Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకలి చావులగాథను
బుర్రకథలానైనా చెప్పరా?
నా కథే ఓ నాటకంగానైనా వేయారా?
గాయాలైన గుండెగోడు ఎవ్వరికీ పట్టదు!
నాకున్న రెండుచేతులనే నమ్ముకున్న శిలను
రెక్కలు విరుచుకుని ఎగరలేకున్నా...
కూలి లేదంటే... కదలిపోలేని అవిటివాన్ని!
జాలైనా చూపలేని గుడ్డిలోకంలోవున్నా...
నా రెండు కాళ్ళకు ఆరుకాళ్ళు తోడు
ఆరుగాలమొచ్చి అరంగుళం కదలలేక
మా మూడుకడుపుల ఆకలి కేకలు
పొలిమేరలు దాటలేకపోతున్నాయి!
పూటలు గడవక పాట్లు పడుతుంటే...
ఎంగిలిమెతుకులు సైతం ఎక్కిరిస్తున్నాయి!
పూరిగుడెసె లేని పధ్వీపుత్రున్ని
పుస్తెలమ్మి ఎన్ని పూటలు తినగలం?
ఆకలికి చావు రాకూడదు!
నా పాట నేనే పాడుకుంటూ...
నా బుర్రకథ నేనే చెప్పుకుంటూ...
నా కథ నేనే నాటకం వేసుకుంటూ...
శవంపై చల్లిన చిల్లర ఏరుకుంటూ...
నా అడుగు కదిలింది జొలి పట్టుకొని ఊరూరా...!!
- కుంచె శ్రీ , 9908830477