Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరూ ముట్టని సుగంధద్రవ్యం కోసం వెతుకుతుంటాను. దాన్ని అరుదైన తమలపాకులో చుట్టి అసాధారణ తాంబూలాన్ని అందించాలని నా ఉబలాటం. ముడిసరుకులు ఉత్కృష్టంగా ఉంటేనే కమనీయమైన విడియం కాయితమ్మీదికెక్కుతుంది. మాధ్యమం సంగతీ అంతే. తలలో తలపులు గలగలలాడినా అవి కలంలోంచి వెలికిరావడం కష్టమే ఒక్కోసారి. హంగుల రంగులనద్ది హృదయంగమంగా తీర్చిదిద్దేటందుకు చేసే యజ్ఞంలో యోగ్యయోచనలే సమిధలు. భావాకాశం రాల్చే ఊహల చినుకుల కోసం నోరు తెరిచిన లేఖినికి ఏమీ దొరక్కపోతే ఎదురయ్యేది పరిపరి విధాల పరితాపమే.
వేడెక్కిన 'తవ్వలను' మంచుతో తడిపి తడిమే శీతలస్పర్శ మిళితమైన శ్రేష్ఠ ఊహలను జల్లెడ పట్టి ఉపయోగించేందుకు కావలసిన సమయం ఇంత అని ఎలా చెప్పేది?! కంటకావృత మార్గాల వెంట నడిచే శాపోపహతులకు ఎంతటి గుండెనిబ్బరాన్ని కానుకగా ఇవ్వాలనేది చూసుకోవద్దా? లోపల వేసే దినుసుల రంగు రుచి వాసన బరువులను బేరీజు వేయటం తక్కువ కష్టమా! ఇన్ని పార్శ్వాలున్న హవనం కోసం ఎన్ని విధాల యాతన వడాలి! అయినా ఉత్పత్తి తృప్తికరంగా ఉంటే లోపల ఎంత సంతృప్తి! ఇది నిజంగా మోయతగిన బరువు, వేయతగిన దరువు.
- ఎలనాగ, 9866945424