Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడంటే అప్పుడు ఎంతంటే అంత
రాయగలిగేది కవిత్వం కాదు
తలలో ఒక రిబ్బనుచుట్ట ఉండి,
దాని కొసనొకదాన్ని బయటికి లాగి,
కత్తిరించి కాయితమ్మీద పెట్టడంలో
మనోమేధామథనాలు శూన్యం
తల్లిగర్భంలో పిండం ఎదిగినట్టు
తలలో ఊహలు బలపడాలి
అవి అంతిమరూపం పొందేందుకు
కొంతైనా సమయం పట్టాలి
నెలలు నిండక పుట్టిన బిడ్డ
బక్కగా బలహీనంగా ఉండటం ఖాయం
మాటలను పంక్తిలో పొదిగే ముందు
వాటిని తూకం వేయడం ముఖ్యం
పంక్తులను క్రమంలో పెట్టినప్పుడు
వాటిలో పస లేకపోతే అవి వ్యర్థం
యాంత్రికతను తలకెత్తుకున్న చోట
రసం అదశ్యమౌతుంది
నీరసం దగ్గోచరమౌతుంది
శబ్దార్థాల ఇనుప పట్టాల మీద
కవిత్వపు రైలు సవ్యంగా సాగితేనే
అది పఠితలను అనుభూతి గమ్యానికి
చేర్చుతుంది అలవోకగా
- ఎలనాగ, 9866945424