Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తలుపులు తెరిచి ఉన్నా
అవి అవసరానికి మాత్రమే,
చూపులకిటికీలు సైతం
అదే గమ్యమని నేర్చుకుంటాయి!
మాటలు లోలోనే మూలుగుతూ
ఊహలు గిరిగీసుకొని ఆగిపోతాయి,
స్పందనలు మౌనంగా ఎగిసిపడుతుంటాయి,
ఎక్కడెక్కడో విస్తరించాల్సినవన్నీ
నాలుగు గోడల మధ్యనే నలిగిపోయి
చీకటిని వెళ్లగక్కుతుంటాయి!
గడ్డకట్టుకపోయిన శూన్యం
కనబడని స్పర్శకు, వినబడని శబ్దానికి
ఏదో ఒకనాడు కరిగిపోతుంది,
ద్వారాలెన్ని అడ్డుగా వచ్చినా
గోడలన్నీ బద్దలై కూలిపోతాయి!
ఎన్నాళ్ళనుండో నిలబడ్డ అడ్డుగీతలు
ఒక్కసారిగా తుడిచిపెట్టుకపోయి,
వాస్తవం వెక్కిరిస్తూ నిలబడుతుంది!
మనసొక నదీ ప్రవాహమై
సముద్రాన్ని కలిసేదాక పరుగు తీస్తుంది,
ప్రవాహంలో పక్కచూపులుండవు
అన్నిటినీ తనలో కలుపుకొని
అన్నీ తానై కొత్త దారులు చూపుతుంది!
దూరం ఎంతైనా
వేగం ఎంతైనా అలుపండదు,
అనంత సాగరం తనకోసమే
ఎదురుచూస్తూ ఉంటుందనుకున్న
మనసుకు నిరాశే మిగులుతుంది,
ఎన్నెన్నో ప్రవాహాలు తనకంటే ముందే
చేరిపోయాయని తెలిసి
మౌనంగా లీనమౌతుంది,
తానొక బిందువునని తెలిసేలోపు
సింధువుగా మారిపోతుంది!
- పుట్టి గిరిధర్, 9491493170