Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉల్లిగడ్డలు...ఎడ్లబండిలేసుకొని ఊళ్ళపొంట పోయిరానాడు
వడ్లు బియ్యమేసుకొని ఇండ్లపొంట వచ్చే ఈనాడు
మార్కెట్... లేదు మారుబేరగాడు లేదు
మద్దతు ఇచ్చే ధరలు లేవు
మందలిచ్చే నాయకుడసలే లేడు
అగ్వకు...అడుగుతుంటే పాణమంతా
బిచ్చగాళ్ల గంటే ఇజ్జతనిపియ్యవట్టే
ఆకలైన వాళ్ళంటే అలుసే ఈ మనుషులకు
పైరు కోసం మా పానాలిచ్చిన పేరు రాకపాయే
పైకం కోసం మీరు మా జీవితాలను ఆడుకొవడ్తిరాయె
రవాణా... టికాణా పోగా మిగిలిన పైకమెంతో
ఆలు పిల్లల ఆశలకు ఇవి సరిపోవునో లేదో
ఎవుసమెందుకు చెస్తాన్నో...ఎవరి డొక్కలు నిండటానికో.
రైతు బతికితే రాజ్యం బతుకునంటరు
మరి రైతు గోస...రాజ్యానికి తాకదేమోనంటరా
ఆకలే గొప్ప శత్రువు అందరికీ...ఆకలి చనిపోయినంక ఇంక బతుకుడెక్కడిది
మాకు ఆకలే పెద్ద రోగం
రైతు మీద మీకుండే ఆశ(క)లే...మాయా కాన్సర్ రోగం
ఆకలే పానాలను తీస్తున్నాయి
మీ ఏతువ మాటలే మమ్మలను అవమానిస్తూన్నాయి
ఉత్తరాన రైతులంతా రస్తాలను వదిలి ఇండ్లపొంట చేరవట్టే
ఇక్కడంతా...ఇండ్లొదిలి అమ్మటానికి బయలుదేర వట్టే
పెప్సీకో దుంప తెగతెంపులాయె
కాంట్రాక్టు ఫార్మింగ్ కనమరుగైపాయే
కష్టమరును వెతకటం...కంటే ఉన్నవాటిని వాడుకొనుట మేలు
నీటుగా మనముండి తేటగా మాట్లాడుతే
ఆన్లైన్ లోన బియ్యాన్ని ఆమ్మవచ్చు
అమ్మేజాన్ ప్లిప్కార్టు లోన...ఆడ్ ఇవ్వవచ్చు
ఓపిక రైతుకుంటే...పస్తులు వాళ్ళకెదురైతాయి
ఆకలైన వాడేవడో ...ఆశపడేవాడెవడో
రంగులు మార్చే వాడేవడో....రాజకీయం చేసేటోడెవడో
అందరికీ ఆకలే దారి చూపును
ఆకలే....అమ్మబడినంక
రైతే రాజవును.
- మామిడాల వెంకట్రాజం