Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత రాస్తున్నాను
ఉయ్యాలను వదుల్త లేదు
ఉద్యమం సిరా-
బొమ్మలు గీస్తున్నాను
బావి గడ్డ మీద మనసుపడ్డవి
గాలి రంగులు-
పాట ఎత్తుకున్నాను
పొలం గట్లను మోహిస్తున్నవి
నీటి సరిగమలు-
కథ మొదలేసుకున్నాను
గడ్డిమోపులను ముద్దాడుతున్నది
రేలపూత ఎత్తుగడ-
ఎదురుదెబ్బల దిగులు పట్టుకుంది మనోపేటికి
ఆశయాలను సుశిక్షితులను చేస్తున్నవి
అమ్మ అరచేతి గీతలు
దేవుని దుగుడు దులుపుతున్నాను
పొదుపుకు ఆనవాళ్లవుతున్నవి
నాయనమ్మ దాచిన మర చెంబూ రాగిపైసలు-
మునుపటి సంబంధాల్ని నెమరేస్తున్నాను
పిందెదిగి కళకళలాడుతున్నది
గోలెం దగ్గరి చెట్లపాదు-
పెద్ద సందుగ పెట్టె సర్దుతున్నాను
స్టేజీ దగ్గర బస్సుదిగి
తాత పొషాగ్గా గొడుగు తలతో ఇంటి కొస్తున్నాడు
నా డేట్ ఆఫ్ బర్త్ ను ఖరారు చేసే ఒక ఫోటోలో-
గొర్లు తిరిగొచ్చిన బీడే
అయ్య మల్లేసిన పొద్దు-
పనమటి కొండల వెంట కాపీలకొచ్చిన నెమలీకే
మా ఊళ్లో మొలిచిన బీజాక్షరం-
జలలు అడుగంటి బతుకు వొరుగైతున్నప్పుడు
ఇజ్జత్ ఈమాన్ నిలిపిన మూడొందలరూపాల చిన్న కొలువే
మా ఇంట్ల మెరిసిన దోర్నంతాడు-
చొప్పగూళ్లు కుదిర్చిన స్నేహం
రాత్రి మిద్దె మీద కొలువుదీరిన నిండుపున్నమి-
అమ్మమ్మ పంపిన బొంగులు పుట్నాలే
రామలింగాల స్వామి విరాట్ రూపం-
దీపాలి వానలకు పూసిపారిన కేంపు చెరువే
సంకురాత్రికి వండుకున్న పులగం-
అది పాఠమో జీవితమో భాగించలేని విభాజకం
గడిసింతకాడి భూస్వామి నాటకం-
అవి ఎడ్లో దోస్తులో చెప్పతరంగాని అభేదం
మట్టిబండ్ల వీరగాథ-
ఇన్ని రుచిర దశ్యాల్ని ఒడ్లగుమ్మిలో నింపిన కాలం
ఇప్పుడు ఔటరెక్కి విమానంలో కూసుంటుంటే
బాల్యాన్ని దేంట్లో ప్యాక్ చెయ్యాల్నో
సమజైతలే
బుర్రలో రివ్వుమంటున్న
రింగనబురుక్కు.
- డా బెల్లి యాదయ్య
9848392690