Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్ని నెత్తుటి పాటల్ని
నొసట రాసుకుంటే .,..
ఎన్ని కన్నపేగులు మన్నయితే,.
ఎన్ని వాడలు వల్లకాడు లైతే.,.
ఎన్ని ఉరికొయ్యల ఊరేగింపులు ఊపిరాగితే .,,
ఎన్ని అడవులు అగ్గి రాజుకుంటే
ఎన్ని కలాల బలాలు
మింటి కంటిన మంటలైతే.,.
ఎన్ని ఉద్యమ సముద్రాలు
ఉప్పెనలైతే.,.
ఎన్ని తీరాల తిరుగుబాటులు బీమాకోరెగాంల కొలుములు
ఎంతమంది ఝల్కారీ,నాంగెలి, ఉదాదేవి, కుయిలీలు నేలరాలితే
గీ భాగ్య విధాతల భారతయ్యల స్వాతంత్య్రాలు హిమాలయాలై
విస్తరించినయి! గంగలో గలీజులై పొంగి పొర్లతున్నయి.
స్వాతంత్రమ్ గగనాల గండికోట కాన్నె గాడి తప్పింది
చిటారు కొమ్మల మీన్నే మిఠాయి పొట్లమైంది
నేల మీదికి దిగని నెల పొడుపైంది
అగ్రహారాన్ని అల్లుకొని
ఊరికి చేరువైనా ు-
గూడెం గూటి గడపలు
తడపని ఓటి కడువ
అడవి అంచులకు
అడుగేయని తొండి తొడిమె
మట్టి తల్లుల్ని తట్టి తలాపున
నిలబడని నీడ పొడ
స్వాతంత్య్రం సాయుధమై
ఎవుసమ్ ఎన్ను మీన తన్ని
ప్రభుత్వ పరిశ్రమల పక్కబొక్కలిరిసి
అంగట్ల అమ్ముతూ తక్కెట్లను తలకిందులు చేస్తున్న తక్లీబులు
సంపన్నుల సంపదలకు
సాష్టాంగ సాగిల స్వాతంత్య్రాలు.
మనుషులను మతాలుగా
కులాలుగా నిలబెట్టిన
అల్లకల్లోలాల గుల్ల స్వాతంత్రాలు.
నిజానికి ఆజాద్ అమత మహౌత్సవాలు అంటే.,.,.,.,.
శిఖరాల్లో అందెగట్టి చిందేసే స్వాతంత్రాలు కాదు
కందులు కొట్టిన కల్లమైన
స్వాతంత్రాలు కాదు
రైతు కూలీ కండ్లల్ల బిళ్ళలు గట్టిన
బీడు స్వాతంత్రాలు కాదు
మట్టి రైతన్నల,రైతక్కల
పొలంల మాడిపోయిన
విత్తన స్వాతంత్రాలు కాదు
కూడందని,సదువులు
సంకెక్కని కూలినాలక్కల కుతికెల
అతుకుల స్వాతంత్య్రాలు కాదు
మూతికి ముడేసిన ముంతలు పగిలి పోయే పగటి స్వాతంత్రాలు కావాలే
ముడ్డికి సుట్టిన తాటాకులు సినిగిపోయే సిత్తరువులు కావాలే
ఎంట్లు గట్టిన జెడల అడువుల్ని
యీరబోసుకున్న మారెమ్మోలే బూమమ్మ పచ్చటి పండుగ్గావాలే
దున్ని దువ్వి మడులు ముడిసి మాగానులు
కొప్పుల బెట్టిన వాడ చెమట చెరువు పిడికిట్ల నేల నెమరెయ్యాలే
ఆఖరి అట్టడుగు ఆడ-మగ వి లకు అన్ని హక్కుల నుంచి అవతలికి తరిమేయని స్వాతంత్రాలు రావాలి
అప్పుడు కదా! ఆజాద్ అమత మహౌత్సవాలు.
- జూపాక సుభద్ర