Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నడూ వినని ఎన్నో దేశీయ భాషలకు
ప్రాతినిధ్యం లభించింది. కొన్ని భాషల్లో
అసలు సాహిత్యమే పెద్దగా లేదు.
కవులే తక్కువ. అయినా వాటికి
ప్రాతినిధ్యం వహించిన కవులు తమ
భాషా సౌందర్యాన్ని కవిత్వం ద్వారా
చాటారు. ఎవరి భాష పట్ల వారికున్న
గౌరవం, ప్రేమ,భక్తి,గర్వం చూస్తే
మనసు ద్రవించింది. పెద్దగా సాహిత్యమే
లేని ఒక భాషా కవి తమ భాషకు
దేశంలోనే కాదు, ప్రపంచమంతా
గుర్తింపు వచ్చే రోజు వస్తుందని
గర్వంగా ప్రకటించాడు. చప్పట్లు
మారుమోగిపోయాయి. లోపలెక్కడో
నాకు తెలుగు పట్ల మనవారి ఉదాసీనత
కలుక్కుమని గుచ్చుకుంది. తమ
ప్రాంతంలో అతిపెద్ద చారిత్రాత్మక
కవితా కార్యక్రమాన్ని నిర్వహించారు
కాబట్టి బోడో భాష నుంచి కొద్దిగా
ఎక్కువమందే అందులో పాల్గొనే
అవకాశం లభించింది.
ఆ అనుభవం అపూర్వం. ఆ అనుభూతి అనిర్వచనీయం. ఆ యాత్ర సఫలం. ఈ జన్మ ధన్యం. నవంబర్ 14.15.16 తేదీలలో అస్సాంలోని బోడో టెరిటోరియల్ సంస్థ ఆధ్వర్యంలో కోక్రాఝార్ పట్టణంలో జరిగిన వంద భాషల అంతర్జాతీయ కవిత్వోత్సవంలో పాల్గొని తిరిగి వచ్చాక మనసు పలికిన నాలుగు మాటలు ఇవి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలుగు నుంచి ఏకైక ప్రతినిధిగా ఆహ్వానం అందుకున్న క్షణం నుంచి హృదమం ఉరకలేసింది. ఎప్పుడెప్పుడా అని మనసు ఆరాట పడింది. 'శాంతి కోసం, ప్రేమ కోసం కవిత్వం' (పోయెట్రీ ఫర్ పీస్ అండ్ లవ్ ) అనే నినాదంతో నిర్వహించబడిన అంతర్జాతీయ కవితోత్సవం ఇది.
నవంబర్ 13న హైదరాబాద్ నుంచి విమానంలో గౌహతి చేరుకున్నాను. మధ్యాహ్నం 12 అయింది. అప్పటికే అతిథి కవుల కోసం వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. దారి పొడవునా అటు ఇటు పెద్ద పెద్ద వృక్షాల నీడలు పరచుకున్న రోడ్డు మీద మా ప్రయాణం చల్లగా సాగింది. కోక్రాఝార్ పట్టణం చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది. ఆ పట్టణం నిండా మూడు రోజులు జరగబోయే కవిత్వం పండుగకు సంబంధించిన బ్యానర్లు, కటౌట్లు, జెండాలు దర్శనమిచ్చాయి. గౌరంగ్ నది మధ్యలో నిూశీవ్తీy ఖీశీతీ ూవaషవ Aఅస ూశీఙవ ు ధగధ్ధగల లైట్లతో ఏర్పాటు చేసిన అక్షరాలను చూసి ఆకాశమే ఆశ్చర్యపడి వుంటుంది, ఇక మేమెంత? ఆ రాత్రికి వారు ఏర్పాటు చేసిన బసలో విశ్రాంతి తీసుకున్నాము. మర్నాడు ఉదయమే ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసిన బోడో కల్చరల్ కాంప్లెక్స్‌కి చేరుకున్నాం. అప్పటికే దేశం నలుమూలల నుంచి పలు భాషల కవులు విచ్చేసి ఉన్నారు. ఉదయం 9గంటలకు కోక్రాఝార్ లిటరరీ ఫెస్టివల్ జెండా వందన కార్యక్రమం జరిగింది. పాటలు, సాంస్కృతిక నృత్యాల కోలాహలంలో ఆ జెండా రెపరెపలాడింది. ఒంటి గంటకు ప్రారంభోత్సవసభ అత్యంత కోలాహలంగా సాగింది. కోక్రాఝార్ ప్రాంతీయ కౌన్సిల్‌కు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రమోద్ బరో, అస్సాం క్యాబినెట్ మంత్రి, ప్రముఖ కవి, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ఉర్ఖావ్ గౌర్ బ్రహ్మ, ఇతర మంత్రులు, స్పీకర్, పలువురు మేధావులు, పెద్దలు కార్యక్రమాన్ని అత్యంత ఉత్తేజ భరితంగా ప్రారంభించారు. ప్రఖ్యాత రాజస్థానీ కవి, రచయిత మీఠేష్ నిర్మోహి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రంగు రంగుల బోడో సాంప్రదాయిక దుస్తులలో పిల్లలు ప్రదర్శించిన జానపద నృత్యాలు, పాటలు ఈ కవితోత్స వానికి అనూహ్యమైన సంగీత సాంస్కృతిక సాహిత్య సమ్మేళనాల సుగంధాలతో వాతావరణాన్ని సిద్ధం చేశాయి.
ఆ తర్వాత అసలు కార్యక్రమం ప్రారంభమైంది. భారత రాజ్యాంగంలో అధికారికంగా గుర్తింపబడిన తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ్, మలయాళీ తదితర భాషల నుంచే కాక, అధికారిక గుర్తింపు లేని అనేక భాషల నుంచి కవులు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి విచ్చేశారు. లింబో, టోటో, నైషి, తివ ,రియాంగ్, గాలో, గరో, కొడవ, కొక్ బరోక్, మంగేర్, రభా, లఢకి, గురుంగ్, దిమస, హజోంగ్, తులు, తడోవ్, కర్బి ఇలా అనేక భాషల నుంచి కవులు ఈ కవితోత్సవంలో పాల్గొన్నారు. కొన్ని విదేశీ భాషల కవులు ఆన్ లైన్ లో పాల్గొన్నారు. ఒక్కొక్క కవికి కనీసం పది నిమిషాలు సమయం కేటాయించారు. వారు ముందు తమ సొంత భాషలో ఒక కవిత వినిపించి, తర్వాత సమయానికి అనుగుణంగా రెండు లేదా మూడు కవితలను ఇంగ్లీష్, హిందీ భాషలలో అనువాదాలు వినింపించాలి. అయితే సమయం తక్కువ, కవులు ఎక్కువ. అందువల్ల ఒకేసారి సమాంతరంగా రెండు వేరు వేరు వేదికల మీద కావ్యగాన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి ఒక సెషన్లో ఒక ప్రముఖుని అధ్యక్షతన కనీసం ఒక పది మంది కవులు వుంటారు. రెండు వేదికలను అద్భుతంగా అలంకరించారు. బహిరంగంగా వేసిన వేదిక అతి పెద్ద రంగుల పందిరి కింద వుంది. రెండవ వేదిక దీనికి కొంచెం దూరంలో ఉన్న ఓపెన్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. కవులు ముందు తమ భాషలో కవితలను వినిపించి, తర్వాత హిందీ, ఇంగ్లీష్ అనువాదాలను వినిపించారు. ఆయా భాషల ధ్వని తరంగాలు, లయ వింటే ఏ భాషకి ఆ భాషే అతి మధురమైనది అనిపించింది. ఎన్నడూ వినని ఎన్నో దేశీయ భాషలకు ప్రాతినిధ్యం లభించింది. కొన్ని భాషల్లో అసలు సాహిత్యమే పెద్దగా లేదు. కవులే తక్కువ. అయినా వాటికి ప్రాతినిధ్యం వహించిన కవులు తమ భాషా సౌందర్యాన్ని కవిత్వం ద్వారా చాటారు. ఎవరి భాష పట్ల వారికున్న గౌరవం, ప్రేమ,భక్తి,గర్వం చూస్తే మనసు ద్రవించింది. పెద్దగా సాహిత్యమే లేని ఒక భాషా కవి తమ భాషకు దేశంలోనే కాదు, ప్రపంచమంతా గుర్తింపు వచ్చే రోజు వస్తుందని గర్వంగా ప్రకటించాడు. చప్పట్లు మారుమోగిపోయాయి. లోపలెక్కడో నాకు తెలుగు పట్ల మనవారి ఉదాసీనత కలుక్కుమని గుచ్చుకుంది. తమ ప్రాంతంలో అతిపెద్ద చారిత్రాత్మక కవితా కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి బోడో భాష నుంచి కొద్దిగా ఎక్కువమందే అందులో పాల్గొనే అవకాశం లభించింది. కాకుంటే బోడో ప్రాంతానికి సంబంధించిన అతిరథ మహాకవులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఇందులో సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు అనిల్ బోరో, సూరత్ నర్జరీ, అస్సాం క్యాబినెట్ మినిస్టర్ ఓర్ఖావో గౌర్ బ్రహ్మ, అంజలి బసుమతారి తదితర బోడో సాహితీ దిగ్గజాలు పాల్గొన్నారు. ఇతర భాషల నుండి కూడా అకాడమీ అవార్డు గ్రహీత లు పలువురు, సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతలు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
1985లో అస్సాం రాష్ట్రానికి చెందిన అనుబంధ భాషలలో ఒకటిగా బోడో భాషకు అధికారిక గుర్తింపు లభించింది. అయితే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 2005లో మాత్రమే ఈ భాషను చేర్చారు. అస్సాంలోని బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతమంతా ఈ బోడో భాష విస్తరించి ఉంది. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ తదితర ప్రాంతాల్లో ఈ బోడో భాష మాట్లాడే వారు ఉంటారు. వలస పాలన కాలంలో ఇంగ్లీష్ వారు తమ క్రిస్టియానిటీ విస్తరణలో భాగంగా బోడో భాషకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటి నుంచి దేవనాగరి లిపిలో అనేక రూపాల సాహితీ ప్రక్రియలలో బోడో ప్రజలు తమ హృదయ స్పందనలను తమ భాషలో నమోదు చేయడం ప్రారంభించారు. ఎంతో తక్కువ కాలంలోనే బోడో భాషా సాహిత్యం అనేక రూపాల్లో విస్తరించింది. మహిళా రచయితలు, కవయిత్రులు ప్రత్యేకంగా సాహిత్య పత్రికలు నడుపుతున్నారు. అలాంటి భాషకు రాజధానిలాంటి కోక్రఝార్ పట్టణంలో లో ఈ వంద భాషల చరిత్రాత్మక కవితా మహోత్సవం జరగడం దేశంలోనే అపూర్వమైనదిగా చెప్పాలి. బోడో ప్రజల సాహిత్యాభిరుచి, సాంస్కృతిక కళారూపాల పట్ల వారికున్న అమితమైన ఆసక్తి అనురక్తి అక్కడకు విచ్చేసిన ఇతర భాషా కవుల అబ్బురపరచింది.
ఇంత విస్తృతమైన విశాలమైన కార్యక్రమాన్ని ఒక పట్టణంలో ఇంత ఆడంబరంగా, ఇంత ఆహ్లాదంగా, ఇంత అనిదంపూర్వకంగా నిర్వహించడంలో కోక్రాఝార్ అధికార ప్రముఖులు, పాలకులు, మేధావులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, వివిధ సంస్థలు, వివిధ కళాశాలల విద్యాలయాల విద్యార్థులు ఎంతో కీలక పాత్ర వహించారు. ఆహూతులైన పలు భాషా కవిపండితులకు ఎక్కడా ఎవరికీ ఏ లోటూ లేకుండా ఈ సంబరాన్ని అంబరాన్ని తాకేలా సాగించడం అసాధారణ విషయం గా అనిపించింది. కవిత్వం ఒక ప్రక్క, మరోపక్క బోడో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, అతిథులను, పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. ఒక సాహిత్య కార్యక్రమానికి ఒక పట్టణమంతా అట్టహాసంగా ఒక చోట జమ కావడం కనీవినీ ఎరుగని విశేషంగా అనిపించింది. పిల్లల నుండి పెద్దల దాకా ఈ కవితోత్సవ కార్యక్రమానికి వచ్చి పలు భాషల కవుల కవిత్వాలను వింటూ కరతాళధ్వనులతో వారి కవితా సౌందర్యాలను ప్రశంసించారు. మధ్య మధ్యలో పిల్లల అపూర్వ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి వినోదించారు. వచ్చిన కవులంతా ఈ కార్యక్రమాన్ని దేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘటనగా వర్ణించారు. ఆ మూడు రోజులూ మీడియా మొత్తం అక్కడే వుంది. వివిధ భాషా కవుల స్పందనను మీడియా రికార్డు చేసింది. లోకల్ మీడియాలో ప్రత్యేక బులిటెన్లు నడిచాయి. లోకల్ పత్రికలు ప్రతి రోజూ విశేషాలను రంగురంగులతో ముద్రించాయి. ఏ రోజు షెడ్యూలు ఆ రోజు పత్రికలు పూర్తి పేజీలో ప్రచురించేవి.
కార్యక్రమంలో రెండవ రోజైన 15వ తేదీన ఉదయం 9:30 సెషన్ లో నా కవితా పఠనం ఉంది. ముందుగా నేను వలస కార్మికుల మీద రాసిన 'ఒక వార్త చెప్పండి' అనే కవితను చదివాను. దానిని మా తెలుగు భాష సౌందర్యం, మాధుర్యం ఎలా ఉంటుందో మీరు ముందు వినండి అని తెలుగులో చదివాను. తరువాత ఆ కవితను హిందీ అనువాదంలో చదివాను. ఆ కవిత తర్వాత ఇటీవల రాసిన 'అమ్మ-నాన్న- ఒక సైకిల్' అనే కవిత, హిందీలో వినిపించాను. ప్రేక్షకుల నుంచి నా కవితలకు మంచి స్పందనే వచ్చింది. బోడో సాహిత్యంలో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రొ|| అంజలి బసుమతారి కార్యక్రమం అనంతరం నా వద్దకు వచ్చి, ' మిస్టర్ మూర్తి, యూ ఆర్ ఏ డిఫరెంట్ పోయెట్, ఐ లైక్ యువర్ పోయిట్ర' అని నన్ను ప్రత్యేకంగా అభినందించారు. 2008లో ఇండోర్‌లో ఆకాశవాణి నిర్వహించిన జాతీయ కవిసమ్మేళనంలో నేను చదివిన పిచ్చినాన్న కవిత అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఆమె నా పేరు సూచించడానికి, నేనీ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి కారణమైంది. తెలుగు భాష నుంచి ఏకైక ప్రతినిధిగా వెళ్లిన నేను తెలుగు సాహితీ వైభవాన్ని అక్కడ సరిగ్గా ప్రదర్శించగలనా లేదా అని కొంచెం ముందు ఆందోళన పడినా, పర్వాలేదు బోడోలాండ్ మీద మన తెలుగు జెండా ఎగరేశానులే అని ప్రేక్షకుల స్పందన తర్వాత ఆనందించాను. కార్యక్రమం రాత్రి ఎంత సేపటి వరకూ కొనసాగినా జనం వస్తూనే ఉన్నారు. ఎక్కడా ఆడియన్స్ కొరత లేదు. ఇది మరీ నన్ను చాలా ఆశ్చర్య పరిచింది. కోక్రాఝార్ ప్రజలలో సాహిత్యం పట్ల, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఎంత ఆసక్తి ఉందో చూస్తే ఈ మెగా ఈవెంట్ మొత్తం సాహిత్య ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందనిపించింది.
కవితా పఠనం సెషన్సు రెండు సమాంతరంగా జరగడం వల్ల ఒక సెషన్లో హాజరైతే మరో సెషన్ మిస్ అవ్వడం జరిగింది. దాని వల్ల కొన్ని భాషల్లోని కవిత్వాలను వినే అదృష్టం దక్కలేదు. అయితే ముందుగానే కవుల నుంచి సేకరించిన అనువాదాలతో ఒక యాంథాలజీ ప్రచురించారు. నిర్వాహకులు చేసిన మహత్తర కృషి ఫలితంగా అనేక భాషల కవుల కవితలను ఒక చోట చదివే అవకాశం మాకు దక్కింది. 'ఖంథాయీ', 'పొయెట్రీ ఫర్ పీస్ అండ్ లవ్' అనే పేరుతో ఈ పుస్తకాన్ని అద్భుతంగా ముద్రించారు. కవుల బయోగ్రఫీ కూడా క్లుప్తంగా వారి వారి ఫొటోలతో పొందుపరిచారు. ఈ అపూర్వ కవితా మహోత్సవంలో పాల్గొన్న అనేక ఇతర భాషల కవులతో మాట్లాడడం, వారితో సాహిత్యం గురించి వారి భాషలో ప్రస్తుత కవితా ధోరణుల గురించి సంభాషించడం నాకు విశేషమైన అనుభవాన్ని ఇచ్చింది. ముఖ్యంగా యువకులు ఈ కార్యక్రమంలో ఎక్కువగా పాలుపంచుకోవడం అందరినీ ఆకర్షించింది. వీలైనంత మంది యువ సాహితీ అకాడమీ పురస్కార గ్రహీతలను నేను కలిశాను. వారు ఏం రాస్తున్నారు, ఏ ధోరణలు ఫాలో అవుతున్నారు, ఎలాంటి విషయాలను స్వీకరిస్తున్నారు, వస్తువుని కవిత్వం చేయడంలో వారి అభివ్యక్తి ఎలా ఉంది, ఇలాంటి విషయాలు నేను వారి అనువాదిత కవితల్ని చూసి, వారితో సంభాషించి తెలుసుకున్నాను. నిజంగా యువకులు సహజంగానే ఆలోచనల్లోనూ అభివ్యక్తిలోనూ వస్తు స్వీకరణ లోనూ పెద్దల కంటే కొంచెం ముందే ఉన్నారు అనిపించింది. ఎవరూ ఎక్కడా తక్కువగా లేరు.
నవంబర్ 16 సాయంత్రానికి కార్యక్రమం ముగిసింది. బోడో ప్రభుత్వ పెద్దలు ఇందులో పాల్గొన్నారు. వచ్చిన వివిధ భాషా కవులు వేదిక మీదే కాక, అక్కడికి వచ్చిన మీడియా మిత్రులతో కూడా తమకు అద్భుతమైన సత్కారం జరిగిందని చెప్పారు. ఇలాంటి అనుభవం తాము మునుపెన్నడూ పొందలేదని ఇక్కడి విద్యార్థుల నుంచి నాయకుల దాకా తమకు అందించిన మర్యాద, గౌరవం, గొప్ప ఆతిథ్యం తాము మునుపెన్నడూ అందుకోలేదని ముక్తకంఠంతో చెప్పారు. నాది కూడా అదే అభిప్రాయం. అన్ని దేశీయ మారుమూల భాషల కవులను ఒకచోట చేర్చి అంత అంగరంగ వైభవంగా ఒక కవితా ఉత్సవాన్ని నిర్వహించడం కనీసం నేను ఎన్నడూ వినలేదు. నా సాహిత్య యాత్రలో ఇదొక మరపురాని మధురమైన సువర్ణ స్మృతిగా మిగిలిపోతుంది అనుకుంటున్నాను. ఇతర భాషా కవులతో సంభాషించినప్పుడు మనం ఏమిటి? మన రచనలు ఏమిటి? మనం ఎక్కడ ఉన్నాం? ఇలా అనేక విషయాలకు, ప్రశ్నలకు సంశయాలకు, సమాధానాలు దొరుకుతాయి . 16వ తేదీ ముగింపు కార్యక్రమం తర్వాత అక్కడ మాకందరికీ అపూర్వమైన ఆతిథ్యాన్ని ఇచ్చిన ప్రముఖులనందరినీ, మిత్రులందరినీ కలిసి తిరుగు ప్రయాణానికి సిద్ధమైనప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ సాంస్కృతిక సాహిత్య వేదికలను, కవిత్వంతో మారుమోగిన ఆ వాతావరణాన్ని, భారతీయ భాషా ధ్వనులతో లయలతో కలబోసుకున్న అక్కడి గాలిని, చెట్లను, నిత్యము అనుక్షణం నవ్వుతూ మమ్మల్ని అల్లుకుపోయిన అక్కడి అందమైన విద్యార్థినీ విద్యార్థులను వదలలేక వదలలేక ఇంటి ముఖం పట్టాము. మన తెలుగు భాష ఆధ్వర్యంలో కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమం జరిగాలని, అది నేను కళ్ళారా చూడాలని మనసంతా కోరిక పుట్టింది.
ఆ రాత్రే నేపాలి యువ కవి మహేష్‌తో కలిసి నేను డార్జిలింగ్కి వెళ్లాను. అక్కడ నేపాలీ కవులు,రచయితలు చాలా మందిని కలిశాను. మహేష్ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో నాకొక చిన్న సన్మానం కూడా జరిగింది. ఒక కవిత ఇంగ్లీషు అనువాదంలో వినిపించాను, పిల్లలు తర్వాత చుట్టుముట్టారు. ఫోటోలు దిగారు. 19వ తేదీ ఉదయం చలిలో వణుకుతూ వెచ్చని డార్జిలింగ్ జ్ఞాపకాలను, కోక్రాఝార్ సాహితీ సుగంధాలను గుండెల నిండా నింపుకుంటూ ఇంటికి తిరుగు ప్రయాణం కట్టాను. రాగానే యాత్ర సఫలం జన్మ ధన్యం అని అని అనుకున్నా. ఈ వారం రోజుల నా సాహిత్య యాత్ర నా జీవితంలో ఒక మరపురాని సాక్షర స్మృతిగా నిలిచిపోతుంది.