Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనాటి ఆలోచనాపరులందరినీ, ఉద్యమజీవులందరినీ కల్లోలపరుస్తున్న అత్యవసరమైన సామాజికాంశాల మీద వరుసగా రెండు మూడు సాంద్రమైన కవితలతో కవిత్వాభిమానులందరినీ ఆకర్షించిన పేరది.
ఒక పీడిత అస్తిత్వ నేపథ్యం నుంచి, కార్మిక జీవిత, కార్మికోద్యమ జీవిత భూమిక నుంచి, విప్లవోద్యమ
దృక్పథంతో బలమైన మరొక గొంతు కవిత్వావరణంలో ప్రవేశిస్తున్న దని గొప్ప వాగ్దానం చేసిన పేరది.
ఏకకాలంలో అద్భుతమూ, హృదయ విదారకమూ, భావస్ఫోరకమూ, సమస్త చరిత్ర సారమూ అయిన 'నాది దుఃఖం వీడని దేశం' అనే శీర్షికతో వెలువడుతున్న హనీఫ్ కవిత్వానికి నిజానికి ఎవరి ముందుమాటా అవసరం లేదు. ఈ కవితలన్నీ మన సామాజిక అవ్యవస్థకు దర్పణాలు. ఆ అసందర్భ, అస్తవ్యస్త సామాజిక వ్యవస్థ మీద కవి ఆగ్రహ ప్రతిఫలనాలు. సాంద్ర తాత్విక వ్యక్తీకరణలు. తాత్వికతా కవితా కలగలిసిన తాత్వికవితలివి. ప్రతి కవితా పాఠకులకు ఇప్పటికి తెలియని ఒక సామాజిక దృశ్యాన్నో, లేదా తెలిసిన దృశ్యంలోనే గమనించని కోణాన్నో పట్టుకుని, కళాత్మక సాధారణీకరణతో ఆలోచనలు రేపి, తాత్విక దృక్పథం అందించి అవగాహనను ఉన్నతీకరిస్తుంది.
ఆదివాసీలు, దళిత బహుజనులు, స్త్రీలు, ముస్లింలు, ఇతర మైనారిటీ మతస్థులు, అణివేతకు, పీడనకు గురవుతున్న ప్రాంతీయ భాషా సమూహాలు, ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దేశంలోని సమస్థ పీడిత అస్తిత్వాలూ తమలో తాము అనుకోదగిన మాట 'నాది దు:ఖంవీడని దేశం'
దాదాపు ముప్పై ఏండ్ల వెనుక, 1980ల చివరలో, 90ల మొదట్లో, హనీఫ్ పేరు మొదటిసారి విన్నాను. ఆనాటి ఆలోచనాపరులందరినీ, ఉద్యమజీవులందరినీ కల్లోలపరుస్తున్న అత్యవసరమైన సామాజికాంశాల మీద వరుసగా రెండు మూడు సాంద్రమైన కవితలతో కవిత్వాభిమానులందరినీ ఆకర్షించిన పేరది. ఒక పీడిత అస్తిత్వ నేపథ్యం నుంచి, కార్మిక జీవిత, కార్మికోద్యమ జీవిత భూమిక నుంచి, విప్లవోద్యమ దృక్పథంతో బలమైన మరొక గొంతు కవిత్వావరణంలో ప్రవేశిస్తున్న దని గొప్ప వాగ్దానం చేసిన పేరది. తర్వాత గడిచిన మూడు దశాబ్దాలలో హనీఫ్ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం, మెరుగు పరుచుకోవడం మాత్రమే కాదు, తనను తానే అధిగమించుకునే నిరంతర కవిత్వాన్వేషణలో, అభివ్యక్తి నవ్యతలో కొనసాగుతున్నాడు. ముప్పై ఏండ్లలో వెలువడినవి మూడు సంపుటాలే అని చూస్తే రాస్తున్నది తక్కువ అనిపించవచ్చు గాని రాసిన వాటికన్న సంపుటాలుగా తెచ్చినవి తక్కువ. ఎప్పుడూ రాశి అంత ప్రధానం కాదు, రాసిన ప్రతిదీ ఎంత చిక్కగా ఎంత కొత్తగా రాస్తున్నాడనేదే ఒక కవి శిఖరారోహణకు ప్రమాణం. ఆ శిఖరారోహణ ప్రయాణంలో ఉన్నందువల్లనే ఇరవై ఐదు ఏండ్ల తర్వాత మూడో సంపుటం ప్రచురిస్తున్నప్పటికీ హనీఫ్ తెలుగు కవితావరణంలో ఎన్నదగిన మంచి కవిగా గుర్తింపు పొందాడు.
నాది దుఃఖం వీడని దేశం అనే పదబంధమే బహుళార్థ బోధకమైన కవితావాక్యమని నాకనిపిస్తున్నది. ఆ నాలుగు పదాలూ విశాలమైన అర్ధానికి, అర్థాలకు చిహ్నాలు. ప్రతి పదమూ, మొత్తంగా పదబంధమూ ఎంతో వివరణకూ విశ్లేషణకూ అవకాశం ఇస్తాయి.
ఇది దేశమో, దుఃఖం వీడని దేశమో గాని 'నాది' అని నొక్కి చెప్పడం ఒక విస్పష్ట, నిర్దిష్ట, అసందిగ్ధ ప్రకటన. అందులోనూ కొందరిని ఉద్దేశించి ''ఇది నీది కాదు'' అని చెప్పడానికి విష విద్వేష రాజకీయాలు కుటిలయత్నాలు చేస్తున్నప్పుడు, నాది అని బలంగా దిక్కులు పిక్కటిల్లేలా చెప్పవలసి ఉంది. ఎప్పటి నుంచో దుఃఖాన్ని వీడడానికి పెనుగులాడుతున్నప్పటికీ ఇప్పటికీ ఈ దేశం ఇంకా దుఃఖాన్ని వీడలేదనేది ఒక చారిత్రక వాస్తవం. ప్రపంచీకరణ జిలుగు వెలుగులలో, అంకెల గారడీలలో కళ్లు మిరుమిట్లు గొలిపో, లేదా ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకునో, ఈ దేశంలో దుఃఖమే లేనట్టు నటిస్తున్నవారు ఉన్నచోట, దుఃఖం వీడని దేశం అని గట్టిగా చెప్పవలసి ఉంది. అలాగే నాది దుఃఖం వీడని దేశం అన్నప్పుడు, దుఃఖభరితమైన దేశంలో నేనొక భాగం అనేది మరోక అర్థం. ఆదివాసులు, దళిత బహుజనులు, స్త్రీలు, ముస్లింలు, ఇతర మైనారిటీ మతస్తులు, అణచివేతకూ పీడనకూ గురవుతున్న ప్రాంతీయ, భాషా సమూహాలు, ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దేశంలోని సమస్త పీడిత అస్తిత్వాలూ తమలో తాము అనుకోదగిన మాట అది.
నాది దుఃఖం లేని, దుఃఖం వీడిన దేశం కావాలి అనే ఆర్తినీ, ఆక్రోశాన్నీ, ఆకాంక్షనూ వ్యక్తం చేయడానికి మొదటి అడుగు అది. ఆ ఆకాంక్ష నుంచి పెల్లుబికే ఆగ్రహాన్ని బహిరంగంగా ఎలుగెత్తి, ఆ దుఃఖాన్ని రద్దు చెయ్యడానికి జరిగే ప్రయత్నంలో చెయ్యీ చెయ్యీ కలపవలసిన సందర్భం ఇది. ఆ సకల పీడిత అస్తిత్వాల దుఃఖాన్ని తన స్వరంలో వ్యక్తీకరిస్తూ, మూర్తీభవిస్తూ హనీఫ్ ఇక్కడ ఆ మాట అంటున్నాడు.
ఒక ముస్లింగా, ఒక తెలంగాణ బిడ్డగా, ఒక కార్మికుడిగా, ఒక అడవి అంచు గ్రామవాసిగా, ఒక చైతన్యవంతమైన బుద్ధిజీవిగా, ఒక కార్మికోద్యమ, విప్లవోద్యమ ఆవరణలోని వ్యక్తిగా హనీఫ్ కు 'నాది దుఃఖం వీడని దేశం' అనడానికి పూర్తి అరÛత ఉంది, అధికారం ఉంది.
అది కేవలం యథాస్థితి గురించిన ప్రకటన కాదు, అయ్యో అయ్యో అనే ఆక్రోశం కాదు, విలాపం కాదు, అది ఆ యథాస్థితిని మార్చవలసిన అవసరం ఉందని ఎరుక కలిగించే యుద్దారావం. అది యుద్దారావం కావాలంటే ఆ దుఃఖాన్ని వివరించడమూ, విశ్లేషించడమూ, దుఃఖ కారణాలను ఎత్తిచూపి, దుఃఖాన్ని రద్దు చేయాలనే కోరికను పఠితల్లో రగుల్కొల్పడమూ చెయ్యాలి. అందుకే ఆ శీర్షికకు తగినట్టుగానే లోపల ప్రతి ఒక్క కవితా ఒక దుఃఖమయ జీవన పార్శ్వా న్ని చిత్రిస్తుంది.
ఈ సంపుటంలోని ప్రతి కవితనూ విశ్లేషించి హనీఫ్ ప్రతిభను, కవితాశక్తిని ప్రదర్శిం చాలని నాకుంది గాని, ముందు మాట స్థూల పరిచయంగానే ఉండి, సూక్ష్మాంశాలను చదు వరుల ఊహాశక్తికి వదిలె య్యాలనే ఆలోచనతో క్లుప్తంగానే వివరించ దలిచాను. ఈ సంపుటం లోని మొత్తం కవితలు ముస్లిం జీవితం, తెలం గాణ, కశ్మీర్, ఆదివాసులు, రైతాంగం, పోలవరం, రాజ్యహింస, ప్రకృతి, ప్రజా ఉద్యమాలు, అమరత్వం, నగర జీవితం వంటి అనేక వర్తమాన సామాజిక ఇతివృత్తాలను వ్యక్తీకరిం చాయి గాని, ప్రధాన ఇతివృత్తాల్లో మొట్ట మొదట చెప్పుకోవలసింది ముస్లిం జీవిత వ్యథార్థ జీవిత యథార్థ దృశ్యాన్ని హనీఫ్ విభిన్నంగా, వైవిధ్యభరితంగా, ఆర్ధంగా, విశిష్టంగా చిత్రించిన సంవిధానం. అది ఒక్కటే ప్రధానంగా చెప్పి, మరి కొన్ని కవితలను ప్రస్తావించి, మిగిలిన కవితలను మీ పఠనానికీ, విశ్లేషణకూ వదిలేస్తాను.
ఈ సంపుటంలో దాదాపు నాలుగో వంతు కవితలు - పన్నెండు పదమూడు దాకా - వేరువేరు ముస్లిం జీవిత పార్శ్వాల్ని ప్రదర్శించాయి. ఒకే సంపుటంలో ఒకే ఇతివృత్తం ఇన్నిసార్లు మళ్లీ మళ్లీ వచ్చినప్పటికీ అది పునరుక్తి అనిపించకుండా చేయడంలోనే హనీఫ్ ప్రతిభ ఉంది. అలా పునరుక్తిలా అనిపించకుండా చూడడానికి హనీఫ్‌కు ప్రత్యేమైన కవితా నిర్మాణం ఉంది. ప్రతి వస్తువునూ, దాని ముస్లిం నేపథ్యంలో ఉంచుతూనే, భిన్నమైన దృశ్యాలు కట్టాడు. అంటే అత్యవసరమైన సారాన్ని అలాగే ఉంచుతూ, దానికి ఉన్న అనేకానేక రూపాలను వ్యక్తీకరిస్తూ రూపసారాల గతితార్కిక సామ్యభేదాలను చూపాడు. తగినంత పురాస్మృతినీ వర్తమాన విషాదాన్నీ కలగలిపాడు. దాదీ మరణ సందర్భంలో విషాద వాతావరణంలో సహజంగా తోసుకొచ్చే పాత జ్ఞాపకాలను తడుముతూనే, సమకాలీన చిత్రాలతో పోలికలు తెచ్చి ఆ
జ్ఞాపకాలను సార్థకం చేశాడు. ఒక ముస్లిం వృద్ధురాలి చివరి వీడ్కోలు సందర్భంలో 'ముళ్ల కిరీటం', 'రక్తం ఓడుస్తున్న జీసస్ పునరుత్థాన వాగ్దానం' వంటి భిన్న, అసాధారణ ప్రతీకలను వ్యక్తీకరిస్తూనే, 'ముడుపు కట్టిన పీరీలు', 'మగరీబ్ నీడ', 'గజల్ ఒడి', 'మఖమల్ దారపు సోయగం', 'కల్మా' వంటి ముస్లిం ప్రతీకలనూ కలగలిపి 'తెగిన ఏక్ తార'ను పాఠకుల కళ్ల ముందు దృశ్యమానం చేస్తాడు, దాదీ పాడిన గజల్ వినిపించేలా చేస్తాడు.
ఒక నేపథ్యపు ప్రతీకను ప్రయోగించడం మాత్రమే ముఖ్యం కాదు, ఆ ప్రతీకను ఏ ప్రయోజనం కోసం వినియోగి స్తున్నావు అనేది ముఖ్యం. ఆ ప్రయోజన స్పృహ, స్పష్టత సమాన నేపథ్యంతో రాస్తున్న కవులకన్న హనీఫ్లో ఎక్కువగా ఉందని ఈ సంపుటంలోని ముస్లిం నేపథ్య కవితలన్నీ చూపుతాయి. ఈ ముస్లిం జీవిత నేపథ్యం తన వయ్యక్తిక, ఏకాంత, ఏకైక అనుభవం మాత్రమే కాదు, దాన్ని సాధారణీకరించడానికి, సామాజికం చేయడానికి ప్రయత్నించడంలో కూడా హనీఫ్ విశిష్టత ఉంది. ప్రత్యక్ష, పరోక్ష సంఫ్‌ు పరివార్ ప్రభావాల వల్ల సామాజికంగా ముస్లింల మీద ఏర్పడి ఉన్న దురభిప్రాయాలను బద్దలు కొట్టడానికి ఇందులో కొన్ని కవితలు ప్రయత్నిస్తాయి. ముస్లింలంటే రాజులూ పాలకులూ అనేది అటువంటి ఒక సాధారణ దురభిప్రాయం.
దాన్ని తోసివేస్తూ, హనీఫ్ ముస్లిం జీవితపు 'నసీబు దున్నని బీడు పడ్డ భూమి'లా ఉందంటాడు. ముస్లింలు కూడా 'గడీల ముందు నెత్తిన రుమాలు తీసి, చెప్పులిడిసి, పేదలందరిలాగే చేతులు కట్టుకుని నిలబడ్డవాళ్లే' నంటాడు. 'హలాల్ చేయబడుతున్న పశువుల్లా గిలగిలా తన్నుకున్నోళ్లే నంటాడు. పీడకలల్ని నెత్తినెత్తకండి' అని ఆగ్రహ ప్రకటన చేస్తాడు.
ముసలి షేక్‌ల దుర్మార్గాలకు బలి అయిపోతున్న పేద ముస్లిం పసిమొగ్గల గురించి ఎందరో రాశారు. కాని హనీఫ్ అటువంటి కేవల సానుభూతి కన్నీళ్ల కవిత్వం రాయడు. భిన్నమైన వ్యక్తీకరణలో ఆ సమస్యకు ఉన్న రాజకీయార్థిక, సామాజిక కోణాన్ని పాఠకులకు పరిచయం చేస్తాడు. షేక్ లకు బలిపశువులుగా తరలివెళ్తున్న చిన్నారి ఫాతిమాలు ఏ వర్గాల పిల్లలో వివరిస్తాడు. వాళ్లు రిక్షా కార్మికుల, పారిశుధ్య కార్మికుల, దర్జీల, పాచిపనులు చేసుకునేవాళ్ల కుటుంబాల నుంచి, అటువంటి సహస్ర వృత్తుల సమస్త రంగాల నిరుపేద కుటుంబాల నుంచి వస్తున్న పసిపిల్లలు. ఆ సామాజిక దృశ్యాన్ని వివరిస్తూ, 'మనిషిని దాటిన గోడలు రక్షణ కోసమేనని భ్రమలు పాతుకుపోవడం ఎంత దయనీయం' అని ఒక తాత్విక స్థాయిలో కొత్త వెలుగు ప్రసరించి, అనేక పొరల అర్థాలకు, అన్వయాలకు అవకాశం ఇస్తాడు.
'దస్తర్ ఖాన్ చుట్టూ చేరిన ఖాన్ దాస్ కడుపు నిండిన తల్లి చూపులు ఇళ్లు ఎవరివైనా తలుపు దగ్గర అమ్మ ప్రతిముంటది' అని ఒక ఆర్ధమైన, తాత్విక వ్యక్తీకరణనూ, 'మగరీబ్ కా ఆజా చిన్న పిల్లలకు ఆకలిని గుర్తు చేసే సైరన్లా వినిపిస్తుంది కూలిన మసీదు గోడల శిథిలాల నుంచి అజా పీడిత జాతి ఆక్రందనలా వినవస్తుంది' అనీ, 'మసీదులు బాంబుల కార్ఖానాలు కావు పావురాలు ప్రేమ కబుర్లు చెప్పుకునే స్థావరాలు' అనీ.
'మా ప్రతి వాడా ఓ శ్రమ పనిముట్ల కార్ఖానా చెమట సుగంధం వీచే నైట్ క్వీన్ పొద' అనీ నిత్య జీవితం నుంచీ, వేదనాభరిత వాస్తవికత నుంచి తాత్విక సాధారణీకరణలు చేస్తాడు.
జీవితంలో మామూలుగానే అనేక అంతరాలూ, అస్తవ్యస్తతలూ ఉండగా, పేదరికం వాటిని మరింత తీవ్రతరం చేస్తుంది. ప్రత్యేకించి పురుషాధిపత్యాన్ని పేదరికం పదునెక్కిస్తుంది. 'అమ్మీ జాన్' కవితలో హనీఫ్ తల్లికి తండ్రికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని, తండ్రి ఆధిపత్యాన్ని, తల్లిని ప్రేమించే కొడుకుకు తండ్రి పట్ల రగిలే ఆగ్రహాన్ని చాలా హృద్యంగా, బలంగా కవిత్వీకరించాడు. 'అబ్బా ఎసట్లోకి తెచ్చేటోడే గాని ఎసరులా ఉడికేటోడు కాదు అమ్మీని ఏమన్నా అంటే ఊకుండ బుద్ధవదు దూరపోడైతే కత్తి దీస్కోని నరకబుచొద్ది' అని ధర్మాగ్రహం ప్రకటిస్తాడు.
అట్లని పేద తండ్రుల ఆధిపత్యానికి కారణాలేమిటో అన్వేషించలేని, అర్థం చేసుకోలేని వాడేమీ కాదు.
మొక్కల్ని గుండెల్లో విత్తుకునేవాడికి బిడ్డల్ని ప్రేమించలేక ఉండలేడు కదా మమ్మల్ని విడదీసే శత్రువు ఎవరో? ఆత్రంగా నాయన ఒళ్లో పడుకోవడానికి కోల్పోయిన చనుబాలు ఎంతో...' అని మరో కోణాన్ని కూడా స్పృశిస్తాడు.
ముస్లిం నేపథ్య చిత్రణలో మతాంతర ప్రేమ, వైఫల్యం కూడ ఒక ప్రధానాంశం. ఆ అంశాన్ని శక్తిమంతంగా ప్రకటించింది 'అలావా ప్రేయసి' కవిత.
అలాగే నది ఆత్మకథలా సాగుతూ సామాజిక దుస్థితిని చెప్పిన 'రాత్రి వెన్నెల నది నేను', భూగోళం ఏర్పాటు నుంచి మనిషి పరిణామక్రమం దాకా, ఇవాళ్ళి దాకా తాత్విక స్థాయిలో కవిత్వీకరించిన 'ధూళి', లోతైన తాత్విక ప్రతిపాదనలను, విశ్లేషణలను, నిర్ధారణలను గొప్ప కవితాత్మకతతో, ప్రతీకాత్మకంగా చిత్రించిన 'పది దృశ్యాలు', 'వానామృతం', 'మహావృక్షం', 'గొడుగు', 'రుచి', 'కీర్తి కాలువలు' వంటి ఎన్నో కవితలను కూడ విశ్లేషించాలని ఉంది గాని, ఇప్పటికే ఈ కవిత్వానికీ మీకూ మధ్య ఎక్కువ సేపున్నాను గనుక ఇక్కడ ఆపుతాను.
మొత్తంగా హనీఫ్ కవిత్వం చెప్పదలచినదేమిటి? 'సమాజం ఆలోచించడం మానేసి వినడమే అలవాటుగా మార్చుకుంది వినటమనే అంటువ్యాధి ప్రబలింది' అని తానే ఒక కవితలో అన్నట్టు, మనిషికి మళ్లీ ఆలోచనను ఇవ్వడమే హనీఫ్ కవిత లక్ష్యం. అవసరమైనప్పుడు వినడం మంచి అలవాటే గాని, మనుషులందరూ ఎప్పుడూ ఆలోచించకుండా, మాట్లాడకుండా, కేవలం వినేవాళ్లుగా, తల ఊపేవాళ్లుగా, విధేయులుగా మాత్రమే ఉండాలని పాలకుల కోరిక. హనీఫ్ దాన్ని అంటువ్యాధి అంటున్నాడు. ఆ అంటువ్యాధి నుంచి, వైరస్ నుంచి బైటపడి మనిషీ, సమాజమూ ఆలోచించేలా చేయడమే ఈ కవిత్వ ప్రయత్నం. అందుకే ఇది 'కన్నీటిని తర్జుమా చేసే ప్రయత్నం'. 'శ్వాస ఆడ్డం లేదు' అని గట్టిగా అరిచి చెప్పి, శ్వాస ఆడకుండా చేస్తున్న పరిస్థితులను మార్చాలని చెప్పడమే ఈ కవిత్వ ప్రయత్నం.
హనీఫ్ ప్రయత్నం సఫలమూ సార్ధకమూ అవుతుందనే నా విశ్వాసాన్ని మీ పఠనం బలపరుస్తుందనే నమ్మకంతో హనీఫ్ కవిత్వంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
నాది దు:ఖం వీడని దేశం ఆవిష్కరణ సభ
ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్, హైదరాబాద్ నందు జరుగుతుంది.
- ఎన్ వేణుగోపాల్ ,9849577028