Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమెలో ఎన్నో ప్రపంచాల్ని చూసాను
అనేకానేక పక్షుల అనంత సంగీతాల్ని విన్నాను
కలల్ని అందంగా సాగు చేయడం
మాటల్ని జలపాతాల్లా దొర్లించడం
వెన్నెల రెక్కలు తొడుక్కుని
పూలతీరాలన్నీ చుట్టిరావడం..
ఎన్నెన్నో నేర్చుకున్నాను
ఆకాశాలన్నీ మూకుమ్మడిగా కలగనే
ఉదయం ఆమె
ఏదో ఒక సమీకరణానికి చిక్కని
గణితవాక్యం ఆమె
ఇప్పుడామె నాతో లేదు
నాలో వుంది
పల్చని ఆకుల్ని
లయాత్మకంగా కదిపే లేత ఎండల్లాంటి
సాయంత్రాల బుగ్గలమీద మెరిసే
నాజూకు వెలుతురు తీగల్లాంటి
అచ్చంగా ఆమె లాంటి..
వాక్యాలను వెదుకుతూ
రాత్రీ పగళ్ళై కదులుతున్నాను
లోపలొక పసివాణ్ణి పెట్టుకుని
గంభీరంగా తిరుగాడేస్తున్నపుడు
పెదవుల మీదకొక చిరునవ్వును లాక్కొని
ఒంటరితనపు ఛాయల్ని దాచుకున్నపుడు
సీతాకోకచిలుకలా
నిశ్శబ్దంగా భుజం మీద వాలిన స్పర్శను
మరో మారు తడిమి చూసుకుందామని
పదాలు పదాలుగా విచ్చుకుంటున్నాను
చూపులలిపిని పరిచయం చేసి
మనసునొక మాధ్యమంగా
మలచుకోవడమెలాగో నేర్పించి
తీరా నేను కవిత్వమయ్యేసరికి
అదశ్యమైపోయిన దయలేనితనాన్ని గురించి
ఎదురుచూపుల భాషలో
రాస్తూ రాస్తూ పుప్పొడిలా రాలుతున్నాను
మనుషులం కనుక
గుండెలు పెనవేసుకున్నవాళ్ళం కనుక
ఒకే ఒక్క చరణంతో
మన వీడ్కోలు పాటముగిసిపోతుందనే దిగులుతో
మరో చరణం కోసం
ఎన్నేళ్లుగానో నిరీక్షిస్తున్నాను
ఒక పలకరింపై ఆమె ఎదురయ్యే క్షణం కోసం.
- సాంబమూర్తి లండ,
9642732008