Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి నిత్యం గుర్తుకు తెచ్చుకోవాల్సింది
భూమి మీద చిందించ బడిన రక్తం అంటూ
ఉదయాస్తమయాల్లోని ఉభయ సంధ్యల
ఎరుపు ఎరుక పరుస్తున్నది
ఏడాదికోమారు మోదుగు పూలతో
ఎరుపెక్కిన అరణ్యం కూడా
ఈ భూమి మీద చిందించ బడిన రక్తాన్నే
జ్ఞప్తికి తెస్తున్నది
కంచెల పొడుగూతా పగిలిన కాయల్లోంచి
కన్నెత్తి చూస్తున్న గురివింద గింజలూ
మందారాలూ మంకెనపూలూ
ఎర్ర మిరపలూ కుంకుం బంతులూ
భూమి మీద చిందించ బడిన రక్తం స్ఫురింప చేస్తున్నై
శాంత్యహింసల స్వాతంత్య్రోద్యమం మాటున సైతం
భూమి మీద చిందించ బడిన రక్తం కనిపిస్తున్నది
విద్రోహమో విమోచనమో విలీనమో
తెలగాణమంతటా
భూమి మీద చిందించ బడిన రక్తగానం వినిపిస్తున్నది
కత్తులకు కుత్తుకలు లోకువైనపుడల్లా
బాణాలకు ప్రాణాలు ఆవిరైన వేళల్లో
గుండ్లకు గుండెలు ఎదురొడ్డిన ప్రతి సారీ
ఈ భూమి మీద చిందించ బడిన రక్త జ్ఞాపకమే!
అరటిపళ్ళను సా మిల్లు లో కోస్తున్న
కఠినాత్ములను చూస్తుంటే
రేల పూలను రోళ్ళలో నూరుతున్న
రోకళ్ళను గమనిస్తుంటే
వెన్న ముద్దను గుండ్రాయితో నలగ్గొడుతున్న
శాడిస్టులను చూస్తుంటే
నాకు భూమి మీద చిందించ బడిన రక్త స్మతే!!
అందమైన అమ్మాయిల
దొండ పండు వంటి పెదాలు చూస్తే
నాకు బింబాధరలు మాత్రమే కాదు
భూమి మీద చిందించ బడిన రక్తంతో
అరుణకాంతుల నిప్పుకణికల
సూర్యబింబాధరలూ అగుపిస్తారు
కొన్ని స్వచ్ఛ స్ఫటిక నేత్రాల్లో మాత్రం
అమాంతం ఎరుపెక్కిన జీరలు మొలుస్తాయి
అవి...
భూమి మీద చిందించ బడిన రక్తం మరకల కంటిపోట్లు...
- నలిమెల భాస్కర్, 9346619934