Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక కవితను గానీ, కథను గానీ, వ్యాసాన్ని గానీ రాసింతర్వాత దాన్ని వెంటనే ఏదైనా పత్రికకు పంపుకోవడం మంచి పద్ధతి కాదు. నిజానికి దాన్ని రాసేటప్పుడు కూడా ఎన్నోచోట్ల కొట్టివేస్తూ సవర ణలు చేసుకోవడం అవసర మవుతుంది. ఇంకా రివర్స్‌లో వెళ్తే, ఆ రచనను మొదలు పెట్టే ముందు మనసులో ఎంతో మథనం జరిగితేనే బాగుం టుంది. అయితే ఇది అన్ని సందర్భాల్లో, అందరు కవుల, రచయితల విషయంలో నిజం కాకపోవచ్చు. రచనలు చేయడంలో బాగా అనుభవం ఉన్నవాళ్లకు బహుశా వీటి అక్కర అంతగా ఉండదేమో (ముఖ్యంగా వచనరచనల విషయంలో). ఒకవేళ ఉన్నా వాళ్లు వీటికోసం ఎక్కువ సమయం తీసుకోకపోయే అవకాశముంది. ఈ చర్యల ఆవశ్యకత ఎక్కువ వరకు కవితా రచనకే ఉంటుందా అంటే, అవునని నిర్ద్వంద్వంగా చెప్పలేం. తరచి చూస్తే ప్రతి రచన విషయంలో ఇది ముఖ్యమైన అంశమే.
కొందరు కొన్ని కవితలను చాలా తక్కువ సమయంలోనే రాస్తారు. మరికొన్ని కవితలు ఎన్నో రోజుల, లేదా నెలల మథనం తర్వాత బయటికి రావచ్చు. వాంతి వచ్చే ముందు మనకు చాలా సందర్భాలలో కడుపులో తిప్పి నట్టవుతుంది. కొంత సమయం పాటు అలా జరిగిన తర్వాతనే వాంతి అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది లేకుండానే కావచ్చు కానీ, అది చాలా అరుదు. సాధారణంగా కవితకు సంబం ధించిన ముతక సరుకు (షతీబసవ ర్బటట) కొంతకాలం పాటు - అది కొన్ని రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, అట్లా మనసులో/మెదడులో 'తిప్పిన' తర్వాతనే కవి దాన్ని రాయడం మొదలు పెడతాడు. అయితే ఇది కొందరికి మాత్రమే కలిగే అనుభవం కావచ్చు. రాసే టప్పుడు కొన్ని కొట్టివేతల ద్వారా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటాం, సరే. తర్వాత దాన్ని కొన్నిరోజుల పాటు అలా ఉండనిచ్చి, మధ్యమధ్య దానిలోని పదాల గురించి, పంక్తుల గురించి, లేదా వాక్యాల గురించి ఆలోచిస్తే నాణ్యత పరంగా ప్రయోజనముంటుంది. భావాన్ని ఉద్దీపితం చేసే సరైన, ప్రభావవంతమైన కవిత్వభాష వచ్చిందా, ఏవైనా పదాల స్వరూపాలు తప్పుగా వచ్చాయా, మరింత మంచి శీర్షికను పెట్టేందుకు వీలుందా అని లోపల్లోపలే వివేచించుకోవచ్చు. ఆ విధంగా చేసినప్పుడు మనసుకు తట్టిన మార్పులను ముందు రాసుకున్న ప్రతిలో ఎప్పటి కప్పుడు చేర్చుకోవచ్చు. ఇట్లా చేస్తే రచనలో మెరుగు దలను సాధించగలం. నిజానికి దీనికి పరిమితి లేదు. ఎంత ఎక్కువ కాలం ఇలాంటి చర్యలను అవలంబిస్తే అన్ని ఎక్కువ సవరణలు చేయవచ్చు. కానీ మరీ చాలా వారాల పాటు, నెలల పాటు చేయలేం కదా! కాబట్టి, చాలా వరకు సంతృప్తి కలిగేదాకా చేయవచ్చు.
వచనరచనలో కూడా ఇట్లా సమయాన్ని వెచ్చించి చేయాల్సిన సవరణలు తక్కువగా ఏం ఉండవు. నిజానికి అందులో ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్క వాక్యాన్ని విడిగా పరిశీలించి భావం, భాష, వ్యాకరణం మొదలైన అన్ని కోణాల్లోంచి పరీక్ష చేసి, పరిపూర్ణంగా ఉండేలా అంతిమరూపం తేవాల్సి ఉంటుంది. అంటే దోసెడు ముత్యాలను ఒక గిన్నెలో వేసి, అందులో నీళ్లు పోసి గబగబా పిసికి, నీళ్లను పారబోయడం కాకుండా, ఒక్కొక్క ముత్యాన్ని విడిగా కడిగి పొడిగుడ్డతో తుడవడం అన్న మాట! ఈ రచనానంతర సవరణలు (జూశీర్-జూతీశీసబష్‌ఱశీఅ షశీతీతీవష్ఱశీఅర) చేయకపోతే, రచనను మెరుగు పరచే అవకాశాన్ని కోల్పోతాం. నిజానికి అంతిమంగా టైపు చేస్తున్నప్పుడు కూడా.... అంటే ఆఖరి క్షణంలో సైతం, సవరణలు వాటంతట అవే స్ఫురిస్తాయి కొన్నిసార్లు - మనం షశీఅరషఱశీబరగా (సచేతనంగా) ఆలోచించకుండానే! అయితే, ఇది కూడా కొందరిలో మాత్రమే కలిగే వ్యక్తిగత అనుభవం కావచ్చు.
ఆదరాబాదరాగా రాసేసి, రచనానంతర సవరణలు చేయకుండా వెంటనే పత్రికకో మరేదానికో పంపితే, రచనలోని నాణ్యతతో రాజీ పడినట్టే. అయితే, ఎవరి పద్ధతులు వారికి ఉండవచ్చు. అవి స్వాభావికమైనవి అయినప్పుడు వాటినే పాటించడం మేలు. అట్లాంటి పద్ధతులు లేనివారి కోసమే ఈ లఘువ్యాసం.
ఎలనాగ, 9866945424