Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహితీ వనంలో సిరివెన్నెలలు పూయించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి 1955 మే20న విశాఖ జిల్లా అనకాపల్లిలో డాక్టర్ సినీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. ఈయన తన బాల్యం నుంచే చాలా చురుకుగా ఉండేవారట. అనకాపల్లిలో పదవ తరగతి కాకినాడలో ఇంటర్, బి ఏ, విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ పట్టభద్రులయ్యారు. చెంబోలు సీతారామశాస్త్రి మొదట భరణి అనే కలం పేరుతో కవితలు రాసేవారు ఆ క్రమంలోనే గంగావతరణం అనే కవిత చదివిన దర్శకుడు కె. విశ్వనాథ్ ఆయన సిరివెన్నెల సినిమాలో పాటలు రాయడానికి అవకాశం ఇచ్చారు. అలా జననీ జన్మభూమి సినిమాతో ఆయన కెరీర్ ప్రారంభమైంది. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల చిత్రంతో ఈయన పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అదే ఆయన ఇంటి పేరుగా మారింది. అలా మూడు తరాల వారికి ఆయన బాణీలు కట్టారు.
'విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం' (సిరివెన్నెల) అనే పాటతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. కె విశ్వనాథ్‌తో అన్ని సినిమాలకు పనిచేశారాయన.
'ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది' (సిరివెన్నెల)
ఇలా ఏ పాట రాసిన అది ఆణిముత్యమే. ఆయనకు భార్య పద్మావతి. కుమారులు రాజా, యోగేష్‌లు ఉన్నారు.
'ఘళ్ళు ఘళ్ళు ఘళ్ళు మంటూ మెరుపల్లె తుళ్ళు,
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు' అని పాడినా
'నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను' (రుద్రవీణ)
'ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేర దీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా' (వర్షం)
'తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా' (రుద్రవీణ)
ఇలా ఎలాంటి శృంగారభరిత గేయాలనైనా రాయడంలోనూ అందెవేసిన చెయ్యి ఆయనది. ఈ పాటలో చెప్పలేని జాలువారిన ప్రేమ, చిలిపితనం, అభిమానం కనిపిస్తాయి.
'నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు' (అల వైకుంఠపురం)
'సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు' (శుభ సంకల్పం)
ఇలా మూడు దశాబ్దాలుగా రాణించారు. అలనాటి దర్శకులకు, నేటి కొత్త తరం దర్శకులకూ పండువెన్నెల అయ్యారు - సిరివెన్నెల అయ్యారు.
'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం (గాయం)
'సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ
సుఖాన మనలేని వికాసం ఎందుకని
నిజాన్ని బలికోరే సమాజం ఎందుకని
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం' (గాయం)
'అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని
స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా
శాంతి కపోతకు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం' (సింధూరం)
ఇలా ఆవేశపూరితమైన మాటల తూటాలతో సమాజాన్ని తూర్పారబట్టారు. సిరివెన్నెల తనలో ఘనీభవించిన ఈ అగ్ని ఏ విప్లవకారునిలో, ఏ సంఘసంస్కర్తలో రగిలినా, తనతో పాటు ఈ దేశం కూడా మారగలదని భావించాడు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మారని మానవుని గురించి ఆవేదన చెందాడు.
'ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ' (మహాత్మా)
ఇలాంటి ఎన్నో పాటల ద్వారా దేశభక్తికి ఏతాము ఎత్తింది ఆయన కలం.
'అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా' (పవిత్ర బంధం)
ఆడ జన్మకు అర్థం చెప్పిన పద మాంత్రికుడు మన సిరివెన్నెల.
'చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్ని అంది మనీ మనీ' (మనీ)
మనీ ఎంత పని చేస్తుందో, ఆ మనీ మనిషిని అందలం ఎలా ఎక్కిస్తుందో ఎంతో గొప్పగా వివరిస్తుంది ఈ పాట. ఇలా ఏ కోవకు చెందిన పాటలైనా అలవోకగా రాసేవారు. విలక్షణత సౌమ్యత ఆయన సొంతం. సామాన్య విషయాన్ని కూడా అవలీలగా రాయడమే కాక సంగీతపరమైన పాటలను కూడా అత్యంత సులభశైలిలో రాయగల దిట్ట. 165 సినిమాలకు పైగా పాటలను అందించారు. మూడు వేలకు పైగా పాటలు రాశారు. ఎందరో నిర్మాతలకు కాసులు కురిపించిన సినిమాలెన్నో ఉన్నాయి. హీరోలందరితో కలిసి పని చేశారు.
'ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించ వద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా '(పట్టుదల)
ఇలా పట్టుదలతో ఏ పని అయినా సాధించవచ్చని ప్రేరేపించారు కాగా ఈ పాటే ఆయన పాడుకున్న చివరి పాట కావడం విషాదకరం.
ఈ పాటలో ''నిషా విలాసం ఎంత సేపు రా, ఉషోదయాన్ని ఎవరు ఆపురా'' అన్న ఈ గేయ పాదాలు ఎందరికో స్ఫూర్తి దాయకం అయ్యాయి. ఇంతటి గొప్ప పాటల సంచారి సిరివెన్నెల గారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బంధువు. కృష్ణవంశీ విశ్వనాథ్ త్రివిక్రమ్ లాంటి దిగ్గజ దర్శకులతో పని చేసిన అనుభవం వీరిది. అందరినీ తనతో కలుపుకునే మనస్తత్వం ఆయనది.
'జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే' ( చక్రం)
ఇలా వేటూరి, ఆత్రేయ లాంటి దిగ్గజ కవీంద్రులులతో సమానంగా పాటలకు బాణీలు కట్టగల టాలీవుడ్ గొప్ప గేయరచయిత మన సిరివెన్నెల.
'తెల్లారింది లెగండోరు కొక్కొరోకో, మంచాలింక దిగండోరు కొక్కొరోకో
పాము లాంటి చీకటి పడగ దించిపోయింది, భయం లేదు భయం లేదు నిద్ర ముసుగులు తీయండి,
సావులాంటి రాతిరి చూరు దాటిపోయింది' (కళ్ళు 1988)
అంటూ మనందరినీ నిద్ర మేల్కొలిపి తరలిరాని లోకాలకు సిరిమల్లెలు మనకు మిగిల్చి శాశ్వతంగా కన్నుమూసారు ఆ సిరి వెన్నెల. 2019లో పద్మశ్రీ అవార్డు, 11 నంది పురస్కారాలు, నాలుగు సార్లు ఉత్తమ గేయ రచయితగా పురస్కారాలు పొందిన మన సిరి వెన్నెల చంద్రబోస్ అనంతశ్రీరామ్ రామజోగయ్య శాస్త్రి లాంటి వారికి స్ఫూర్తిదాయకమైనారు. నిమోనియాతో బాధపడుతూ 30 నవంబర్ 2021 నాడు సాయంత్రం నాలుగు గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
చివరగా నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరారు సినిమాలో రెండు పాటలు రాశారు అవే చివరి పాటలు కావడం విషాదకరం. ఎస్పీ బాలసుబ్రమణ్యం (గళం) కోల్పోయిన సంవత్సరంలోపే సిరివెన్నెల (కలం) కోల్పోవడం అశనిపాతమే అయ్యింది తెలుగువారికి.
తెలుగు సాహిత్య వనంలో సిరులోలికించినా, వెన్నెల కురిపించిన నీకు నీవే సాటి ఓ సిరివెన్నెల. తెలుగు పాటకు ఒక తివాచీపరిచి అక్షర భారతికి వెన్నెలలు కురిపించిన మన తెలుగు వాడివి నీవు...
- డాక్టర్ ప్రశాంత్ చారి, 7306381805