Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊహిస్తామెన్నో, లెక్కలు కట్టుకుంటాం
తొవ్వలు చేసుకొని చొరబడతాం
తొక్కులాడుతాం, గుంపును తోసేసి ముందుకెళ్తాం
కాలం కలిసొచ్చి పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తే
కుతికెల దాకా కడుపు నింపితే
శ్వాస పట్టించుకోకుండా చెమటోడ్చామని
గొప్పలు గోరంతలు కొండంతలు చేసి చెప్తాం
విజేత వెనక ఎనలేని త్యాగాలున్నాయని వివరిస్తాం
గెలుపు ఏనుగు అంబారీ ఎక్కితే
తమను ఆపడం ఎవరి తరం కాదంటాం
కళ్ళు నెత్తికెక్కి కాలుజారి పడిపోతే
బురద తొక్కిన పరువు బజారు పాలైతే
పదిమందికి అంటించడానికి వెనుకాడం
లెక్కలు తారుమారై తిక్క తిరుణాళ్లై
తప్పుల మీద తప్పులు తోరణాలు కడితే
కుప్పకూలితే నిట్టనిలువుగా
నిందిస్తాం, నిప్కలేస్తాం ఇతరులపై
గతం గంగలా ప్రవహించిందా
పిల్ల కాలువలో ఈత కొట్టిందా
నిండా మునిగి, ఇతరులను ముంచి
అడ్డదారిలో గమ్యం చేరిందా
గమనించే చూపులుంటాయి
నిలదీసే రోజులుంటాయి
ఊహాతీతాలు కొన్ని సార్లు ఊపిరి పోస్తాయి
కొన్నిసార్లు గానుగ గుంజకు కట్టేస్తాయి
పసి గట్టి పడదోస్తాయి
ఉన్నచోటే ఉన్నా
పడిపోయి పైకి లేచినా
నిచ్చెన ఎక్కడం కాదు లిఫ్టులో పైకి వచ్చినా
తెలివి తెర్లు కాకుండా చూసుకోవాలి
- కొమురవెల్లి అంజయ్య, 9848005676