద్యమ దీప్తిధార.
- వేముల ఎల్లయ్య, 9440002659