Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరుములు, మెరుపులు లేని
నిశ్శబ్దపు చీకటి రాత్రి
విశాల ఆకాశంలో బందీ అయిన పావురం ఒకటి-
నేను స్వేచ్ఛగా విహరిస్తున్న గది కిటికీ దగ్గర వాలింది.
దానిపై జాలితో చేయి సాచి ఆహ్వానించా, నాలోకి.
మనుషుల్ని మనుషులే నమ్మని ఈ కాలంలో..
ఓ పక్షి మాత్రం మనల్నెలా నమ్ముతుంది?
పంచభూతల ప్రకతి ఇంద్రజాలంలో
వసంతకాలం ఓ వసివాడని మాయాజాలం
తేనెను గ్రొలే తుమ్మెద పూల చుట్టూ భ్రమించినట్టు
ఆశను ఆకాంక్షిస్తూ రుతువుల చుట్టూ తిరుగుతాం
ఒక పువ్వుకు జన్మనివ్వటం కోసం..
ఎన్ని ఆకులనో రాల్చుకుంటుంది చెట్టు
ఒక్క చిరునవ్వు చిందించడం కోసం..
ఎన్ని కన్నీళ్లనో దిగమింగుతుంది మానవాళి
ప్రతి రేయీ కొత్త వేకువను స్వప్నిస్తూ నిదురిస్తా..
కిటికీలోంచి కలలోకి ప్రవేశిస్తుంది పావురం
భుజంపై శాంతిని మోస్తూ,
విశ్వమంతా విశ్వాసం పంచుతూ..
ఇక ప్రతి రాత్రీ విహరిస్తూనే వుంటా.
- దేశరాజు