Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిండు హరివిల్లులాంటి యిల్లు
వడలిపోయిన మల్లెదండలా మిగిలింది
వంకర నెలవంకను
సాపుచేసే ప్రయత్నంలో తారలు
ఉట్టిమీదకి
ఎక్కుతున్న కిరణాల పాదాలతో
సాలీడులా గూడు అల్లే సూర్యుడు.
మేఘాన్ని పిండి
చీకటిని జల్లించిన నక్షత్రాలు
లోలక సవ్వడిలో
నీటిపై వణుకుతున్న చంద్రుడు
నదిని దాటే మార్గమేది.
ఆకాశ దండెమ్మీద
ఆరేసిన సిందూర చీరకు
ఎగిరే పావురాయి చిల్లులు పెట్టినట్లు
మనసు ముళ్ళకంపమీద పడి చిరిగిపోయింది
వడ్డించిన వేడి యిడ్లీల కింద
ప్రేమగా కమిలిపోతున్న
లేత అరిటాకులా వుంది జీవితం
గాజు టీ గ్లాసు మట్టు గీసిన
సున్నాలో చిక్కుకున్న మంచుబిందువుల మెరుపులా వుంది కాలం.
నెమలీక వంధ్య
ఎంతకీ పిల్లల్ని పెట్టదు.
గోవుకంటి నీటిచారికలా
గోదారి పిడచకట్టుకుని వుంది
కొండంచుల్ని ఒరుసుకునే మేఘంలో
చేతికందేంత జలపాతం ఎగురుతూనే వుంటుంది.
తిరగని పంకాని కర్రతో తిప్పినట్టు
కురవని మేఘాన్ని కదిలించే దండం కావాలి.
ముక్కనుమ నాటికి
ఆరిపోతున్న భోగిమంటలాంటి దిగులును
రథం ముగ్గుల్లో మనసును దాటించాలిప్రాణాన్నిచ్చి వదిలిన గాలిని పీల్చే చెట్టులా
వెలుతురిచ్చి చీకటిని దాచుకునే అమ్మలా
ఎప్పటికీ తోడుండేది మనకు మనమే ..!
- ర్యాలీప్రసాద్, 9494553425