Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాళ్ళు జడివానకు తలలు వాల్చే పైర్లు కాదు
వడిసేల రాళ్ళు వడిగా విసిరి
పంటను కాపాడుకొనే కాపలా దార్లు
చలైనా..పులైనా
కారు చీకట్లైనా..కాటేసే సర్పాలైనా
పంట కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే
వాళ్ళ ఒంటినేం చేయగలవు
చీడ పీడలతో రోజూ చేసే పోరు
చిన్నదే కావచ్చు
బ్రతుకును చిల్లం కల్లం చేసిన ప్రతీసారీ
బరిగీసి బందూకులకు ఎదురు నిల్చిన వాళ్ళు
బ్రతుకు బానిస చెర అయినపుడు
తామే బందూకై మెరిసిన వాళ్ళు
నల్ల చట్టాల నాగుంబాముల్ని మెడలో వేసి
కల్లాకపటమెరుగని కర్షకులను
తల్లడం మల్లడం జేస్తిరి గదా
నాలుక లేని నాగండ్లను నడి బజార్లకీడిస్తిరి
బూదేవంత ఓపికున్నోల్లను
బుధ్ధి లేని మాటలెన్నంటిరి
తీవ్ర వాదులంటిరి
తిన్నదరగనితనమంటిరి
రైతులే కాదంటిరి
రాజకీయాలే అన్నీ అంటిరి
చేల్లను చెమటతో తడిపిన దేహాలపై
నీల్ల ఫిరంగులతో దాడి చేసిన దాష్టీకం మీది
మన్ను లోంచి అన్నం తీసిన పాదాల కింద
ఇనుప మొలలు నాటిన కరత్వం మీది
అసహనపు సెగలు ఆకాశాన్నంటగా
అన్నదాతల దేహాలను వాహనాలతో తొక్కించి
ప్రాణాలు తీసి పరిహాసమాడిన పాపం మీది
చేతిలోని ముద్ద నోట్లోకి పోతున్నప్పుడైనా
చేతులెత్తి మొక్కేందుకు బదులు
చెట్టుకొకల్లను పుట్టకొకల్లను
తరమాలన్న రాక్షస తలంపు మీది
అధికారమూ,ఆయుధాలు
ఆశయాన్ని అదిలించ లేక పోయాయి
అన్నదాతల్ని బెదిరించ లేక పోయాయి
ఇవ్వాల వాళ్ళు
పోరాటానికి కొత్త సాల్లు తీశారు
పొలాలు పాలకుల
మెడలు వంచి కొత్త చరితను రాశాయి
రాజ్యమెంత పొగరు కోరలతో బుసకొట్టినా
రైతుదే విజయం
రైతుదే విజయం
- గాజోజు నాగభూషణం,
9885462052